దొంగతనం నేర్పిన సినిమా

Couple arrested in theft case - Sakshi

ఎమ్మార్వో దంపతుల పేరిట నగల చోరీ

నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో దొంగతనం

భలేదొంగల జంట అరెస్ట్‌  

దొంగల జంట స్వస్థలం కడప, నివాసం చిత్తూరు జిల్లా తిరుచానూరు

బుచ్చిరెడ్డిపాళెం : గల్ఫ్‌కెళ్లి డబ్బు బాగా సంపాదించారు. స్వస్థలానికి తిరిగి వచ్చి వడ్డీ వ్యాపారం చేశారు. తిరిగి చెల్లింపులు జరగకపోవడంతో బాగా నష్టపోయారు. ఆ సమయంలో టీవీలో చూసిన భలేదొంగలు సినిమాకు ఆకర్షితులయ్యారు.

భలేదొంగల జంట అవతారమెత్తి నగల దుకాణాల్లో దొంగతనానికి పాల్పడ్డారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఎమ్మార్వో దంపతుల పేరిట నగల దొంగతనాలు చేశారు. చివరికి బుచ్చిరెడ్డిపాళెంలో నగల దొంగతనానికి పాల్పడి పోలీసులకు దొరికి కటకటాల్లోకి వెళ్లారు

 స్థానిక పోలీస్‌స్టేషన్లో ఎస్సై కె.ప్రసాద్‌రెడ్డి సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొంగతనాల వివరాలను వెల్లడించారు. కడపకు చెందిన ఇరగంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సౌజన్య దంపతులు. 20 ఏళ్లుగా చిత్తూరు జిల్లా తిరునాచారులోని ప్రశాంతినగర్లో నివాసముంటున్నారు.

శ్రీనివాసులు రెడ్డి పీజీ పూర్తిచేశారు. పలుచోట్ల ఉద్యోగాలు చేశారు. గల్ఫ్‌కెళ్లి డబ్బు బాగా సంపాదించి వచ్చి తండల్‌ వ్యాపారం చేశారు. డబ్బు తిరిగి రాకపోవడంతో బాగా నష్టపోయారు. అప్పు తెచ్చి చేసిన పలు వ్యా పారాల్లోనూ నష్టం వచ్చింది.

దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో వా రికి భలేదొంగలు సినిమాలోని అంశాలు వారి దృష్టిలో పడ్డాయి. ఆ సినిమాలో హీరో హీరోయిన్లు కలిసి నగల దొం గతనాలను చేయడం గమనించారు.

ఈజీ మనీ కోసం

ఈజీ మనీకోసం ఆలోచించే సమయంలో భలేదొంగలు సినిమా వారికి దొంగతనాలు చేసేందుకు దొంగదారి చూపిం ది. ఆ సినిమాలో హీరో హీరోయిన్ల జంట తెలివిగా నగలు దొంగతనం చేసే తరహాలో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సూళ్లూరుపేట, గూడూరులోని నగల దుకాణాల్లో దొంగతనాలు చేశారు. అలాగే చిత్తూరు జిల్లా బనగానపల్లెలోనూ నగలు దొంగతనాలు చేశారు. 

బయటపడిందిలా...

బుచ్చిరెడ్డిపాళెంలోని నారాయణస్వామి జ్యూయలర్స్‌కు ఈ నెల 9వ తేదీన శ్రీనివాసులు రెడ్డి–సౌజన్య దంపతులు వచ్చారు. తాను ఎమ్మార్వోనని శ్రీనివాసులు రెడ్డి దుకాణ యజమానితో పరిచయం చేసుకున్నారు. కొన్ని నగలను ఎంచుకుని రెండు రోజుల్లో వస్తామని వెళ్లారు.

ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీ శ్రీనివాసులురెడ్డి దుకాణానికి వచ్చాడు. వచ్చే తొందరలో నగదు తేలేదని ఇంటి వద్దకు వస్తే నగదు ఇస్తానని చెప్పాడు.నమ్మకం లేకపోతే నగలు ఇవ్వవద్దు అంటూ చెప్పాడు. దీంతో ఎమ్మార్వో ఎందుకు మోసం చేస్తాడంటూ యజమాని దుకాణంలో పనిచేసే వ్యక్తిని శ్రీనివాసులురెడ్డికి ఇచ్చి పంపాడు.

అప్పటికే పథకం ప్రకారం రాజ్‌కిషోర్‌ థియేటర్‌ వెనుక అపార్ట్‌మెంట్‌ వద్ద సిద్ధంగా ఉన్న సౌజన్య వద్దకు శ్రీనివాసులు రెడ్డి వెళ్లాడు. నగలకు నగదు ఇవ్వమని సౌజన్యను అడుగగా ఉన్న నగదును ఇతరులకు ఇచ్చానని చెప్పింది. దీంతో శ్రీనివాసులు రెడ్డి ఏటీఎంలో నగదు తీసిస్తానని నగలు సౌజన్యకు ఇవ్వు చూస్తూ ఉంటుందని నమ్మబలికాడు.

దీంతో పనిచేసే వ్యక్తి నగలు సౌజన్యకు ఇచ్చాడు. నగదు కోసం శ్రీనివాసులురెడ్డి, పనిచేసే వ్యక్తి ఇద్దరూ ఏటీఎం వద్దకు వెళ్లారు. శ్రీనివాసులు రెడ్డి పర్స్‌ తీసి చూడగా అందులో ఏటీఎం కార్డులు లేవు. ఇంటికి వెళ్లి ఏటీఎం కార్డు తెస్తాను ఇక్కడే ఉండమని చెప్పి అక్కడి నుంచి సౌజన్య వద్దకు వెళ్లి ఆమెతో సహా శ్రీనివాసులురెడ్డి పరారయ్యాడు.

ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో దుకాణంలో పనిచేసే వ్యక్తి యజమాని వద్దకు వెళ్లి తెలిపాడు. దీంతో తాము మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్సై కె. ప్రసాద్‌రెడ్డి నిఘా వేసి నెల్లూరు చిన్నబజారులో నగలు అమ్ముతున్న జంటను పట్టుకుని ఆరా తీశారు.

పలుచోట్ల  శ్రీనివాసులు రెడ్డి, సౌజన్య దొంగతనాలు చేసినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో వారి వద్ద ఉన్న 6 చైన్లు, 3 ఉంగరాలు, 3 జతల బుట్టకమ్మలను రికవరీ చేసినట్లు ఎస్సై తెలిపారు.  విలేకరుల సమావేశంలో ఏఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు గోవర్ధన్, విజయ్‌భాస్కర్‌ పాల్గొన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top