క్షణిక ఏమరుపాటు.. కుటుంబం వీధులపాలు

The Condition Of A Medical Employee in A Train Accident Is Critical In Nellore District - Sakshi

రైలు ప్రమాదంలో వైద్యశాఖ ఉద్యోగి తిరుపాలు పరిస్థితి  విషమం 

కంటికి రెప్పలా చూసుకున్నడాక్టర్ల బృందం 

క్షణిక ఏమరుపాటు ఓ కుటుంబాన్ని వీధుల పాల్జేసింది. డ్యూటీకి బయలు దేరిన ఆ వైద్యశాఖ ఉద్యోగి నిద్రమత్తులో దిగాల్సిన స్టేషన్‌ దాటేశాడు. అనంతరం హడావుడిగా దిగబోయి పడుగుపాడు స్టేషన్‌లో జారిపడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని చేయి పూర్తిగా వేరయిపోయింది. మరో కాలు సగభాగం కండ, ఎముకలు చీల్చుకొచ్చాయి. మరొక అరచేయి మూడు భాగాలుగా కట్‌  అయింది. ఈ హృదయ విదారక సంఘటన గురువారం చోటు చేసుకుంది.   

సాక్షి, నెల్లూరు: గూడూరులో నివాసం ఉంటున్న బంకా  తిరుపాలు బాలాయపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్‌ సూపర్‌ వైజర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. నెల్లూరులో జరిగే వైద్యశాఖ  స్వాస్థ విద్యా వాహిని సమీక్ష కార్యక్రమానికి ఆయన ఉదయాన్నే గూడూరు నుంచి మెమోరైల్లో బయలు దేరాడు. ప్రయాణిస్తూ నిద్ర పోయాడు. నెల్లూరు స్టేషన్‌ వచ్చినా దిగలేదు. పడుగుపాడు సమీపంలోకి వచ్చేసరికి నిద్రనుంచి మేల్కొన్న ఆయన నిధానంగా వెళుతున్న రైలు నుంచి హడావుడిగా దిగబోయాడు. ఈ క్రమంలో జారి రైలు కింద పడిపోయాడు. అక్కడికక్కడే ఒక చేయి పూర్తిగా కట్‌ అయి శరీరం నుంచి వేరయిపోయింది. మరో అర చేతి భాగం దాదాపు కట్‌ అయిపోయింది. ఒక కాలు తెగి కొంత వరకు మాత్రమే శరీరానికి అతుక్కుంది. మరో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తం భారీగా కారిపోయింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హడావుడిగా తిరుపాలును పెద్దాస్పత్రికి తరలించారు. 

శక్తి వంచన లేకుండా వైద్య సేవలు
పెద్దాస్పత్రిలో అతని దీనావస్థను గమనించిన డాక్టర్‌ మస్తాన్‌బాషా తానే తిరుపాలును స్టెచర్‌పై పడుకోబెట్టి వేగంగా ఆపరేషన్‌ థియేటర్‌లోనికి తీసుకెళ్లాడు. ఆర్థో విబాగాధిపతి డాక్టర్‌ సుబ్బారావు, మరో 10 మంది డాక్టర్ల బృందం తమ శక్తి వంచన లేకుండా వైద్యసేవలందించారు. ఆపరేషన్‌ చేసి బతికించేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు శాయశక్తులా ప్రయత్నించారు. అయితే తిరుపాలు పరిస్థితి గంట, గంటకూ విషమంగా మారిందని డాక్టర్లు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజ్యలక్ష్మి, పీఓడీటీ డాక్టర్‌ ఉమామహేశ్వరి, హంస అసోసియేషన్‌ అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌రావు తదితరులు ఆస్పత్రి వద్దకు వచ్చి మెరుగైన వైద్య సేవలందించేందుకు విశేషంగా కృషి చేశారు. ఎప్పటికప్పుడు ఆస్పత్రి డాక్టర్లతో కో–ఆర్డినేట్‌ చేసుకుంటూ తమ శాఖ ఉద్యోగిని బతికించుకునేందుకు కృషి చేశారు. 

తల్లడిల్లిన తిరుపాలు కుటుంబ సభ్యులు 
తిరుపాలుకు భార్య, పాప, బాబు ఉన్నారు. బాబు చిత్తూరులో బీటెక్‌ చదువుతున్నాడు. పాప నెల్లూరులో ఇంటర్మీడియట్‌ చదువుతోంది. కుటుంబ పెద్ద తిరుపాలు ప్రమాదానికి గురైన సంఘటన తెలిసిన వారంతా ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. నాన్న ...నాన్న అంటూ రోధిస్తున్న వారిని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top