ప్రకాశం శోకసంద్రం

18 dead from Prakasam district in boat accident at krishna river - Sakshi

బోటు ప్రమాదంలో 21కి చేరిన మృతుల సంఖ్య

ప్రకాశం జిల్లాకు చెందిన మృతులు 18 మంది

సాక్షి ప్రతినిధి, ఒంగోలు/సాక్షి, విజయవాడ/లబ్బీపేట (విజయవాడ తూర్పు): విహారయాత్ర పలు కుటుంబాల్లో పెను విషాదం మిగిల్చింది. విజయవాడ సమీపంలోని ఫెర్రీ ఘాట్‌ వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటనలో  ఇప్పటివరకు 21 మంది మృతి చెందారు. దానిలో ప్రకాశం జిల్లా వారు 18 మంది ఉన్నారు. ఆదివారం రాత్రికి లభించిన 15 మృతదేహాలను సోమవారం ఉదయానికి అధికారులు ఒంగోలుకు తరలించారు. కాగా సోమవారం ఒంగోలుకు చెందిన మరో మూడు మృతదేహాలను గుర్తించారు.

ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు ప్రాంతానికి చెందిన దేవభక్తుని లీలావతి (50) మృతదేహాన్ని చూసిన ఆమె తల్లి రాయపాటి లక్ష్మీకాంతమ్మ (70) సోమవారం ఉదయం గుండె ఆగి మరణించింది. ఈ వార్త నగరంలో మరింత విషాదం నింపింది. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు జిల్లా నలుమూలల నుంచి జనం తరలిరావడంతో నగరంలో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ స్తంభించింది. ఆప్తులను పోగొట్టుకున్నవారి రోదనలతో ప్రకాశం జిల్లా శోకసంద్రంగా మారింది. 

వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో పాటు పలువురు వైఎస్సార్‌ సీపీ నేతలు మృతుల కుటుంబాలను ఒంగోలులో పరామర్శించారు. సోమవారం మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతకు ముందు సంఘటన స్థలాన్ని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, మైలవరం సమన్వయకర్త జోగి రమేశ్, విజయవాడ సెంట్రల్‌ సమన్వయకర్త వంగవీటి రాధ, మల్లాది విష్ణు తదితరులు సందర్శించారు.

బోటింగ్‌ సంస్థ ప్రతినిధులపై కేసు నమోదు
సాక్షి, అమరావతిబ్యూరో: బోటు ప్రమాదానికి కారణమైన బోటింగ్‌ సంస్థపై ఇబ్రహీంపట్నం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. రివర్‌ బోటింగ్‌ అడ్వంచర్స్‌ సంస్థ ప్రతినిధులు శేషం మోద
కొండలరావు, నీలం శేషగిరిరావు, గేదెల శ్రీను, వింజమూరి విజయ సారథి, చిట్టిలపై 304/2 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top