అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు   

Arrested women thieves - Sakshi

పాత చీరల వ్యాపారం  పేరుతో టోకరా

రద్దీగా ఉన్న బస్సులెక్కి ప్రయాణికుల సామాన్లు చోరీ

నెల్లూరులో పట్టుబడిన తమిళనాడు మహిళా దొంగలు

ఏడున్నర తులాల బంగారం, సెల్‌ఫోన్‌ స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఏసీపీ మల్లారెడ్డి

ఇబ్రహీంపట్నం : అంతర్రాష్ట్ర దొంగలు పోలీసుల వలకు చిక్కారు. ఇద్దరు మహిళా దొంగలను ఆదిబట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి ఏడున్నర తులాల బంగారం, ఒక సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం  ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మల్లారెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాకు చెందిన మీనా(29), అంజలి(26)లు వదినమర్దళ్లు.

పాత చీరల విక్రయం వృతిగా.. అవకాశం ఉన్న చోరీలు చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నారు. పాత చీరలు కొంటామంటూ వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ.. చోరీలకు పాల్పడుతుంటారు. గత నెల 21వ తేదీన బాలథెరిస్సా అనే మహిళ బంధువుల ఇంటికి వెళ్లేందుకు నగరంలో బస్సుఎక్కారు. అదే బస్సులో నగరంలోని మెట్టుగూడ వద్ద మీనా, అంజలిలు ఎక్కారు. తుర్కయంజాల్‌ వద్దకు రాగానే బాల థెరిస్సా లాగేజీ బ్యాగును మెల్లగా తస్కరించి బస్సు దిగి వెళ్లిపోయారు.

కొద్దిసేపటికి బ్యాగు కనిపించడంలేదని గుర్తించిన థెరిస్సా ఆదిభట్ల పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు తుర్కయంజాల్‌లోని సీసీకెమెరా ఫుటేజీలను పరిశీలించారు. బస్సు దిగిన వెంటనే ఆటో ఎక్కి వచ్చిన దారిలో వెనక్కు వెళ్తున్న ఇద్దరి మహిళలపై అనుమానం కలిగింది. దీంతో సీఐ గోవింద్‌రెడ్డి ప్రత్యేక టీమ్‌ను రంగంలో దించారు. మహిళల ఆచూకీ పటుచోట్ల గాలించగా ఎట్టకేలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెల్లూరులో పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి ఏడున్నర తులాల బంగారం, ఒక సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

పాత నేరస్థులే.... 

ఈ మహిళలిద్దరూ పాత నేరస్తులేనని ఏసీపీ మల్లారెడ్డి తెలిపారు. గతంలో నగరంలోని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడు, తిరుపతి సీసీఎస్‌ పరిధిలో రెండు దొంగతనం కేసులు ఉన్నట్లు వివరించారు. వీరు తమిళ భాషనే మాట్లాడుతున్నారన్నారు. గత కొంతకాలంగా వీరి కుటుంబాలు గుడిసెలు వేసుకొని నెల్లూరులో నివసిస్తున్నట్లు చెప్పారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి చోరీలకు పాల్పడి తిరిగి గమ్యస్థానాలకు చేరుకుంటారని ఏసీపీ వివరించారు.

రద్దీగా ఉన్న బస్సుల్లోకి ఎక్కి...ప్రయాణికుల బ్యాగులను తస్కరిస్తుంటారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని....ఎవరైన అనుమానస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అయన కోరారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ గోవింద్‌రెడ్డి, ఎస్‌ఐ రామకృష్ణ టీంను ఏసీపీ మల్లారెడ్డి అభినందించారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top