బెంగాల్‌ అల్లర్లలో ఐదుగురి అరెస్ట్‌

BJP Take Out Protest March In Kolkata Against Bengal Violence - Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన అల్లర్లకు వ్యతిరేకంగా బీజేపీ కోల్‌కతాలో నిరసన ర్యాలీ చేపట్టింది. బెంగాల్‌లో జరుగుతున్న గొడవలకు అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ కారణమంటూ బీజేపీ ఆరోపించింది. అల్లర్లలో మరణించినవారి అంత్యక్రియలకు బరక్‌పూర్‌  బీజేపీ ఎంపీ అర్జున్‌సింగ్‌ హాజరు కానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం​ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌తోపాటు ఇతర ముఖ్యనాయకులు యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. వారు ఢిల్లీ నుంచి తిరిగి రాగానే అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

కొత్తగా నిర్మించిన భట్‌రపా పోలీస్‌ స్టేషన్‌ దగ్గర్లోనే ఈ ఘర్షణలు చోటు చేసుకోగా, ఈ అల్లర్లలో టీఎంసీ, బీజేపీలకు చెందిన కార్యకర్తలు పాల్గొనట్టుగా పోలీసులు భావిస్తున్నారు. గురువారం జరిగిన  ఈ హింసకాండలో రెండు వర్గాలకు చెందినవారు పరస్పరం బాంబులు విసురుకోవడమే కాక.. తమ దగ్గర ఉన్న రివాల్వర్లతో గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. ఈ  అల్లర్లో ఇద్దరు మృతి చెందగా 11 మందికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. సంఘటనా స్థలంలో నాటు బాంబులు, రివాల్వర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ హింసాకాండపై పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బరక్‌పూర్‌ పోలీసు కమిషనర్‌ తన్మయ్‌రాయ్‌ చౌదరిని విధుల నుంచి తొలగించారు. డార్జిలింగ్‌ ఐజీపీగా పనిచేస్తున్న మనోజ్‌ కుమార్‌ వర్మను బరక్‌పూర్‌కు బదిలీ చేసి పోలీస్‌ కమిషనర్‌గా నియమించారు. అల్లర్లకు కారణమైనవారు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మమతా బెనర్జీ పోలీసులను ఆదేశించినట్టు సమాచారం. ప్రస్తుతం అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top