‘పశ్చిమ’లో సైబర్‌ వార్‌

Cyber Crime Cases In Visakhapatnam - Sakshi

గోపాలపట్నం: సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకీ చెలరేగిపోతున్నారు. మైండ్‌ గేమ్‌తో జనాన్ని బాధితులుగా చేస్తున్నారు. ఇంట్లోకి చొరబడకుండానే నేరాలకు పాల్పడుతున్నారు. భారీగా డబ్బులు కాజేస్తున్నారు. మొన్నటి వరకూ బ్యాంకు అకౌంట్‌ నంబర్లు, ఓటీపీ (వన్‌టైం పాస్‌వర్డ్‌లు) ఫోన్‌ ద్వారా తెలుసుకుని ఖాతాదారులను దెబ్బతీసే నేరగాళ్లు ఇపుడు పేటీఎం మోసాలకు కూడా దిగుతున్నారు. అందుకే ప్రజలు అత్యంత అప్రతమత్తంగా ఉండాలని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఎవర్నీ గుడ్డిగా నమ్మేయొద్దంటున్నారు. బ్యాంకుల నుంచి కొందరు, ఈ మెయిళ్లు పంపించి ఆఫర్లు ప్రకటించే వారు ఇంకొందరు..ఇలా మోసాలకు ఒడిగడుతున్నారని పోలీసులు గుర్తు చేస్తున్నారు.
 
ఇటీవల గోపాలపట్నంలో ఓ బేకరీ యజమానికి ఫోన్‌ వచ్చింది. మీరు బేకరీ యజమానే కదా..మాకు ఫలానా మొత్తంలో సరకు కావా లి..మీ అకౌంట్‌ నంబర్‌ చెబుతారా..అని ఓ అపరిచితుడు ఫోన్‌ చేశాడు. ఆ యజమాని వివరాలేవీ చెప్పలేదు. పోనీ పేటీఎం నంబరైనా చెబితే తాను నగదు ఆన్‌లైన్‌లో చెల్లిస్తానని ఆ అపరిచితుడు నమ్మించాడు. నంబర్‌ తెలుసుకున్నాక బేకరీ యజమాని ఫోన్‌కు సమాచారం వచ్చింది. అందులో వచ్చిన సమాచారం చెబుతారా? అని ఆ కేటుగాడు కోరడంతో అదంతా చదివిన ఆ యజమాని..అందులో కోడ్‌ నంబర్‌ ఫలాని ఉందని కూడా చెప్పడంతో.. సరే మీకు డబ్బులు పంపుతున్నా చూసుకోండంటూ ఆ వ్యక్తి చెప్పి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసేశాడు. అంతే బేకరీ యజమాని ఖాతా నుంచి రూ.7500 కనిపించలేదు. దీంతో ఆయన ఘొల్లుమన్నారు. 
ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న ఉద్యోగి తన క్రెడిట్‌ కార్డు కోసం బ్యాంకుకి మెయిల్‌ పెట్టారు. ఈ సంగతి నేరగాళ్లకు ఎలా తెలిసిందో ఏమో..బ్యాంకు ఖాతా నుంచి రూ.16వేల నగదు మాయం చేసేశారు. దీంతో ఆఉద్యోగి లబోదిబోమన్నారు.

గోపాలపట్నానికి చెందిన నరసింగరావు అనే వృద్ధుడు తన పర్సుతో పాటు ఏటీఎం కార్డు, పాన్‌కార్డు కూడా పోగొట్టుకున్నారు. అయితే అది దొరక్క దొరక్క నేరగాడికే దొరికింది. ఏటీఎం కార్డుపై వృద్ధుడి పుట్టిన రోజు తేదీ రాసి ఉంది. దీన్నే పిన్‌ నెంబరుగా పెట్టుకున్నారు. దీన్ని నేరగాడు ఓ సారి వేపగుంటలో ఏటీఎంకెళ్లి డ్రా చేస్తే నిజంగానే డబ్బులొచ్చాయి. ఇలా ఒక చోట అనుమానం రాకుండా వేపగుంట నుంచి విజయవాడ వరకూ అక్కడక్కడా ఏటీఎంలలో మొత్తం రూ.95వేలు డ్రా చేసేశాడు. రెండ్రోజుల తర్వాత ఆ వృద్ధుడు బ్యాంకుకెళ్లి నగదు డ్రా చేయాలని చూస్తే ఖాతాలో డబ్బులు లేకుండా డబ్బులెలా ఇవ్వాలంటూ బ్యాంకు ఉద్యోగులు ప్రశ్నించడంతో ఆయన గుండెజారిపోయింది. 

నమ్మితే మోసపోయినట్టే..
బ్యాంకుల నుంచి ఫోన్‌ వచ్చినా, పేటీఎం ద్వారా డబ్బులు పే చేస్తామని ఎక్కడో ఉండి షాపింగ్‌కి ప్రయత్నం చేసినా కచ్చి తంగా అనుమానించాలి. సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. ఫోన్‌ ద్వారా సంభాషణ కలిపి బ్యాంకు ఖాతాలు హ్యాక్‌ చేస్తుంటారు. క్షణాల్లో నగదు దోపిడీ చేసేస్తుం టారు. మోసాలు జరుగుతున్నా ప్రజలు ఫిర్యాదులు చేస్తుండడం బాధాకరం. నేరాల తీరుపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాం.


పైడియ్య, గోపాలపట్నం సీఐ  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top