ఉద్యోగాల పేరుతో టోకరా

Cheating With Fraud Jobs in Hyderabad - Sakshi

నిందితుడి అరెస్టు పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు

సాక్షి, సిటీబ్యూరో: కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో ఎర వేసి అందినకాడికి దండుకుని నిరుద్యోగులను నిండా ముంచుతున్న కన్సల్టెన్సీ నిర్వాహకుడిని మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. అతడికి సహకరించిన మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు మంగళవారం వెల్లడించారు. నెల్లూరు జిల్లా, గోట్లగుంట గ్రామానికి చెందిన తోట ముని సుందర్‌ బాబు ఇంటర్మీడియేట్‌ వరకు చదివాడు. అనంతరం ఏడేళ్ల పాటు పాల వ్యాపారం చేశాడు. 2009లో నగరానికి వలసవచ్చిన సుందర్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ జాబ్‌ ప్లేస్‌మెంట్‌ సంస్థలో రిసెప్షనిస్ట్‌గా చేరాడు. దీంతో ఈ రంగంపై పట్టు సాధించిన అతను 2010లో దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలోనే ఎన్‌లైట్‌ సాఫ్ట్‌ సొల్యూషన్స్‌ పేరుతో సొంతంగా సంస్థను ఏర్పాటు చేశాడు. తీవ్రమైన నష్టాలు రావడంతో కనీసం సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరాడు. ఈ నేపథ్యంలోనే 2017లో కన్సల్టెన్సీని మూసేసిన అతను సొంత ఊరికి వెళ్లిపోయాడు.

అయితే అక్కడ కూడా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ తిరిగి 2018 నవంబర్‌లో సిటీకి వచ్చాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోనే ఈష సొల్యూషన్స్‌ పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేసి ఇద్దరు ఉద్యోగులను నియమించుకున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈసారి మోసాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో ఫేస్‌బుక్‌తో పాటు వివిధ జాబ్‌ పోర్టల్స్‌లో ప్రకటనలు ఇచ్చాడు. వీటికి ఆకర్షితులైన వారు బయోడేటాలతో సుందర్‌ పేర్కొన్న కార్యాలయానికి వచ్చేవారు. ఇలా వచ్చిన వారితో తనకు అనేక కంపెనీల్లోని హెచ్‌ఆర్‌ విభాగాలతో సంబంధాలు ఉన్నాయని చెప్పే ఇతను ఉద్యోగం ఖరారంటూ హామీ ఇచ్చేవాడు. వారి నుంచి రూ.లక్ష లేదా రూ.2 లక్షలు వసూలు చేసి నకిలీ ఆఫర్‌ లెటర్‌ ఇచ్చేవాడు. దీనిని తీసుకుని ఆయా కంపెనీలకు వెళ్లే ఉద్యోగార్థులు తాము మోసపోయామని గుర్తించేవారు. ఆపై సుందర్‌ను సంప్రదించడానికి ప్రయత్నిస్తే సెల్‌ఫోన్‌ నెంబర్, కార్యాలయం మార్చేసి దొరక్కుండా తప్పించుకునేవాడు. ఈ పంథాలో పలువురిని మోసం చేసిన సుందర్‌కు రాహుల్‌ అనే ముంబై వాసి కూడా సహకరించాడు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు టి.శ్రీధర్, కె.శ్రీనివాసులు వలపన్ని సుందర్‌ను పట్టుకున్నారు. అతడి కార్యాలయం నుంచి వివిధ వస్తువులు స్వాధీనం చేసుకుని కేసును స్థానిక పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న రాహుల్‌ కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top