నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి! 

Constable Died In RTC Bus Collision In Atmakur Zone - Sakshi

ఆర్టీసీ బస్సు ఢీకొని కానిస్టేబుల్‌ దుర్మరణం  

బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఘటనకు కారణం 

సాక్షి, అనంతపురం సెంట్రల్‌: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.  ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ కానిస్టేబుల్‌ దుర్మరణం చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. ఆత్మకూరు మండలం తలుపూరుకు చెందిన ప్రభాకర్‌రెడ్డి(40) ఆర్మీలో  ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం 2018 బ్యాచ్‌ కానిస్టేబుల్‌(పీసీ3685)గా చేరాడు. తొలి పోస్టింగ్‌ గుడిబండ పోలీసుస్టేషన్‌కు వచ్చింది. ఇటీవల రైళ్లలో నేరాలు సంఖ్య పెరుగుతుండడంతో సివిల్‌ పోలీసులు, రైల్వే పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ఇందులో భాగంగా గుడిబండలో పని చేస్తున్న ప్రభాకర్‌రెడ్డి డెప్యుటేషన్‌పై 10 రోజులుగా అనంతపురం రైల్వేస్టేషన్‌ పరిధిలో బందోబస్తు విధులు చేపడుతున్నాడు. విధులు ముగించుకున్న ఆయన శనివారం ఉదయం స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు.
 
హెల్మెట్‌ ధరించినా.. 
నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులో రాజా హోటల్‌ వద్ద వెనుక నుంచి హైదరాబాద్‌ నుంచి కళ్యాణదుర్గం వెళుతున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను స్వల్పంగా ముందుభాగంలో ఢీ కొట్టింది. దీంతో  ప్రభాకర్‌రెడ్డి కుడి వైపునకు పడిపోయాడు. బస్సు అలాగే ముందుకు వెళ్లడంతో వెనుక చక్రాలు తలపై వెళ్లాయి. హెల్మెట్‌ ధరించినప్పటికీ   తల నుజ్జునుజ్జు కావడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ వేగంగా నడపడంతో పాటు అజాగ్రత్తగా వ్యవహరించడంతో ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య విజయలక్ష్మి, కుమారుడు జీవన్‌కుమార్‌రెడ్డి, కుమార్తె సాత్విక ఉన్నారు. ఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. ట్రాఫిక్‌ డీఎస్పీ మున్వర్‌హుస్సేన్, అనంతపురం డీఎస్పీ పీఎన్‌బాబు  ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ట్రాఫిక్‌ డీఎస్పీ తెలిపారు. 

కానిస్టేబుల్‌ మృతికి ఎస్పీ నివాళి 
ఆత్మకూరు/ అనంతపురం సెంట్రల్‌ : కానిస్టేబుల్‌ ప్రభాకర్‌రెడ్డి మృతికి జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు నివాళులర్పించారు. తలుపూరుకు చెందిన ప్రభాకర్‌రెడ్డి శనివారం ఉదయం అనంతపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు.  ఎస్పీ సత్యయేసుబాబు గ్రామానికి చేరుకుని ప్రభాకర్‌రెడ్డి మృతదేహం వద్ద నివాళులర్పించారు. అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్పీ వెంట డీఎస్పీ పీఎన్‌బాబు,  పోలీసు అధికారుల సంఘం అడహక్‌ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్‌నాథ్, సుధాకర్‌రెడ్డి, ఆత్మకూరు సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ చంద్రశేఖర్, సిబ్బంది ఉన్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top