కానిస్టేబుల్‌పై దాడి; బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

BJP MLA Booked For Beating Constable In Uttar Pradesh - Sakshi

పిలిభిత్ : ఉత్తర్‌ప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌లాల్‌ రాజ్‌పుత్‌పై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్‌పై దొంగతనం ఆరోపణలు మోపడమే గాక అతన్ని అనుచరులతో తీవ్రంగా కొట్టడంతో అతనితో పాటు మరో 35 మందిపై కేసును నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..  కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మోహిత్‌ గుర్జార్‌ రాహుల్‌ అనే వ్యక్తి వద్ద రూ. 50వేలకు ఒక బైక్‌ను కొనుగోలు చేశాడు. అయితే బైక్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్‌ సక్రమంగా లేకపోవడంతో అది గుర్జార్‌ పేరుకు బదిలీ కాలేదు. దీంతో విషయం తెలుసుకున్న గుర్జార్‌ రాహుల్‌ వద్దకు వెళ్లి నిలదీశాడు. గుర్జార్‌ అడిగిన ప్రశ్నలకు రాహుల్‌ సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తన డబ్బులు తనకు ఇవ్వాలంటూ రాహుల్‌ను డిమాండ్‌ చేశాడు.

అయితే ఇది మనసులో పెట్టుకున్న రాహుల్‌ వారం తర్వాత గుర్జార్‌కు ఫోన్‌ చేసి 'నీకు డబ్బు ఇస్తాను. వెంటనే పిలిభిత్ మండీలోని సమితి గేట్‌ వద్దకు రావాలంటూ' తెలిపాడు.  రాహుల్‌ మాటలను నమ్మి అక్కడికి చేరుకున్న గుర్జార్‌ను అప్పటికే అక్కడ ఉన్న ఎమ్మెల్యే కిషన్‌ లాల్‌ రాజ్‌పుత్‌, అతని అల్లుడు రిషబ్‌, మరికొంత మంది అతని అనుచరులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.

దీనిపై గుర్జార్‌ స్పందిస్తూ..' నేను పిలిభిత్‌ మండీకి వచ్చే సరికి అప్పటికే అక్కడ ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ఒక్కసారిగా నాపై దాడి చేశారు. ఎమ్మెల్యే కిషన్‌లాల్‌ నా మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని నన్ను తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా తనతో బలవంతంగా మూత్రం తాగించే ప్రయత్నం చేశారు. అయితే వారి దగ్గర నుంచి ఎలాగో తప్పించుకొని  వస్తున్న నన్ను అస్సాం రోడ్‌ పోలీస్‌ వద్ద అడ్డగించి మరోసారి తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఇదే విషయమై సుంగ్రాహి పోలీస్‌ స్టేషన్‌లో ఎమ్మెల్యే కిషన్‌తో పాటు అతని అనుచరులపై ఫిర్యాదు ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక లాభం లేదనుకొని తాను కోర్టును ఆశ్రయించానని' వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు  సుంగ్రాహి ఇన్స్‌పెక్టర్‌ రాజేష్‌ కుమార్‌ ఎమ్మెల్యే కిషన్‌లాల్‌తో పాటు 35 మంది పై ఐపీసీ సెక్షన్‌ 395,  397 కింద  ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా కిషన్‌లాల్‌ రాజ్‌పుత్‌ బర్ఖేరా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top