కరోనా ఉధృతితో ఆందోళన

Coronavirus Super Spread in GHMC Hyderabad - Sakshi

నగరంలో కోవిడ్‌ విస్తరణ కొనసాగుతోంది. వైరస్‌ వ్యాప్తి తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ నిబంధనలు పాటించే విషయంలో ప్రజల నిర్లక్ష్యం సైతం మహమ్మారి వ్యాప్తికి కారణం అవుతోంది. కరోనా తగ్గినందునే నిబంధనలు సడించారని భావించిన నగరవాసులు మాస్కులు లేకుండా.. భౌతిక దూరం పాటించకుండా ఇష్టారాజ్యంగా తమ దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ మహమ్మారి నగరంలో కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు, మరణాలే ఇందుకు నిదర్శనం. గ్రేటర్‌ పరిధిలో ఆదివారం రికార్డు స్థాయిలో 659 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మరణించారు.

వెంగళరావునగర్‌: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో 18 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–19 ఉప కమిషనర్‌ ఎ.రమేష్‌ పేర్కొన్నారు. ఎర్రగడ్డ డివిజన్‌లోని ఎర్రగడ్డ బస్తీకి చెందిన ఓ వ్యక్తి, యువతి, బాబానగర్‌లోని మహిళ, ప్రేమ్‌నగర్‌లో ఓ వ్యక్తి) కోవిడ్‌ బారిన పడ్డారన్నారు. యూసుఫ్‌గూడ డివిజన్‌ యూసుఫ్‌గూడ బస్తీలోని ఇద్దరికి, లక్ష్మీనరసింహనగర్‌లోని ఓ వ్యక్తికి, కృష్ణానగర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకిందన్నారు. బోరబండ డివిజన్‌ బోరబండ బస్తీకి చెందిన ఇద్దరికి, స్వరాజ్‌నగర్‌లో ఒకరికి, రాజ్‌నగర్‌లో మరొకరికి మహమ్మారి సోకిందన్నారు. సాయిబాబానగర్‌బస్తీలో ఓ మహిళకు, రహమత్‌నగర్‌ డివిజన్‌ రహమత్‌నగర్‌ బస్తీలో ఇద్దరు మహిళలకు, వినాయకనగర్‌బస్తీలోని ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. వెంగళరావునగర్‌ డివిజన్‌ జవహర్‌నగర్‌బస్తీకి చెందిన మరో వ్యక్తికి కరోనా బారిన పడ్డారన్నారు. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించిన వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచామని ఆయన వివరించారు.

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో...
దుండిగల్‌: కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో మరో పది కోవిడ్‌–19 కేసులు నమోదయ్యాయి. ప్రగతినగర్‌కు చెందిన వ్యక్తి(45) ఓ ప్రముఖ దిన పత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తున్నారు. ఇతనికి వ్యాధి లక్షణాలు కనిపించడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. సుభాష్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి (42)కి, జగద్గిరిగుట్టకు చెందిన వ్యక్తి (25), జీడిమెట్ల రుక్మిణి ఎస్టేట్స్‌కు చెందిన మహిళ(45),  జీడిమెట్లకు చెందిన మహిళ(48), ఇంద్రసింగ్‌నగర్‌కు చెందిన వృద్ధురాలు (65), న్యూషాపూర్‌నగర్‌కు చెందిన వృద్ధురాలు(60), రాజీవ్‌ గృహకల్పకు చెందిన మహిళ(35), రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన వృద్ధుడు (88), సూరారానికి చెందిన వ్యక్తి (45)లకు పాజిటీవ్‌ రావడంతో వారందరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబీలను హోం క్వారంటైన్‌ చేసి పరిసర ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్‌ను పిచికారీ చేయించారు.

శేరిలింగంపల్లి మండల పరిధిలో...
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండల పరిధిలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. మాదాపూర్‌లో 2, రాయదుర్గం ఓయూ కాలనీ, గౌలిదొడ్డి, చందానగర్‌ ఫ్రెండ్స్‌ కాలనీల్లో ఒక కేసు చొప్పున ఉన్నట్లు అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ రాంరెడ్డి తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ఐదుగురు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు.

సీ సెక్షన్‌లో తల్లీకూతుళ్లకు...
అడ్డగుట్ట: అడ్డగుట్ట సీ సెక్షన్‌లో నివాసముంటున్న తల్లీకూతుళ్లు కరోనా బారిన పడ్డారు. సీ సెక్షన్‌కు చెందిన ఓ మహిళ(35) ఆమె కూతురు(17)కు కరోనా సోకింది. ఇటీవల అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మహిళ ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్ష నిర్వహించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది.

నారపల్లిలో...
పోచారం: నారపల్లిలోని శివాజీనగర్‌కు చెందిన 22 ఏళ్ల యువకునికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇటీవల సిటీకి వెళ్లి వచ్చినందుకే కరోనా సోకిందని చెబుతున్నారు. దీంతో నారపల్లిలో కరోనా కలవరం మొదలైంది.

ఘట్‌కేసర్‌ మండలంలో...
ఘట్‌కేసర్‌: మండలంలోని మాదారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(34)కి, చౌదరిగూడ గ్రామంలోని శేషాద్రి కాలనీకి చెందిన ఓ ఏఎన్‌ఎం(50)కు కరోనా పాజిటివ్‌  వచ్చినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. మాదారం గ్రామానికి చెందిన వ్యక్తి యాదాద్రి జిల్లా బీబీనగర్‌ పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా చౌదరిగూడకు చెందిన మహిళ నగరంలోని తిరుమలగిరి ప్రాంతంలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. మాదారం గ్రామాన్ని, శేషాద్రి కాలనీని రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. 

రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో అధికారులు, ఎంపీపీ పర్యటన
కరోనా పాజిటివ్‌ రావడంతో రెడ్‌జోన్‌గా ప్రకటించిన మండంలోని మాదారం గ్రామాన్ని, చౌదరిగూడ శేషాద్రి కాలనీని నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి యాదగిరి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే దారులు, దుకాణాలను మూసివేయించి గ్రామంలో హైపోక్లోరైడ్‌ ద్రావవాన్ని స్ప్రే చేయించారు. సర్పంచ్‌ యాదగిరి, మాజీ సర్పంచ్‌ రాములుగౌడ్, వార్డు సభ్యుడు సుధాకర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

రామంతాపూర్‌లో...
రామంతాపూర్‌: కరోనా వైరస్‌ బారిని పడిన రామంతాపూర్‌ వెంకట్‌రెడ్డినగర్‌కు చెందిన ఓ వ్యక్తి (50) మృతిచెందాడు. గణేశ్‌నగర్‌కు చెందిన వ్యక్తి(42), యువకుడు(29), వివేక్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి (56)లకు పాజిటివ్‌గా తేలింది.

బోడుప్పల్‌లో...
బోడుప్పల్‌: బోడుప్పల్‌లో ముగ్గురికి కరోనా సోకింది. కేశవ్‌నగర్‌లో ఓ వ్యక్తి(36), బాలాజీ హిల్స్‌ కాలనీలో వ్యక్తి(53), మల్లికార్జున్‌నగర్‌ కాలనీలో యువకుడి(25)కి కోవిడ్‌ నిర్ధారణ అయ్యింది. వారిని హోం క్వారెంటైన్‌లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు.

పిర్జాదిగూడ నగరపాలక పరిధిలో...
మేడిపల్లి: పిర్జాదిగూడ నగరపాలక పరిధిలో ఓం విహార్‌కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. బషీర్‌బాగ్‌లో ఉమెన్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా పని చేస్తున్న ఆయన(52)కు కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఎస్‌ఐ కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచారు.

ఉప్పల్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో...
ఉప్పల్‌: ఉప్పల్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో ఆదివారం 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉప్పల్‌ సీతారామకాలనీకి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి(26), బీరప్పగడ్డ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు(29), విజయపురి కాలనీల ముగ్గురు మహిళలు (39), (40), (44), ఉప్పల్‌కు చెందిన వ్యక్తి (32), బాలాజీ ఎన్‌క్లేవ్‌లో వ్యక్తి (32), కళ్యాణ్‌పురిలో ఓ వ్యక్తికి, రామంతాపూర్‌లో వ్యక్తికి, వాసవీనగర్‌లో ఓ వ్యక్తి(31)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు.

జియాగూడ, కార్వాన్‌లలో...
జియాగూడ: జియాగూడ కార్వాన్‌ డివిజన్లలోని పలు బస్తీలలో సుమారు 16 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే జియాగూడలో కరోనా పాజిటివ్‌ కేసులు మూడొంతులు దాటాయి. ఒక వృద్ధురాలు ఆదివారం కరోనాతో మృతిచెందింది. దీంతో నేటి వరకు 21 మంది చనిపోయారు.  

గోషామహల్‌ పరిధిలో...
అబిడ్స్‌: జీహెచ్‌ఎంసీ గోషామహల్‌ 14వ సర్కిల్‌ పరిధిలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్నది. ఒకే రోజు పలు ప్రాంతాల్లో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళ్‌హాట్‌ జాలిహనుమాన్‌లో ముగ్గురికి, సీతారామ్‌బాగ్‌లో ఒక్కరికి, ఝాన్సీచౌరాయిలో ముగ్గురికి, ఆగాపురాలో ఒకరికి, ధూల్‌పేట్‌లో నలుగురికి, షాహినాయత్‌గంజ్‌ గోషామహల్‌ ప్రాంతాల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నిత్యం జీహెచ్‌ఎంసీ గోషామహల్‌ 14వ సర్కిల్‌ పరిదిలోని ధూల్‌పేట్‌ పరిసర ప్రాంతాలు, చుడిబజార్, బేగంబజార్, గోషామహల్‌ ప్రాంతాలలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయినా నివారణ చర్యలు చేపట్టే విషయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో శానిటైజేషన్‌ కూడా చేయడం లేదు.  

బ్యాంక్‌ ఉద్యోగికి...
మల్కాజిగిరి: మల్కాజిగిరి డివిజన్‌ విష్ణుపురికాలనీకి చెందిన ఓ వ్యక్తి(57) ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలోని ఎస్‌బీఐలో ఉద్యోగం చేస్తున్నారు. మూడు రోజులుగా ఆరోగ్యం బాగా లేనందున పరీక్షలు చేయించుకోవడంతో కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

గౌతంనగర్‌లో...
గౌతంనగర్‌: గౌతంనగర్‌ కాలనీలోని ఓ వ్యక్తి(44) కరోనా మహమ్మారి బారిన పడ్డారు. సదరు వ్యక్తి నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆయన కుటంబ సభ్యులను హోం కారైంటెన్‌లో ఉంచామన్నారు.

ఎల్‌బీనగర్‌లో...  
చంపాపేట: జీహెచ్‌ఎంసీ ఎల్‌బీనగర్‌ సర్కిళ్ల పరిధిలో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. గడచిన 15 రోజులుగా కాస్త తగ్గుముఖంపట్టిన వైరస్‌ వ్యాప్తి రెండు మూడురోజులుగా పెరుగుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆయా సర్కిళ్ల పరిధిలో మొత్తం 25 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం వైరస్‌ వ్యాప్తి విజృంభిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

గాంధీనగర్‌లో...
చిక్కడపల్లి: గాంధీనగర్‌ డివిజన్‌లో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. గాంధీనగర్‌ కెనరా బ్యాంక్‌ వద్ద నివసిస్తున్న ఓ వ్యక్తి(35)కి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఆయను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top