కృష్ణమ్మ ఒడి.. కన్నీటి సుడి

17dead in boat accident krishna river - Sakshi

ఒకే బోటులో 38 మంది ప్రయాణం

మృతులంతా ప్రకాశం, నెల్లూరు జిల్లాలవారే..

పున్నమిఘాట్‌ నుంచి కృష్ణానది హారతులు చూడడానికి వెళ్తుండగా దుర్ఘటన

ఆలస్యంగా సహాయక చర్యలు

ఆర్తనాదాలతో హోరెత్తిపోయిన ఘాట్‌

ఆదివారం ఉదయమే బోటు విజయవాడ చేరిక  

యాత్రికులు అడిగినా లైఫ్‌ జాకెట్లు ఇవ్వని నిర్వాహకులు

అర్ధరాత్రి వరకూ లభించని ఏడుగురి ఆచూకీ

ఉరకలెత్తే కృష్ణమ్మకు, ఉప్పొంగి ప్రవహించే గోదారమ్మకు తెలియదు. తమ చల్లటి ఒడిలో ఇంత ఘోరం జరుగుతుందని. అవధుల్లేని ఆనందానికి, హద్దుల్లేని సంబరానికి తెలియదు. ఎన్నో కుటుంబాల కన్నీటి ప్రవాహానికి తాము కారణమవుతామని. మనసారా దీవెనలిచ్చే బెజవాడ దుర్గమ్మకు తెలియదు. తన చెంత గుండెలు పగిలే విషాదం గూడుకట్టుకుందని. ఇప్పుడు ఎవరికి తెలిసినా ఏం లాభం.. ఆ దేవుడి హృదయం ద్రవించినా ఏం ప్రయోజనం? ఘోర ప్రమాదం.. పగబట్టినట్టుగా పడవ రూపంలో వచ్చి 17 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘాతుకాన్ని కళ్లారా చూసిన కృష్ణమ్మ కళ్లల్లో కన్నీటి సుడులు తిరుగుతున్నా.. నిస్సహాయ హృదయంతోనే ముందుకుసాగింది. ‘అయ్యో..’ అంటూ ఫెర్రి గుండెలు బాదుకుంటే, పవిత్ర సంగమం ఘాట్‌ ఇక సెలవంటూ కుమిలికుమిలి ఏడ్చింది.

ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలు.. పవిత్ర సంగమం వద్ద కృష్ణానదీ తీరాన వేదఘోష సాక్షిగా దుర్గగుడి అర్చకులు కృష్ణా, గోదావరమ్మకు పవిత్ర హారతులు ఇస్తారు. రంగురంగుల విద్యుద్దీపాల మధ్య ఈ కార్యక్రమంలో ఎంతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఆహ్లాదంగా సాగుతుంది. ఆదివారం సాయంత్రం సాయంత్రం 6.30 గంటలు.. వేదఘోష వినిపించలేదు. ఆర్తుల హాహాకారాలతో పవిత్ర సంగమం ఘాట్‌ హోరెత్తింది. బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువుల వేదనలు, రోదనలు మిన్నంటాయి. మృతదేహాలతో ఆ ప్రాంగణమంతా భీకరంగా మారింది.

సాక్షి, విజయవాడ: కృష్ణానదిలో ఇలాంటి ఘోరం మునుపెన్నడూ జరగలేదు. పడవ బోల్తాపడి ఒకేసారి 17 మంది చనిపోయిన ఘటన గత రెండు మూడు దశాబ్దాల కాలంలో వినలేదు. వారి బంధువుల రోదనలు స్థానికుల్ని కంటతడి పెట్టించాయి. ప్రమాదంలో బయటపడిన వారంతా ఒకేచోట కూర్చుని ఒకరికిఒకరు అండగా ఉన్నప్పటికీ, వారి ముఖంలో ఆందోళన కనిపించింది.

అర్ధరాత్రి దాటిన తరువాత కూడా గాలింపులు
చలికాలం కావడంతో సాయంత్రం 5.30 గంటలకే వెలుతురు తగ్గి చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో నదిలో మునిగిపోయిన వారిని వెతకడం కష్టంగా మారింది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఫ్లడ్‌లైట్‌ వెలుగులో గజ ఈతగాళ్లు అర్ధరాత్రి వరకు గాలించారు. కాగా, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం రంగంలోకి దిగి నదిలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేసింది. రాత్రి 8.30 గంటల వరకూ బాధితులు అక్కడే వేచి చూసి తమ వారి సమాచారం తెలుస్తుందేమోనని ఆశతో ఎదురుచూశారు.మృతులను, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

పట్టించుకోని అధికారులు
అధికారులు వచ్చి హడావుడి చేయడం మినహా బాధితులకు తగిన సహాయం చేసింది లేదు. పరామర్శకు వచ్చిన వైఎస్సార్‌ సీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలను అక్కడి నుంచి పంపేందుకే ప్రయత్నించారు తప్ప బాధితులను ఆదుకోలేదు. సాయంత్రం 5.15 గంటలకు ప్రమాదం జరిగితే బాధితులకు కనీసం తాగేందుకు మంచినీరు ఇవ్వలేదు. చివరకు స్థానికులే కల్పించుకుని వారికి వాటర్‌ బాటిళ్లు, బ్రెడ్‌ ఇచ్చారు. మృతుల గురించి పూర్తి సమాచారం రాత్రి వరకూ కూడా అధికారులు సేకరించలేకపోయారు. ఎంతమంది బతికి ఉన్నారు, ఎంతమంది చనిపోయారనే విషయాన్ని వారు స్పష్టంగా ప్రకటించలేదు. రెవెన్యూ, పోలీస్, జలవనరుల శాఖ, పర్యాటకశాఖ వద్ద బాధితులు, మృతుల గురించి సరైన సమాచారం లేకపోవడం విశేషం. ఇక టీడీపీ నేతలు వచ్చినా విపక్షాలపై విమర్శలు గుప్పించడానికే ప్రాధాన్యత కల్పించారు.

అనుమతులు లేకుండా బోట్ల నిర్వహణ
నదిలో బోట్లు నడపడానికి జలవనరులశాఖ అనుమతులు కావాలి. అయితే, ప్రైవేట్‌ సంస్థలు కేవలం నాలుగైదు బోట్లకు మాత్రమే అనుమతులు తీసుకుని ఎక్కువ బోట్లు తిప్పుతున్నారు. ఇదే విషయాన్ని విజిలెన్స్‌ శాఖ తన నివేదికల్లో పేర్కొన్నా ప్రభుత్వం   పట్టించుకోలేదు. 

ఇసుక మాఫియానే కారణమా..?
తుళ్లూరు రూరల్‌: సర్కారు నిర్లక్ష్యం.. అధికార పార్టీ నేతల ధనదాహానికి కొనసాగుతున్న ఇసుక తవ్వకాలే బోటు ప్రమాదానికి కారణమా? అంటే అవుననే సమాధానం స్థానికుల నుంచి వస్తోంది. తాళ్లాయపాళెం రీచ్‌ నుంచి ఫెర్రి çఘాట్‌ వరకూ దాదాపు 45 అడుగులపైగా లోతులో భారీగా తవ్వకాలు జరిగాయి. ఫలితంగా నదీగర్భంలో గోతులు ఏర్పడ్డాయి. దీంతో నదికి ఒడ్డున ఉన్న ఇసుక నీటి ప్రవాహానికి గోతుల్లోకి వెళ్లిపోతోంది. దీంతో నదీ ప్రవాహాన్ని బోటు డ్రైవరర్లు అంచనా వేయలేకపోతున్నారు.

నిబంధనలు తూచ్‌
రాష్ట్రంలో 2016, మార్చి 13వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. పేరుకే ఉచితం కానీ, తవ్వకాలు, రవాణా అంతా అనుచితమే. నదికి ఇరువైపులా ఇసుకను తవ్వేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రభుత్వం 102 ఇసుక రీచ్‌లను గుర్తించింది. వాటిలో 30 రీచ్‌ల్లో తవ్వకాలకే అనుమతులు ఉన్నాయి. అధికార పార్టీ నేతలు రెండు జిల్లాల్లో కనీసం 300 చోట్ల అక్రమ ఇసుక ర్యాంపులు ఏర్పాటుచేశారు. ర్యాంపుల కోసం ఏటిగట్టున ఉన్న పొలాలను కూడా కొనేశారు. కొన్నిచోట్ల కౌలుకు తీసుకున్నారు. మరికొన్నిచోట్ల లారీలను యంత్రాలతో నింపుతున్నారు. మీటరు లోతు కంటే ఎక్కువ తవ్వకూడదని నిబంధన ఉన్నా 10 నుంచి 20 మీటర్ల వరకూ ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. కృష్ణానదిలో నల్లమట్టి బయట పడే వరకూ తవ్వేస్తున్నారు. తుళ్లూరు మండల పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంతాలైన లింగాయపాలెం, రాయపూడి, బోరుపాలెం, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెంలో నిర్వహిస్తున్న ఇసుక తవ్వకాలకు హద్దుల్లేవ్‌. బోరుపాలెం రీచ్‌ అయితే మరీ ఘోరం. తవ్వకాలను జరిపేందుకు తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. లింగాయపాలెం గ్రామ పరిధిలోని రీచ్‌లో తవ్వకాలు దాదాపు ఫెర్రి ఘాట్‌ వరకూ చేరాయి. అదే బోటు ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు.

మునిగిన జీవన నావ
కన్నబంధాలు, కట్టుకున్న అనుబంధాలు, అల్లుకున్న బాంధవ్యాలు .. అర నిమిషంలో తెగిపోయాయి. అప్పటి వరకు సరదా కబుర్లతో, ఆనందపు జల్లులతో సాగిన బతుకు నావ తల్లకిందులైంది.ఏం జరిగిందో తెలిసేలోపు అంతా నిశ్శబ్దం..ఊపిరి అందలేదు.. ఆదుకోండని అరుద్దామంటే గొంతు పెగల్లేదు. 20 అడుగుల లోతు, నీటి ప్రవాహం..ఎవరో చేయందించి బయటకు లాగారు. చివరకి ఒడ్డుకు చేరారు..హమ్మయ్యా అని ఊపిరి తీసుకొనేలోపే గుండె పగిలే విషాదం కళ్ల ముందు సుడులు తిరిగింది. తోడుగా వచ్చిన వారిలో కొందరు విగతజీవులై పడి ఉన్నారు. ఇది చూసిన వారు జీవశ్చవాలై ‘కృష్ణమ్మా..ఎంత పని జరిగిందమ్మా’ అంటూ గుండెలవిసేలా రోదించారు. కృష్ణాతీరంలో ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌ వద్ద పడవ ప్రమాదంలో 17 మంది జల సమాధి కాగా, 8 మంది గల్లంతయ్యారు.12 మంది సురక్షితంగా బయటపడ్డారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top