వీసా పేరుతో మోసం

Cyber criminal arrest visa case - Sakshi

యూఎస్‌ వీసా ఇప్పిస్తామని రూ.5.9 లక్షలు స్వాహా

మతపరమైన విద్యకు అవకాశమంటూ టోకరా

బాధితుడి తండ్రి ఆర్మీలో చిరుద్యోగిగా పదవీ విరమణ

రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ సైబర్‌ నేరగాళ్ల పరం

సాక్షి, సిటీబ్యూరో: అమెరికాలో మతపరమైన విద్యాభ్యాసానికి సంబంధించిన వీసా, ఉపకారవేతనంతో పాటు చిరుద్యోగం కూడా ఇప్పిస్తామంటూ ఎర వేసిన సైబర్‌ నేరగాళ్ళు నగరంలో ఉంటున్న ఈశాన్య రాష్ట్రానికి చెందిన యువకుడి నుంచి రూ.5.9 లక్షలు కాజేశారు. సదరు యువకుడి తండ్రి ఆర్మీలో చిన్న ఉద్యోగిగా పదవీ విరమణ చేయడంతో వచ్చిన బెనిఫిట్స్‌కు సంబంధించిన నగదును బాధితుడు సైబర్‌ నేరగాళ్ళ ఖాతాల్లోకి బదిలీ చేశాడు. దీనిపై మంగళవారం ఫిర్యాదు అందుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.రవికిరణ్‌ కేసు దర్యాప్తు చేపట్టారు. మణిపూర్‌కు చెందిన షిగోయన్‌ షోల్‌హోల్‌ ప్రస్తుతం బంజారాహిల్స్‌ శ్రీరామ్‌నగర్‌లోని తమ బంధువుల ఇంట్లో ముంటున్నాడు. మతపరమైన విద్యను అభ్యసించిన ఇతను అందులో ఉన్నత విద్యాభాస్యం కోసం అమెరికా వెళ్ళాలని భావించాడు. ఇతడికి గత ఏడాది సెప్టెంబర్‌లో ఫేస్‌బుక్‌ ద్వారా భార్యభర్తలుగా చెప్పుకున్న నాన్సీ జెన్సన్, మైకేల్‌ జెన్సన్‌లతో పరిచయం ఏర్పడింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్నట్లు చెప్పిన నాన్సీ జెన్సన్‌ తన వాట్సాప్‌ నెంబర్‌ను సైతం షిగోయన్‌కు ఇచ్చింది. చాటింగ్స్‌  సందర్భంలో తాను అమెరికాలో మతపరమైన విద్యను అభ్యసించాలనుకుంటున్నట్లు షిగోయన్‌ చెప్పాడు. యూఎస్‌లోని కల్చరల్‌ హోమ్‌స్టే ఇంటర్నేషనల్‌ సంస్థ అలాంటి విద్యను బోధిస్తుందని, ఉపకార వేతనంగా నెలకు 500 డాలర్లు సైతం చెల్లిస్తుందని నాన్సీ చెప్పింది.

ఇందుకు షిగోయన్‌ ఆసక్తి చూపడంతో తాను వీసా సైతం ఏర్పాటు చేస్తానంటూ చెప్పిన ఆమె తమ ఇంట్లోనే ఉండాలని కోరింది. తామిద్దరం ఉద్యోగస్తులమైనందున ఇంట్లో ఉంటూ పిల్లల ఆలనపాలన చూస్తే అన్ని ఖర్చులు భరించడంతో పాటు నెలకు 2 వేల డాలర్లు చెల్లిస్తామని చెప్పింది. ఉచిత బసతో పాటు నెలకు 2500 డాలర్ల ఆదాయం వచ్చే అవకాశం ఉండటం, వీసా సైతం ఉచితంగా వస్తుండటంతో అమెరికా వెళ్ళేందుకు షిగోయన్‌ ఆసక్తి చూపాడు. వీసా ప్రాసెసింగ్‌కు సంబంధించిన వ్యవహారాలను భారత్‌లో ఉన్న తన సన్నిహితులు పర్యవేక్షిస్తారంటూ చెప్పిన నాన్సీ మరొకరిని రంగంలోకి దింపింది. షిగోయన్‌ను సంప్రదించిన అపేర్‌ అనే వ్యక్తి వీసాకు సంబంధించిన దరఖాస్తును మెయిల్‌ చేస్తూ ప్రాసెసింగ్‌కు కొంత ఖర్చవుతుందని చెప్పాడు. షిగోయన్‌ ఈ విషయాన్ని నాన్సీ దృష్టికి తీసుకువెళ్ళగా... అతడు అడిగిన మొత్తం చెల్లించాలని, అమెరికా వచ్చిన తర్వాత మొత్తం తిరిగి ఇచ్చేస్తానంటూ బుట్టలో వేసుకుంది. వారి మాటలు నమ్మిన షిగోయన్‌ ఆగంతకుడు కోరిన ప్రతిసారీ అతడు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో నగదు జమ/ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ వెళ్ళాడు.

ఇలా గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఈ ఏడాది నవంబర్‌ వరకు మొత్తం రూ.5.9 లక్షలు చెల్లించాడు. చివరకు నాన్సీ నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తించి మంగళవారం సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ రవికిరణ్‌ దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి షిగోయన్‌ డబ్బు డిపాజిట్‌/ట్రాన్స్‌ఫర్‌ చేసిన బ్యాంకు ఖాతాలు గుజరాత్‌కు చెందినవిగా గుర్తించారు. ప్రస్తుతం వాటిలో ఉన్న రూ.2.7 లక్షలు ఫ్రీజ్‌ చేయించారు. తన తండ్రి ఆర్మీలో చిరుద్యోగిగా పని చేసి పదవీ విరమణ చేశారని, అలా వచ్చిన డబ్బంతా తాను సైబర్‌ నేరగాళ్ళకు చెల్లించానంటూ షిగోయన్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వద్ద వాపోయాడు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందం గుజరాత్‌ వెళ్లనుంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top