ర్యాగింగ్‌తో జీవితం నాశనమే...

Anti Ragging Program In Vizianagaram - Sakshi

డెంకాడ, విజయనగరం : విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే వారి జీవితం నాశమైనట్టే అని జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.శ్రీహరి అన్నారు.  జొన్నాడ వద్ద ఉన్న లెండి ఇంజినీరింగ్‌ కళాశాలలో కళాశాల యాంటీ ర్యాగింగ్‌ సెల్, జిల్లా న్యాయసేవా సంస్థ సంయుక్తంగా యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి శ్రీహరి మాట్లాడుతూ విద్యార్థులు సరదాల పేరుతో తోటి విద్యార్థులను అవహేళన చేయడం, అమానవీయంగా ప్రవర్తించడం, వారి గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించడం తప్పన్నారు.

ర్యాగింగ్‌ చేసే వారు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంతో విలువైన జీవితం నాశనం అవుతుందన్నారు. దీనిపై చట్టాలు కూడా కఠినంగా ఉన్నాయని గుర్తు చేశారు. అందువలన విద్యార్థులు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరూ పాల్పడవద్దని హెచ్చరించారు. ర్యాగింగ్‌ పాల్పడితే ఎలాంటి శిక్షలకు గురౌతారో వివరించారు. మానసిక విజ్ఞానవేత్త ఎన్‌వీఎస్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ ర్యాగింగ్‌ ద్వారా ఎలాంటి  మానసిక సమస్యలు తలెత్తుతాయో ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు.

కళాశాల చైర్మన్‌ పి.మధుసూధనరావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీవీ రామారెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ, విలువలతో నడుపుతున్న ఈ విద్యాలయంలో ర్యాగింగ్‌ వంటి ఘటనలకు అవకాశమివ్వమన్నారు. అనంతరం యాంటీ ర్యాగింగ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కృష్ణవర్మ, విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top