మూగబోయిన చిరునవ్వులు

చిన్నారిని చిదిమేసిన చెత్త సేకరణ ఆటో
డ్రైవర్ నిర్లక్ష్యంతో బాలుడి మృత్యువాత
భాగ్యనగర్‌కాలనీ: చిన్నారి చిరునవ్వులు మూగబోయాయి. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం అభం శుభం ఎరగని ఓ చిన్నారిని బలితీసుకుంది. చెత్త ఏరుకుని పొట్టపోసుకునే ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారిని చెత్త సేకరణ ఆటో మృత్యురూపంలో దూసుకువచ్చి కబళించిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన శ్రీకాంత్, శ్రీకన్య దంపతులు మెదక్ జిల్లా నర్సాపూర్‌కు వచ్చి పాతదుస్తులు, చెత్త సేకరిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.
మూడు రోజుల క్రితం నర్సాపూర్ నుంచి కూకట్‌పల్లి ఖైత్లాపూర్‌లోని డంపింగ్ యార్డు వద్ద పాతదుస్తులు, చెత్త ఏరుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం దంపతులు చెత్త ఏరుతుండగా కుమారుడు సాయి (1) ఖైత్లాపూర్ డంపింగ్ యార్డుకు వెళ్లే దారిలో నిల్చున్నాడు. అజాగ్రత్తతో, అతి వేగంతో వస్తున్న స్వచ్ఛ ఆటో డ్రైవర్ వేగంగా వచ్చి చిన్నారిని ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. కుమారుడి మృతికి ఆటో డ్రైవర్ కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి