గ్రూపుల మధ్య తగాదాలే కారణమన్న సీపీ

విజయవాడ: రౌడీషీటర్ కాళిదాసు సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు హత్య కేసులో 9మందిని అరెస్టు చేసినట్లు విజయవాడ పోలీసు కమిషనర్‌ గౌతం సవాంగ్‌ తెలిపారు. నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు గురించి వివరాలు తెలిపారు. తెనాలిలో గ్రూపు తగాదాల నేపథ్యంలోనే సుబ్బును హతమార్చారన్నారు.

సుబ్బు, గడ్డేటి సురేంద్ర గ్రూపు మధ్య తెనాలిలో విభేదాలు ఉన్నాయని, 2014 ఏప్రిల్లో మేడిశెట్డి కృష్ణ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని ఆయన వివరించారు. దానికి ప్రతీకారంగా సుబ్బు సోదరుడు సత్యంను 2015లో కృష్ణ అనుచరులు హత్య చేశారన్నారు. దాంతో సుబ్బు తెనాలి నుంచి విజయవాడకు మకాం మార్చాడని, ఇటీవలే తుపాకీ కొనుగోలు చేసేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడని వివరించారు. విషయం తెలిసి అప్రమత్తమైన సురేంద్ర వర్గం సుబ్బును హతమార్చేందుకు ప్రణాళిక రచించిందన్నారు. ఏడుగురు రౌడీషీటర్లతోపాటు మరో ఇద్దరు కలిసి సుబ్బును హత్య చేసేందుకు నిర్ణయించారని, రెండుసార్లు మోటర్ బైక్‌లపై మాచవరం వచ్చి రెక్కీ నిర్వహించారని చెప్పారు. ఈనెల 6న మూడు బైక్‌లపై వచ్చిన ఆరుగురు సుబ్బును హత్య చేశారన్నారు. పది బృందాలతో దర్యాప్తు చేసి నిందితులను పట్డుకున్నామని, సిసి టివి ఫుటేజీ కీలకంగా ఉపయోగపడిందని సవాంగ్‌ చెప్పారు.

కాట్రగడ్డకు సంబంధం లేదు

కాగా సుబ్బు హత్య కేసుతో టీడీపీ నేత కాట్రగడ్డ శ్రీనివాస్కు సంబంధం లేదని సవాంగ్‌ తెలిపారు. శ్రీనివాస్, సుబ్బుల మధ్య విభేదాలు ఉన్నాయని, శ్రీనివాస్ ఇంటికి సమీపంలోనే సుబ్బు హత్య జరిగిందని చెప్పారు. శ్రీనివాస్పై సుబ్బు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారని, అయితే తమ దర్యాప్తులో ఈ హత్యతో కాట్రగడ్డకు సంబంధం లేదని తేలిందన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top