స్కూల్‌లో కరెంట్‌ షాక్‌

51 Students Electrocuted By High-Tension Wire In Uttar Pradesh - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హైటెన్షన్‌ వైర్లు తలగడంతో 51 మంది విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. బలరామ్‌పూర్‌లోని నయానగర్‌ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోజూలాగే ఉదయం పది గంటల ప్రాంతంలో విద్యార్థులు చెప్పులు విడిచి గన్నీ సంచులపై చెట్లకు ఆనుకుని కూర్చోబోయారు. అయితే కాస్త తేమగా ఉండటంతో చెట్లకు ఆనుకున్న హైటెన్షన్‌ వైర్ల నుంచి కరెంట్‌ ప్రసరించింది. దీంతో అక్కడున్న పిల్లలు ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌కు గురయ్యారు. కొందరు పిల్లలు ఆర్తనాదాలు పెట్టగా, మరికొందరు ఏకంగా స్పృహ కోల్పోయారు. ఉపాధ్యాయులకు చెప్పులు విప్పే నిబంధన లేనందున వారంతా తప్పించుకోగలిగారు. పిల్లల తల్లిదండ్రుల సాయంతో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామని పాఠశాల యాజమాన్యం తెలిపింది.

ఘటనా స్థలంలోని ఉపాధ్యాయుడు రిచా సింగ్‌ మాట్లాడుతూ.. ‘కొన్ని క్షణాలపాటు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి లోనయ్యాం. మాలో ఒకరు అది విద్యుదాఘాతంగా గుర్తించటంతో విద్యుత్‌ సిబ్బందికి కాల్‌ చేశాం. 15 నిమిషాలకు గానీ వారు కాల్‌ లిఫ్ట్‌ చేయలేదు. ఆ తర్వాత వారికి సమాచారం అందించగానే విద్యుత్‌ ప్రసారాన్ని నిలిపివేశారు’ అని తెలిపారు. జిల్లా న్యాయవాది కృష్ణ కరుణేష్‌ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. గాయపడ్డ విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఈ ఘటనకు కారకులైన కాంట్రాక్ట్‌ లైన్‌మెన్‌ను తొలగించడంతోపాటు, జూనియర్‌ ఇంజనీర్‌ ప్రియదర్శి తివారీపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధి రాంప్రతాప్‌ వర్మ ఆసుపత్రిని సందర్శించి పిల్లల తల్లిదండ్రులకు భరోసానిచ్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top