సీఎంఓ డైరెక్షన్‌.. కలెక్టరేట్‌ యాక్షన్‌ !

CMO Direction In Girl Pregnancy Case YSR Kadapa - Sakshi

బాలికను గర్భిణిని చేసిన బాలికల గృహం సూపరింటెండెంట్‌పై కేసు నమోదు

కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్న యంత్రాంగం  

బాధితురాలిని ఇతరులెవ్వరూ కలవద్దంటూ ప్రత్యేక ఆంక్షలు

ప్రజాప్రతినిధులు, హక్కుల సంఘాలపై నియంత్రణ

సాక్షి ప్రతినిధి కడప : ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే బాలికల గృహంలో తలదాచుకునే వారికి రక్షణగా నిలవాల్సిన ఆ అధికారి రాక్షసుడిలా మారాడు. అభం శుభం తెలియని మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడి గర్భిణిని చేశాడు. ఎట్టకేలకు ఈ ఘటనలో నిందితుడైన బాలికల గృహం సూపరింటెండెంట్‌పై కేసు నమోదు కాగా ఆ కేసును నీరు గార్చేలా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుడిని కాపాడే క్రమంలో బాధితురాలైన బాలికను ఎవరూ ఎవరూ కలవొద్దంటూ కలెక్టర్‌ కనుసన్నల్లో ఆంక్షలు విధించారు. నిందితుడికి అధికార టీడీపీతో ఉన్న ప్రత్యక్ష సంబంధాలే అందుకు కారణంగా తెలుస్తోంది.

తిరుపతి కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ బాలికల గృహంలో కడపకు చెందిన ఓ మైనర్‌ బాలిక తలదాచుకుంటోంది. ఆ బాలికపై సూపరింటెండెంట్‌ హోదాలో ఉన్న వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వ్యవహారం బహిర్గతం అవుతుందని భావించి తిరుపతి నుంచి చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ వారికి అప్పగించి చేతులు దులుపుకున్నాడు. సీడబ్ల్యూసీ యంత్రాంగం కడప నగరంలోని ఓ వసతి గృహంలో ఆ బాలికను చేర్పించింది. అంతవరకు వ్యవహారం బాగానే ఉన్నా అర్ధాంతరంగా బాలిక రక్తస్రావానికి గురైంది. ఊహించని పరిణామంతో హోం నిర్వాహకురాలు జిల్లా అత్యున్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఆమేరకు రిమ్స్‌లో చికిత్స చేయించారు. కాగా ఈ విషయమై చిన్నచౌక్‌ పోలీసులు కేసు నమోదు చేసి తిరుపతికి బదిలీ చేశారు.

సీఎంఓ డైరెక్షన్‌ మేరకే..
బాలికపై లైంగిక దాడి జరిగిన వ్యవహారా>న్ని జిల్లా యంత్రాంగం తొలుత సీరియస్‌గా తీసుకుంది. వైద్య పరీక్షలతోపాటు, బాలిక కథనాన్ని రికార్డు   చేసినట్లు సమాచారం. వెంటనే తిరుపతి హోంలో విధులు నిర్వర్తిస్తూ అందుకు బాధ్యుడైన బి.నందగోపాల్‌పై కేసు కూడా నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన తర్వాత అమరావతిలోని సీఎంఓ వర్గాలు రంగప్రవేశం చేశాయి. ఈ వ్యవహారంలో మిన్నకుండిపోవాలని ఉండిపోవాలని ఆదేశించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దాంతో తిరుపతి హోం బాధ్యుడు నందగోపాల్‌పై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం తిరుపతికి కేసును బదలాయించారు. పది రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేదు. పైగా బాధితురాలైన బాలికను ఎవ్వరూ కలవరాదంటూ ఆంక్షలు విధించారు. ఈ నిర్ణయం వెనుక బా«ధితురాలికి మద్దతుగా ఎవ్వరూ ఉండకూడదనే భావన అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. నందగోపాల్‌కు అధికార పార్టీ నేతలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండటం, ఓ మాజీ ఎమ్మెల్సీ సమీప బంధువు కావడమే అందుకు కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు.

30 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి :మానవహక్కుల వేదిక కన్వీనర్‌ కెజయశ్రీ
 బాధితురాలితో మాట్లాడొద్దని 30 ఏళ్ల అనుభవంలో మొదటిసారి వింటున్నా. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నందగోపాల్‌పై ఎలాంటి చర్యలు లేకపోగా, బాధితురాలితో ఎవ్వరూ మాట్లాడొద్దంటూ ఆంక్షలు విధించడం ఏమిటి? కలెక్టర్‌ పేరు చెప్పి అడ్డుకోవడం మరీ విడ్డూరం. కలెక్టర్‌కు మెసేజ్‌లు చేసినా స్పందన లేదు, పైగా సీసీ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేసినా నిరుపయోగమే అయింది. మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు.

మర్మమేమిటో అర్థం కావడం లేదు: ఎమ్మెల్యే అంజద్‌బాషా
లైంగిక దాడికి గురైన బాలికతో మాట్లాడేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వకపోవడంలో మర్మమేమిటో అర్థం కావడం లేదని కడప ఎమ్మెల్యే ఎస్‌బీ అంజద్‌బాషా అన్నారు. ప్రజాప్రతినిధి అయిన తనను కూడా కలవద్దని ఆంక్షలు విధించారని, సీడబ్ల్యూసీ చైర్మన్‌ శివకామిని స్టేట్‌మెంట్‌ ఆధారంగా తాను మీడియాకు తెలిపానన్నారు. అధికారులు ఈ కేసును ఏం చేయబోతున్నారు? వాస్తవాలను తెలపడానికి ఎందుకు అభ్యంతరం చెబుతున్నారో తెలియడం లేదన్నారు. దీని వెనుక ఉన్న వారిని కాపాడి కేసును నీరు గార్చేందుకు కుట్ర చేస్తున్నారన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయన్నారు. సంబం«ధిత శాఖ మంత్రి పరిటాల సునీతగాని, జిల్లా కలెక్టర్, ఎస్పీల్లో ఎవరైనా ఇందులో దాగి ఉన్న నిజాలను ప్రజలకు తెలపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top