బాలుడి ఆచూకీ ఎక్కడ..?

Boy  Missed - Sakshi

కిడ్నాపా..? తప్పిపోయాడా?

ఏమయ్యాడో స్పష్టత కరువు

బాలుడి కోసం తల్లిదండ్రుల ఎదురు చూపులు

యాదగిరిగుట్ట (ఆలేరు) : అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు కనిపించకుండా పోయాడు. కళ్లముందు స్నేహితులతో ఆటాడుకుంటున్న ఆ బాలుడు ఎక్కడివెళ్లాడు? అభం శుభం తెలియని బాలుడు ఇప్పుడెక్కడ ఉన్నాడు.? ఎప్పటికైనా తమ కుమారుడు వస్తాడని.. బాలుడి ఆచూకీ కనిపెట్టాలని ఇప్పటికీ ఆ బాలుడి తల్లిదండ్రులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఖచ్చితంగా తమ కుమాడు వస్తారని వేయి కళ్లతో నేటికీ ఎదురుచూస్తున్నారు. యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని బీసీ కాలనీకి చెందిన న్యాలపట్ట అశోక్‌-నిర్మల ఒక్కగానొక్క కుమారుడు అరుణ్‌ (బిట్టు)(5) గతేడాది 16వ తేదీన ఇంటి వద్ద స్నేహితులతో ఆడుకుంటూ ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. నాటి నుంచి నేటికీ అరుణ్‌ జాడ తెలియరాలేదు.

ఆ రోజు ఏం జరిగింది.?

16-05-2017వ తేదీన ఉదయం 11:30 గంటలకు అరుణ్‌ తన బంధువుల ఇంట్లో క్యారంబోర్డు గేమ్‌ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో బ్లూకల్లర్‌ షర్ట్, నైట్‌ప్యాయింట్‌ వేసుకుని ఒక వ్యక్తి కిటికీ దగ్గరకు వచ్చాడని.. ఇంట్లో ఉన్న పిల్లలను ‘మీ డాడీ ఉన్నాడా.. నేను చిట్టీ పైసలు ఇవ్వాలి.. డోర్‌ తీయండి’ అని మాట్లాడినట్లు అక్కడున్న చిన్నారులు తెలిపారు. ఆ ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి స్పందిస్తూ.. మా డాడీ పేరు ఏమిటో చెప్పండి డోర్‌ తీస్తాను అన్నది. దీంతో ఆ వ్యక్తి సమాధానం చెప్పలేక ఫోన్‌ మాట్లాడుకుంటూ పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లాడని.. అదే సమయంలో అరుణ్‌ తన ఇంట్లో నీళ్లు తాగి వస్తానని బయటకు వెళ్లాడని ఆడుకుంటున్న సహచర పిల్లలు తెలిపారు.

ఆ సమయం నుంచి అరుణ్‌ కనిపించకుండా పోయినట్లు అక్కడ స్థానికులు, కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఆ ఇంటికి వచ్చిన వ్యక్తియే అరుణ్‌ను ఎత్తుకెళ్లాడా.. లేకా ఆడుకుంటూ ఆ బాలుడు తప్పిపోయాడా.. మరెవరైనా తీసుకెళ్లారా? అనే కోణాల్లో అప్పుడు పోలీసులు దర్యాప్తు జరిపారు. అదే రోజు మధ్యాహ్న సమయంలోనే బీసీ కాలనీలో అనుమానస్పదంగా ఓ మహిళతో పాటు ఒక వ్యాన్‌ కూడా తిరుగుతూ కనిపించిందని స్థానికంగా ఉన్న ప్రజలు అనుమానం వ్యక్తం చేశారు. 

అప్పటి సీఐ రఘువీరారెడ్డి విచారణ..

బీసీ కాలనీలో 2017లో మేలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డీసీపీ పాలకుర్తి యాదగిరి, ఏసీపీ సాధు మోహన్‌రెడ్డి, సీఐ రఘువీరారెడ్డి (ప్రస్తుతం ముగ్గురూ బదిలీపై వెళ్లారు) కాలనీకి వెళ్లి విచారణ చేపట్టారు. ఏమైనా పాత కక్ష్యలు, భూతగాదాలు ఉన్నాయా అని బాలుడి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. 16వ తేదీన వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు చూసిన పిల్లల ద్వారా వ్యక్తి ఎలా ఉన్నాడు.. ఒక్కడే వచ్చాడా.. ఇంకా ఎవరైనా ఉన్నారా.. అనే విషయాలపై ఆరా తీశారు. చుట్టూ ఉన్న దారులను సీఐ రఘువీరారెడ్డి సిబ్బందితో కలిసి గాలించారు. డీసీపీ, ఏసీపీ, సీఐలు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిన తర్వాత కేసు నీరు గారిందని అరుణ్‌ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు తమ కుమారుడి జాడ కనిపెట్టాలని కోరుతున్నారు.

అధికారులకు విన్నవిస్తూనే.. కొడుకు కోసం గాలింపు..

అరుణ్‌ ఆచూకీ లభించడం లేదంటూ బీసీ కాలనీకి చెందిన పలువురు వ్యక్తులతో పాటు రాజకీయ పార్టీల నాయకులతో కలిసి అశోక్‌ దంపతులు పలు చోట్ల గాలిస్తూనే, పోలీసులకు, ఆయా అధికారులకు వినతులు అందజేశారు. బాలుడి ఆచూకీ కనిపెట్టాలని అప్పట్లో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ నాయకులు ర్యాలీలు నిర్వహించి వినతులు అందజేశారు. రాచకొండ సీపీ మహేష్‌భగవత్, డీసీపీ రాంచంద్రారెడ్డి, యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాసచార్యులు, జేసీ రవినాయక్‌ను కలిసి బాలుడు కనిపించకపోయిన విషయాన్ని వివరిస్తూ.. వినతిపత్రాలు అందజేశారు. హైదరాబాద్‌లోని బాల్‌నగర్, హైటెక్‌ సిటీ, కూకట్‌పల్లి, శంషాబాద్, ఎల్బీనగర్, సికింద్రాబాద్‌లతో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లా, తిరుపతి, విజయవాడలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లో, ఆనాథ ఆశ్రమాల్లో వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు.

 ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరు..?

పిల్లలు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ఓ వ్యక్తి ఇంటికి వచ్చాడని, ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల పేరు అడిగారని చెబుతున్న ఆ వ్యక్తి ఎవరు.? ఎక్కడి నుంచి వచ్చాడు.. ఈ కాలనీలో పరిచయం ఉన్న వ్యక్తా? బయటి వ్యక్తా? అనే విషయాలపై పోలీసులు అప్పట్లో ఆరా తీశారు. ఆ వ్యక్తి పిల్లలు ఆడుకుంటున్న ఇంటికి ఎందుకు వచ్చాడు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు జరిపి, అనుమానం ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ఒక మహిళను, తిరుపతి నుంచి ఓ వ్యక్తిని, ఇంటి ముందు వ్యక్తులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు.

తప్పిపోయిన రోజే కేసు నమోదు..

తన కొడుకు కనిపించడం లేడని, ఎవరో వ్యక్తి వచ్చి తీసుకెళ్లాడని అరుణ్‌ తల్లిదండ్రులు యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అప్పటి ఎస్‌ఐ గోపాల్‌దాస్‌ ప్రభాకర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అప్పటి డీసీపీ పాలకుర్తి యాదగిరి, ఏసీపీ సాధు మోహన్‌రెడ్డి, సీఐ రఘువీరారెడ్డి పర్యవేక్షణలో ఎస్‌ఐ-2 నాగిరెడ్డి, సిబ్బందితో కలిసి గుట్టలో గాలింపు చర్యలు చేపట్టారు.

స్థానికంగా అనుమానం వచ్చిన వ్యక్తులను ప్రశ్నించారు. అరుణ్‌ ఆచూకీ కోసం పోలీసులు స్థానికంగా ఉన్న హోటల్స్, పోలీస్‌స్టేషన్‌లో, బీబీనగర్‌ సమీపంలో ఉన్న టోల్‌గేట్‌ వద్ద సీసీ పుటెజీని పరిశీలించారు. స్థానికంగా ఉన్న సన్నిధి హోటల్‌లో సీసీ పుటెజ్‌ని పరిశీలించగా.. రోడ్డుపై ఉన్న కెమెరాలో ఒక బైక్‌పై ఓ వ్యక్తితో పాటు మహిళ బాలుడిని తీసుకొని వెళ్తున్నట్లు కనిపించింది. ఆ బైక్‌పై ఉన్నది బాలుడేనా.. కాదా అనే సందేహాలను ఇప్పటికీ పోలీసులు స్పష్టం చేయలేదు.

మాకు శత్రువులు ఎవరూ లేరు...

నేను ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. మాకు ఎవరూ శత్రువులు లేరు. భూతగదాలు ఏమీ లేవు. ఒక్కగానొక్క కుమారుడు ఎక్కడ ఉన్నాడో ఇంకా తెలియలేదు. క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాం. మా కొడుకు జాడ చూపాలని సీపీ మహేష్‌భగవత్, డీసీపీ రాంచంద్రారెడ్డి, ఏసీపీ శ్రీనివాస్‌చార్యులు, జేసీ రవి నాయక్‌ను కలిశాం. పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక కేసుగా తీసుకుని నా కొడుకును ఇంటికి చేర్చాలి. శ్రీమంతుడి కొడుకు తప్పిపోతే వారం రోజులు తిరగకుండానే వెతికి ఇంటికి తీసుకువస్తారు.. నేను నిరుపేద అటో డ్రైవర్‌ను కాబట్టే ఇంకా నా కొడుకు జాడ చూపడం లేదు. - న్యాలపట్ల అశోక్‌-నిర్మల, బాలుడి తల్లిదండ్రులు
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top