సైబర్‌ పోకిరీ అరెస్ట్‌

Cyber Criminal Arrest in Hyderabad - Sakshi

నగ్న చిత్రాలు పంపించాలంటూ బ్లాక్‌మెయిల్‌

నిందితుడిని అరెస్టు చేసిన సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌

సాక్షి, సిటీబ్యూరో: ‘నీ నగ్న చిత్రాలు నాకు పంపించాలి. అలా చేయకపోతే మార్ఫింగ్‌ చేసిన నీ ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తా’ అంటూ నగరానికి చెందిన ఓ యువతిని వేధిస్తున్న సైబర్‌ పోకిరీని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. నిందితుడు సోమిశెట్టి సాయి కృష్ణగా గుర్తించి, 24 గంటల్లోనే అతడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అరెస్టు చేసినట్లు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. పాల్వంచలోని ఓల్డ్‌ సూరారం ప్రాంతానికి చెందిన సాయికృష్ణ ప్రైవేట్‌ ఉద్యోగి.

ఇతను ఫేస్‌బుక్‌లో మాధవి నాయుడు, సాయి స్వరూప నాయుడు పేర్లతో, ఇంటర్‌నెట్‌ నుంచి సంగ్రహించిన యువతుల ఫొటోలు వినియోగించి ఖాతాలు తెరిచాడు. వీటి ఆధారంగా దాదాపు 350 మంది మహిళలు, యువతులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపాడు. ఇలాంటి రిక్వెస్ట్‌ అందుకున్న ఓ నగర యువతి దానిని యాక్సెప్ట్‌ చేసింది. దీంతో ఆమె ఫేస్‌బుక్‌ పేజ్‌ నుంచి కొన్ని ఫొటోలను సంగ్రహించిన సాయికృష్ణ వాటిని అశ్లీల ఫొటోలతో మార్ఫింగ్‌ చేశాడు. ఇంటర్‌నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న అశ్లీల ఫొటోలకు ఈ యువతి తల భాగం ఫిక్స్‌ చేస్తూ వీటిని రూపొందించాడు. ఈ ఫొటోలను బాధితురాలితో పాటు ఆమె స్నేహితురాలి ఫేస్‌బుక్‌ పేజ్‌కు పంపించాడు. అంతటితో ఆగకుండా బాధితురాలికి అభ్యంతరకరమైన, అశ్లీల ఎస్సెమ్మెస్‌లు పంపించడం మొదలెట్టాడు. వీటిని ఆ యువతి ఖాతరు చేయకపోవడంతో నగ్న చిత్రాలు పంపాలని, లేనిపక్షంలో మార్ఫింగ్‌ చేసిన ఫొటోలను కుటుంబీకులు, స్నేహితులు, బంధువుల ఫేస్‌బుక్‌ పేజీలకు పంపిస్తానంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు.

ఇతడి వేధింపులు శృతిమించడంతో బాధితురాలు గురువారం రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ డి.జలేందర్‌రెడ్డి కేవలం 24 గంటల్లోనే సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడు సాయికృష్ణగా గుర్తించారు. పాల్వంచ వెళ్లిన ప్రత్యేక బృందం శుక్రవారం అతడిని అరెస్టు చేసి తీసుకువచ్చింది. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు యాక్సెప్ట్‌ చేసినా, వ్యక్తిగత సమాచారం, ఫొటోలు షేర్‌చేసినా ఇలాంటి దుష్ఫరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top