ఘరానా మోసగాడు  

ATM Card Theft And Money Transferred - Sakshi

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

టెక్కలి రూరల్‌ : టెక్కలి మేజర్‌ పంచాయతీ పరిధిలోని విజయా బ్యాంకు ఏటీఎంలో గురువారం చోరీ జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సవర వాసు తన స్టేట్‌బ్యాంక్‌ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేందుకు విజయ బ్యాంకుకు వెళ్లారు.

కార్డు మెషిన్‌లో పెట్టి రూ.14వేలు విత్‌ డ్రా తీసేందుకు ప్రయత్నించినా నగదు రాలేదు. వెనుక ఉన్న గుర్తుతెలియని వ్యక్తి.. తాను తీస్తానని వాసు ఏటీఎం కార్డు తీసుకున్నాడు. కార్డు ఏటీఎంలో పెట్టి వాసును పిన్‌ నంబర్‌ కొట్టాలని వాసును కోరాడు.

ఈసారి డబ్బులు రావడంతో..వాటిని తీసుకునే హడావుడిలో ఉన్న వాసుకి.. తన చేతిలోని మరో ఏటీఎం కార్డు ఇచ్చి గుర్తు తెలియని వ్యక్తి  అక్కడి నుంచి జారుకున్నాడు. కార్డు మారిపోయిందని గమనించని వాసు.. డ్యూటీకి వెళ్లిపోయాడు.

గంట తర్వాత నరసన్నపేట నుంచి ఒక రిటైర్డ్‌ ఉద్యోగి వాసుకు ఫోన్‌ చేశారు. తన ఏటీఎం కార్డు నుంచి రూ.40 వేలు ఎందుకు విత్‌డ్రా చేశావని ప్రశ్నించడంతో అవాక్కయ్యారు. 

ఏం జరిగిందని మరోసారి అడగ్గా.. ‘నీ ఏటీఎం నా దగ్గర ఉంది. నా ఏటీఎం నాకు ఇవ్వు’ అని ఆ ఉద్యోగి చెప్పారు. దీంతో వాసు తన దగ్గర ఉన్న ఏటీఎం కార్డు చూడగా.. దానిపై జాన శంకర్‌రావు పేరు రాసి ఉండటాన్ని గుర్తించారు.  

వాసు ఏటీఎంలో ఉన్న మొత్తం డబ్బులను గుర్తు తెలియని వ్యక్తి తీసి.. దానిని రిటైర్డ్‌ ఉద్యోగికి ఇచ్చేసి.. ఆయన దగ్గరున్న ఏటీఎం తీసుకుని అందులో నుంచి రూ.40 వేలు విత్‌డ్రా చేసినట్లు తేలింది. దీంతో వీరు పోలీసులను ఆశ్రయించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top