మిస్సింగ్‌ మిస్టరీ

Boy Missing Case Still Mystery - Sakshi

దొరకని బాలుడి ఆచూకీ

నాలుగు రోజులుగా పోలీసుల తనిఖీలు

తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

కామారెడ్డి క్రైం:  అప్పటి దాకా తండ్రితో కలిసి గుమ్మం ముందు ఆడుకున్నాడు.. కాలకృత్యాలకు వెళ్లి వచ్చే సరికి కనిపించకుండా పోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మూడేళ్ల కొడుకు కనిపించక పోవడం తల్లిదండ్రులను కలవరపెడుతోంది. జిల్లా కేంద్రంలోని భరత్‌ నగర్‌ కాలనీలో తోటి పిల్లలతో కలిసి ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడు గణేష్‌ మిస్సింగ్‌ కేసు మిస్టరీగా మారింది. శుక్రవారం సాయంత్రం నుంచి వెతుకుతున్నా ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు. ఎవరైనా బాలుడ్ని కిడ్నాప్‌ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి బాలుడి కోసం గాలిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అడుగడుగునా ఇప్పటికే గాలించారు. చుట్టు పక్కల ప్రాంతాలు, పట్టణాల్లోనూ జల్లెడ పడుతున్నారు. పట్టణంలోని వివిధ షాపుల ముందు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
భరత్‌నగర్‌లోని ఓ ఇంట్లో కటికె గోపి, ఉమా దంపతులు కొంత కాలంగా నివాసముంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు. చిన్నవాడైన గణేష్‌కు మూడేళ్ల వయస్సు. గణేష్‌ పుట్టు వెంట్రుకలు తీసేందుకు కుటుంబమంతా కలిసి మహారాష్ట్రలోని ఉద్‌గిర్‌కు గురువారం వెళ్లారు. వెంట్రుకలు తీయించుకుని శుక్రవారం కామారెడ్డికి తిరిగి వచ్చారు. సాయంత్రం పూట ఇంటి ముందు తండ్రితో కలిసి గడిపిన గణేష్‌.. తండ్రి ఇంట్లోకి వెళ్లగానే ఆడుతూ బయటకు వెళ్లి తప్పిపోయాడు. పిల్లవాడు కనిపించడం లేదని చుట్టు పక్కల అంతా వెతికారు. ఆ సమయంలో ఉరుములు మెరుపులు వచ్చి కరెంట్‌ పోయింది. దీంతో సీసీ కెమెరాల్లో కూడా బాలుడి ఆచూకీ కనిపించ లేదు. రాత్రి 9 గంటల సమయంలో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ రోజు నుంచి సోమవారం వరకు కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసులు బాలుడి ఆచూకి కోసం గాలిస్తూనే ఉన్నారు. అయినా ఇప్పటికీ బాలుడి జాడ దొరకలేదు.

కిడ్నాప్‌ చేశారా..?
బాలుడి ఆచూకీ లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎవరైన ఉద్దేశ్యపూర్వకంగానే బాలుడ్ని కిడ్నాప్‌ చేశారా అనే సందేహం వ్యక్తమవుతోంది. సోమవారం పొరుగున ఉన్న కాలనీలోని ఓ దుకాణంలో సీసీ పుటేజీని పరిశీలించగా బాలుడు దగ్గరలోని వాళ్ల తాతయ్య ఇంటికి పరుగులు తీస్తున్నట్టుగా కనిపించింది. అక్కడి నుంచి ఎటు వెళ్లాడో తెలియడం లేదు. పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్‌ ఆధ్వర్యంలో మూడు పోలీస్‌ బృందాలు జోరుగా గాలిస్తున్నాయి. మరోవైపు మూడు రోజులుగా కొడుకు ఆచూకీ లేక పోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లి పోతున్నారు. ఎలాగైనా తమ కుమారుడు క్షేమంగా ఇంటికి రావాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top