విషాదం నింపిన నూతన వేడుకలు

18 Dead In Tamil Nadu New Year Celebrations - Sakshi

హత్యలు, ప్రమాదాలతో 18 మంది మృత్యువాత

బీచ్‌లు, ముఖ్యకూడళ్లలో సంబరాలు

ప్రార్థనామందిరాలు కిటకిట

సాక్షి, చెన్నై:  నూతన ఏడాది వేడుకలు పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. హద్దుమీరిన ఉత్సాహం, మద్యం మత్తులో పరస్పర ఘర్షణలు 18 మంది ప్రాణాలను హరించాయి. ఇద్దరు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లు సహా వంద మందిని తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలుజేశాయి. అంగ్ల సంవత్సరాదిలోకి ప్రవేశిస్తున్న సమయంలో సంబరాలు చేసుకునేందుకు సహజంగా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. మంగళవారం రాత్రి 11 గంటలకే చెన్నై మెరీనాబీచ్, బిసెంట్‌ నగర్‌ బీచ్‌ రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. చెన్నై నగర శివారు ప్రాంతమైన ఈసీఆర్‌లోని రిసార్టులన్నీ డ్యాన్సులు, పార్టీలతో మార్మోగిపోయాయి. చర్చిలవద్ద భక్తులు బారులుతీరారు. సరిగ్గా 12 గంటలకు చెన్నై మెరీనాబీచ్‌ వద్ద భారీ కేక్‌ కట్‌ చేసి పరస్పరం అందరూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఒకవైపు కొత్త ఏడాది వేడకలు జరుపుతూనే పౌరహక్కు చట్టం సవరణకు నిరసనలు కూడా పాటించారు.

కొత్త ఏడాది ప్రవేశించగానే యువకుల్లో ఉత్సామం కట్టలు తెంచుకోగా ద్విచక్రవాహనాల్లో రయ్యిన దూసుకుపోవడం ప్రారంభించారు. ఒకే బైక్‌పై ముగ్గురు కూర్చుని కేకలు వేస్తూ సాగిపోయారు. మరికొందరు యువకులు వెనుకసీటులో తమ గర్లఫ్రెండ్స్‌ను కూర్చొనిబెట్టుకుని ఫీట్స్‌ చేస్తూ పోటీలు పడ్డారు. వాహనాల వేగ నియంత్రణ కోసం రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లు పెట్టి పోలీసులు అనేక ఆంక్షలు పెట్టినా యువతరం ఏమాత్రం పట్టించుకోనట్లుగా వ్యవహరించారు. వేడుకలు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో కొందరు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రగాయాలకు గురయ్యారు. చెన్నై తాంబరంలో నిలుచుని ఉన్న ఒక బస్సును బైక్‌పై వాయువేగంతో వచ్చి ఢీకొనడంతో తంగవేలు (20) అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఒక తాంబరంలోనే వరుసగా వాహనాలు ఢీకొని నలుగురు మృతి చెందారు.

పుళల్‌ జైలు సమీపంలో రామలింగం (40), ఎన్నూరు వద్ద సుందర్‌ (48) ఇలా ఒక్క చెన్నై నగర పరిసరాల్లోనే ఏడుగురు మృతి చెందగా సుమారు 50 మంది గాయపడ్డారు. అలాగే నాగర్‌కోవిల్, కడలూరు, వడలూరు, పుదుచ్చేరి, ఆర్కాడు, కాంచీపురం తదితర ప్రాంతాల్లో మరో 8మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రం మొత్తం 18 మంది ప్రాణాలు విడవగా, ఇద్దరు పోలీస్‌ఇన్‌స్పెక్టర్లు సహా మరో వందమంది తీవ్రంగా గాయపడ్డారు. చెన్నై ట్రిప్లికేన్‌ నాయర్‌ పిళ్‌లై రోడ్డులో పోలీసుల అనుమతి లేకుండా డీజే మ్యూజిక్‌ ఏర్పాటు చేసిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొత్త వేడుకల్లో కట్టుతప్పిన యువకుల వల్ల లైంగిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉందని భావించిన 10 లక్షల మంది యువతులు పోలీసు రక్షణ కోసం ముందు జాగ్రత్త చర్యగా ‘కావలన్‌ సాస్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

వికటించిన వేడుకలు–యువకుని హత్య
కొత్త ఏడాది వేడుకలు శృతి మించి వికటించగా ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తేని జిల్లా దేవదానపట్టికి చెందిన భగవతి (19), కార్తిక్‌ (22), సహా పలువురు యువకులు మంగళవారం రాత్రి 12.30 గంటలకు కొత్త ఏడాది పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. బైక్‌పై ఇళ్లకు వెళ్లే సమయంలో మార్గమధ్యలో మరికొందరు యువకులు రోడ్డుపై వేడుకలు సాగిస్తున్నారు. ఇరువర్గాల మధ్య మొదలైన వాదులాట తీవ్రస్థాయికి చేరుకోగా తీవ్రకత్తిపోట్లు, రాడుతో దెబ్బలకు గురైన కార్తిక్‌ మృతి చెందాడు. కడలూరు జిల్లాలో వేర్వేరు ఘటనల్లో మరో ముగ్గురు హత్యకు గురయ్యారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top