తెల్లవారు జామునే తెల్లారిన బతుకులు

Bikes Rolls Reverse In Canal In Malikipuram East Godavari - Sakshi

ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం

మోటారు సైకిల్‌పై ఐదుగురి ప్రయాణం

బండి కాలువలో పడి ఇద్దరు బాలికలు, ఒక మహిళ మృతి

మోటారుసైకిల్‌పై ముగ్గురి ప్రయాణమే ప్రమాదకరం.. అలాంటిది ఐదుగురు ప్రయాణిస్తే.. వాహనం అదుపులో ఉండడం కష్టం. అదే జరిగింది వారి విషయంలో. చిన్నారులకు వచ్చిన సర్పికి వైద్యం చేయించేందుకు మోటారుసైకిల్‌పై ఐదుగురు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో కాలువలోకి దూసుకుపోగా ఇద్దరు బాలికలు, ఓ మహిళ మరణించారు.

సాక్షి, మలికిపురం (తూర్పు గోదావరి): ప్రజల ప్రాణరక్షణ కోసమే ట్రాఫిక్‌ నిబంధనలు.. ఏం పర్లేదని వాటిని ఉల్లంఘిస్తే.. జరిగే దారుణం అంతా ఇంతా కాదు. ద్విచక్ర మోటారు వాహనాలపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్‌ ధరించాలి. వాహనంపై ముగ్గురి ప్రయాణం ప్రమాదకరం.. ఇలా నిబంధనలు చెబుతాయి. కానీ వాటిని చాలామంది పట్టించుకోరు. అదే ముప్పును తెచ్చిపెడుతుంది. అదే జరిగింది ఈ సంఘటనలో.. మోటారు సైకిల్‌పై ఐదుగురు ప్రయాణిస్తుండడంతో దాన్ని అదుపు చేయడం వాహనదారుకు సాధ్యం కాలేదు. దాంతో అది కాలువలోకి దూసుకుపోగా ఓ మహిళ, ఇద్దరు బాలికలు మరణించారు.

పిల్లల శరీరంపై వచ్చిన సర్పి వ్యాధికి మంత్రం వేయిద్దామని వారితో బయల్దేరిన తల్లికి కడుపుకోతే మిగిలింది. తమకు సాయంగా వచ్చిన తోబట్టువు కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆమె దుఃఖానికి అంతేలేదు. మలికిపురం మండలం గుడిమెళ్లంక గ్రామంలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదం సఖినేటిపల్లి మండలం మోరి పోడు గ్రామంలో తీవ్ర విషాదం మిగిల్చింది. ఇద్దరు పిల్లలు మరణించడంతో తండ్రి బ్రహ్మాజీ, తాత మేడూరి గంగాధర్‌ వేదనకు అంతేలేదు. మోరిపోడు గ్రామంలో వడ్రంగి పని చేసుకొనే మేడూరి బ్రహ్మాజీకి పాలకొల్లు గ్రామానికి చెందిన సుగుణతో కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. వారికి భార్గవి (5), కిరణ్మయి (4) సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కొన్ని నెలలుగా వారు విడిగా ఉంటున్నారు.

సుగుణ తన ఇద్దరు పిల్లలతో పాలకొల్లులోని పుట్టింట్లో ఉంటోంది. పిల్లలు భార్గవి, కిరణ్మయిలకు శరీరంపై సర్పి వచ్చింది. అది మంత్రం ద్వారా నయం అవుతుందని, సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంకలో ఉన్న మంత్రగాడితో మంత్రం వేయించేందుకు మంగళవారం ఉదయమే బయలుదేరారు. పిల్లల మేనత్త భర్త అయిన పాలకొల్లు సమీపంలోని కాజ గ్రామానికి చెందిన వడ్లమాని శివ నాగేశ్వరరావు హోండా ప్లెజర్‌ వాహనంపై చిన్నారులు భార్గవి, కిరణ్మయిలతో పాటు  వారి తల్లి సుగుణ, సుగుణ  అక్క కృప (పాలకొల్లు)లతో బయల్దేరారు. వారు గుడిమెళ్లంక– రామరాజులంక సరిహద్దులకు వచ్చే సరికి  ప్రధాన పంట కాలువపై గల వంతెన వద్ద వాహనం మలుపు తిరగడం కష్టమైంది. దాంతో కాలువలోకి దూసుకుపోయింది.

అప్పుడు సమయం తెల్లవారు ఝామున 4.30 గంటలైంది. అంతా చీకటిగా ఉండడంతో ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారు కాలువలో ప్రవాహానికి కొట్టుకు పోసాగారు. శివ నాగేశ్వరరావు, సుగుణ ఈదుకుంటూ ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు.  మోటార్‌ సైకిల్‌తో పాటు కృప, భార్గవి, కిరణ్మయి గల్లంతయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మలికిపురం ఎస్సై కేవీ రామారావు తమ సిబ్బందితో హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రాజోలు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఈత గాళ్లను రప్పించారు. ఉదయం 7 గంటలకు తొలుత కిరణ్మయి (4) మృత దేహం లభించింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో కృప మృత దేహం లభించింది. భార్గవి మృత దేహం కోసం తీవ్రంగా గాలించగా రాత్రి 7.30 గంటల ప్రాంతంలో సంఘటన స్థలానికి సమీపంలోనే లభించింది. అమలాపురం డీఎస్పీ షేక్‌ మసూమ్‌ బాషా, రాజోలు సీఐ కె.నాగ మోహన రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని  బాధితుల నుంచి వివరాలను తెలుసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top