ఈ తరం తూలుతోంది

38percent Youth Caught Drunk And Drive in Hyderabad - Sakshi

డ్రంకన్‌ డ్రైవర్స్‌లో యూతే అధికం

చిక్కిన వారిలో 38.07 శాతం 21–30 ఏళ్లవారే

ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నదీ వీరే..

యాక్సిడెంట్స్‌లో 40 శాతం వీరివల్లే

పబ్బులు, హోటళ్లలో ‘లేడీస్‌ నైట్‌’ పార్టీలు

మహిళలకు ఉచితంగా మద్యం సరఫరా  

అయినా ‘నిషా’ రాణులపై 54 కేసులే..  

మహిళా పోలీసు సిబ్బంది కొరతతో తనిఖీలపై ప్రభావం

కట్టడికి కొరవడిన పటిష్ట విధానాలు

మూడేళ్లల్లో చెల్లించిన జరిమానా రూ.15.14 కోట్లు

ఉన్నతమైన భవిష్యత్తు ఉన్న నగర యువత మత్తులో జోగుతోంది. అర్ధరాత్రి దాటాక పూటుగా మద్యం తాగి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. లేదా తీవ్రంగా గాయపడుతున్నారు. సిటీలో ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకన్‌ డ్రైవ్‌లో చిక్కుతున్న వారిలో 38.07 శాతం మంది 21–30 ఏళ్ల యువతే కావడం గమనార్హం. ఇక మద్యం మత్తులో ప్రమాదాలకు గురవుతున్న వారిలో 40 శాతం మంది ఈ వయసు వారే.

తల్లిదండ్రుల అశ్రద్ధ.. భవిష్యత్తుపై నిర్లక్ష్యం.. స్వల్ప ఆనందాల కోసం నిబంధనలు పట్టించుకోని యువత ‘ముప్పు’ కొనితెచ్చుకుంటోంది. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న యువతులు, మహిళలు సైతం పెద్ద సంఖ్యలోనే ఉన్నా.. ట్రాఫిక్‌ పోలీస్‌ వింగ్‌లో మహిళా సిబ్బంది కొరతతో వారిని సరిగా తనిఖీలు చేయలేకపోతున్నారు. ఇదిలావుంటే.. గడిచిన మూడేళ్లలో మందుబాబులు చెల్లించిన జరిమానా మొత్తం రూ.15,14,46,470గా ఉంది. ఈ పరిస్థితి మారాలంటే తల్లిదండ్రులు మేల్కోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వ్యవస్థాగతంగా పటిష్ట విధానాలు అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

సాక్షి, సిటీబ్యూరో: గత శనివారం అర్ధరాత్రి దాటాక జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45లో జరిగిన ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి జతిన్‌ వర్మ (21) కన్నుమూశాడు. ఈ ప్రమాదం జరగడానికి జతిన్‌ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్‌ కార్తీక్‌ మద్యం మత్తూ ఓ కారణమని పోలీసులు చెబుతున్నారు.

గతనెల 26న పేట్‌ బషీరాబాద్‌ ఠాణా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నానావత్‌ అనిల్‌కుమార్‌ (26), చింటూ(20), శశిధర్‌రెడ్డి(22) అశువులు బాశారు. వీరు ప్రయాణిస్తున్న బైక్‌ చెట్టుకు ఢీ కొట్టడానికి మద్యం మత్తే కారణమని పోలీసులు తేల్చారు. కేవలం ఈ రెండు ఉదంతాలే కాదు నగరంలో జరుగుతున్న చాలా ప్రమాదాలు మద్యం మత్తే కారణమంటున్నారు. వీరిలో అత్యధికులు యువతే ఉడడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రెండోసారి చిక్కితే రెండేళ్ల వరకు..
‘నిషా’చరులకు జైలు శిక్షణ విధించే అవకాశం మోటారు వాహన చట్టంలో ఉంది. ట్రాఫిక్‌ పోలీసులు ఈ డ్రైవ్‌ను మోటారు వెహికల్‌ యాక్ట్‌లోని సెక్షన్ల ప్రకారం చేస్తారు. చట్ట ప్రకారం ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాములు, అంతకంటే ఎక్కువ ఉంటేనే చర్యలు తీసుకుంటారు. చోదకుడు అత్యంత ప్రమాదకర స్థాయిలో మద్యం తాగాడని న్యాయమూర్తి భావిస్తే రెండు నెలల జైలు శిక్ష వేసే  అవకాశం ఉంది. రెండోసారి చిక్కితే.. రూ.3 వేల జరిమానా లేదా రెండేళ్ల వరకు జైలు శిక్షకు అవకాశముంది. ఇలా మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారికి పాస్‌పోర్ట్, వీసాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇబ్బంది తప్పదని అధికారులు చెబుతున్నారు. 

‘లేడీస్‌ స్పెషల్‌’ కోసం సన్నాహాలు..
ఇప్పటి వరకు ‘మందుబాబుల’ పని పడుతున్న ట్రాఫిక్‌ వింగ్‌ ఇకపై  ‘నిషా రాణు’ల పైనా కన్నేయాలని నిర్ణయించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిలో యువతులు, మహిళలు సైతం ఉన్నారని తెలుస్తున్నా.. డ్రంకెన్‌ ‘డ్రైవ్‌’లో ఇప్పటికి కేవలం 54 కేసులే నమోదయ్యాయి. నగరంలోని కొన్ని పబ్స్, హోటల్స్‌ ఎంపిక చేసిన రోజుల్లో ‘లేడీస్‌ నైట్‌’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. ఆ రోజు యువతులు/మహిళలకు నిర్వాహకులు ఉచితంగా మద్యం సరఫరా చేస్తున్నారు. దీంతో ‘నిషా రాణుల’ సంఖ్యా అధికంగానే ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే మహిళల్ని తనిఖీ చేసే సమయంలో కచ్చితంగా ఉమెన్‌ పోలీసులు ఉండాలి. గతంలో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు సైతం జారీ చేసింది. అయితే ట్రాఫిక్‌ వింగ్‌లో మహిళా సిబ్బంది సంఖ్య స్వల్పం కావడంతో డ్రంకన్‌ డ్రైవ్‌ సాధ్యం కావట్లేదు. దీంతో శిక్షణలో ఉన్న మహిళా సిబ్బంది నుంచి ట్రాఫిక్‌ వింగ్‌కు వచ్చే వారితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వీరిపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. 

పట్టించుకోని అధికార యంత్రాంగం..
ఓ పక్క మద్యం మత్తులో జోగుతన్న యువత.. మరోపక్క వరుసపెట్టి ప్రమాదాలు జరుగుతున్నా అధికార యంత్రాంగంలో ఎలాంటి స్పందన రావట్లేదు. ఏదైనా ఉదంతం జరిగినప్పుడే హడావుడి చేసి తర్వాత మిన్నకుండిపోతున్నారు. బార్, హోటల్‌.. ఇలా ఎక్కడికిపడితే అక్కడకు వెళ్తున్న యువత పరిమితికి మించి మద్యం తాగుతున్నారు. వ్యాపార దృక్పథంతో వీరిని కట్టడి చేయని యాజమాన్యాలు కనీస జాగ్రత్తలు సైతం తీసుకోవడం లేదు. వాహనం నడపలేని స్థితిలో ఉన్న మందుబాబులను గుర్తించడంతో పాటు వారు సురక్షితంగా ఇళ్లకు చేరేందుకు డ్రైవర్లను ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవట్లేదు. కనీసం సొంత వాహనాలపై డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్లకుండా క్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధం కావట్లేదు. ఇవన్నీ మద్యం విక్రయ నిబంధనల్లో పొందుపరిస్తేనే ఫలితం ఉంటుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top