‘ట్రాప్‌’ చేసి పట్టుకెళ్లారు

AP Police Kidnap Bachupalli Person in IT Grid Scam - Sakshi

బాచుపల్లివాసిని కిడ్నాప్‌ చేసిన ఏపీ పోలీసులు

దీనికోసం కస్టడీలో ఉన్న ఓ దొంగ ఫోన్‌ వాడిన వైనం

ఇంటి నుంచి బయటకు రప్పించి ఎత్తుకెళ్లిన బృందం

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వరకు వెళ్లి దర్యాప్తు చేసిన అధికారులు

కోర్టును ఆశ్రయించనున్న బాధితుడి కుటుంబసభ్యులు

సాక్షి, సిటీబ్యూరో: ‘ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు’... అంటే ఇదేనేమో... ఐటీ గ్రిడ్‌ డేటా స్కామ్‌పై నమోదైన కేసు దర్యాప్తు విషయంలో సైబరాబాద్‌ అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తున్న ఏపీ పోలీసులు బాచుపల్లికి చెందిన వివేకానంద విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని ఇబ్రహీంపట్నం పోలీసులు నిబంధనలను తుంగలో తొక్కారు. ఓ దొంగ ఫోన్‌ను వాడుకున్న వారు వివేకానందను ట్రాప్‌ చేసి కిడ్నాప్‌ చేశారు. దీనిపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా అక్కడికి వెళ్లిన బాచుపల్లి పోలీసులు వివేకానంద వివరాలు కోరగా... తమకు తెలియదంటూ చేతులెత్తేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న వివేకానంద కుటుంబసభ్యులు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని యోచిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..విజయవాడకు చెందిన వివేకానంద కొన్నేళ్లు చెన్నైలో నివసించారు. ఇటీవల కుటుంబంతో సహా సైబరాబాద్‌కు వచ్చి బాచుపల్లి పరిధిలో ఉంటున్నారు. 

చిరునామా తెలియకుండానే కొరియర్‌...
వివేకానంద భార్యకు శుక్రవారం ఫోన్‌ చేసిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తాము కొరియర్‌ సంస్థ నుంచి వచ్చామని, ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి పార్శిల్‌ వచ్చిందని చెప్పారు. తాను ఆఫీస్‌లో ఉన్నానంటూ ఆమె చెప్పడంతో మీ చిరునామా చెబితే ఇంటికి వెళ్లి పార్శిల్‌ ఇస్తామన్నారు. అడ్రస్‌ తెలియకుండా కొరియర్‌ ఎలా వస్తుందని ఆమె అనుమానించారు. అంతే కాకుండా ఇటీవలే సైబరాబాద్‌కు వచ్చిన వారు ఇంకా ఐసీఐసీఐ బ్యాంక్‌లో తమ చిరునామా అప్‌డేట్‌ చేయించలేదు.

అయినా సదరు బ్యాంకు నుంచి కొరియర్‌ ఎలా వచ్చిందన్న అనుమానంతో ఫోన్‌ చేసిన వ్యక్తిని ప్రశ్నించగా, అతను ఫోన్‌ కట్‌ చేశాడు. అనంతరం వివేకానందకే నేరుగా కాల్‌ చేసిన వారు అతడిని ట్రాప్‌ చేసి బాచుపల్లి నుంచి కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ మెకానిక్‌ షెడ్‌ వద్దకు రప్పించారు. అక్కడ స్విఫ్ట్‌ డిజైన్‌ కారులో వేచి ఉన్న నలుగురు వ్యక్తులు అతడిని బలవంతంగా తీసుకుకెళ్లారు. శుక్రవారం నుంచి వివేకానంద ఆచూకీ లేకపోవడంతో ఆందోళనకు గురైన అతని భార్య, బావమరిది శనివారం బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు చేసిన కిడ్నాప్‌గా భావిస్తూ కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ పి.జగదీశ్వర్‌ సిబ్బందిని రంగంలోకి దింపారు. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డైన ఫీడ్‌తో పాటు సాంకేతికంగా దర్యాప్తు చేపట్టారు.  వివరాలు చెప్పని

ఏపీ పోలీసులు...
సాంకేతిక ఆధారాలను బట్టి వివేకానందను తీసుకువెళ్లిన కారు కంచికచర్ల వైపు వెళ్లినట్లు గుర్తించిన బాచుపల్లి పోలీసులు ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపారు. వీరు కంచికచెర్ల అధికారులను సంప్రదించగా వారు తమకు సంబంధం లేదని తెలిపారు.  దీంతో పోలీసులు శుక్రవారం కొరియర్‌ పేరుతో వివేకానంద భార్యకు ఫోన్‌ చేసిన వారి వివరాలను ఆరా తీశారు. సదరు నంబర్‌ కలిగిన వ్యక్తిని ప్రశ్నించగా, గ్యాస్‌ సిలిండర్ల కేసులో తాను మూడు రోజుల పాటు ఇబ్రహీంపట్నం పోలీసుల అదుపులో ఉన్నానని, అప్పుడు అక్కడి పోలీసులు తన ఫోన్‌ తీసుకుని ఫోన్‌ చేసినట్లు తెలిపాడు. దీంతో బాచుపల్లి పోలీసు బృందం సోమవారం ఇబ్రహీంపట్నం వెళ్లి అక్కడి ఠాణాలో ఆరా తీసింది. దీనిపై ఎలాంటి సమాచారం ఇచ్చేందుకు వారు నిరాకరించారు. ఈ విషయాన్ని కూకట్‌పల్లి ఏసీపీ బి.సురేందర్‌రావు, మాదాపూర్‌ డీసీపీ ఎ.వెంకటేశ్వర్‌రావు సీరియస్‌గా తీసుకున్నారు. నాలుగు రోజులుగా వివేకానందను అక్రమంగా నిర్భధించిన ఏపీ పోలీసుల తీరును ఆయన కుటుంబీకులు తప్పుపడుతున్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నారు. వివేకానంద విషయంపై సైబరాబాద్‌ పోలీసులను వివరణ కోరగా ఈ కేసు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top