విషాద యాత్ర

10 Members Dead In Road Accident - Sakshi

తిరుచ్చి సమీపంలో రోడ్డు ప్రమాదం

ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి

శ్రీవారిని చూడకుండానే కానరాని లోకాలకు

ఆరుగురికి తీవ్రగాయాలు

తమిళనాడు ప్రజలకు ఇది పవిత్ర కార్తీకమాసం. పుణ్యక్షేత్రాల సందర్శనతో పునీతులు కావాలని అందరూ ఆశిస్తారు. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్‌కు చెందిన వైద్యలింగం కూడా అలాగే భావించి 15 మందితో
తిరుమలకు బయలు దేరారు. అయితే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. పుణ్యక్షేత్రాలు చూసేలోగా పుణ్యలోకాలకు తీసుకెళ్లింది. వైద్యలింగం సహా పది మంది శ్రీవారిని దర్శించకముందే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. అత్యంత దారుణం, దయనీయమైన ఈ ప్రమాద సంఘటన నాగర్‌కోవిల్‌లో విషాదాన్ని నింపింది.

సాక్షి ప్రతినిధి, చెన్నై : డ్రైవర్‌ నిర్లక్ష్యం పది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. ఆధ్యాత్మిక యాత్ర విషాదంగా మారింది. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్‌కు చెందిన వైద్యలింగం తన బంధువులు 15 మందితో కలిసి తిరుపతిలోని ఆలయాలు చూసుకుని, తిరుమలలో శ్రీవారి దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. బుధవారం సాయంత్రం టెంపో ట్రావెలర్స్‌ వాహనంలో తిరుపతికి బయలుదేరారు. వారిలో ఏడుగురు మహిళలు, ఐదుగురు మగవారు, ఒక బాలుడు, ఒక బాలిక, డ్రైవర్‌ సహా 16 మంది ఉన్నారు. రాత్రివేళ కావడంతో అందరూ ఘాడ నిద్రలో ఉన్నారు. మంచుకాలం కావడంతో వ్యాన్‌ అద్దాలు మూసివేశారు. తిరుచ్చిరాపల్లి జిల్లా తువరంగురిచ్చి జాతీయ రహదారిలో రాత్రి 11.45 గంటల సమయంలో మోరానీమలై సర్వీసు రోడ్డులోకి వ్యాన్‌ మలుపు తిరిగింది. సరిగ్గా అదే మలుపులో సర్వీసు రోడ్డులో నిలిచి ఉన్న ఒక బోర్‌వెల్‌ లారీని వ్యాన్‌ అతివేగంగా భీకరమైన శబ్ధంతో ఢీకొంది. ఢీకొన్న వేగానికి వ్యాన్‌ ముందువైపు సగభాగం నుజ్జునుజ్జుయింది. వ్యాన్‌లో ముందువైపు కూర్చుని ప్రయాణిస్తున్న వారు సైతం నలిగిపోయారు. బస్సు అద్దాలు, ఇతర భాగాలు తీవ్రస్థాయిలో గుచ్చుకోవడంతో తొమ్మిదిమంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

అర్ధరాత్రి ఆక్రందనలు
రోడ్డు ప్రమాదంలో వ్యాన్‌ బాడీ భాగాలు, కుర్చీల కింద ఇరుక్కుపోయిన వారంతా అర్ధరాత్రి వేళ ఆక్రందనలు పెట్టారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. జేసీబీ ద్వారా లారీలోకి చొచ్చుకుపోయిన వ్యాన్‌ను వేరుచేసి మృతదేహాలను, క్షతగ్రాతులను బయటకు తీశారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఏడుగురిని తిరుచ్చిరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరొకరు మృతి చెందారు. మృతిచెందిన వారిలో నలుగురు మహిళలు, ఒక బాలుడు ఉండడం తీవ్ర విషాదకరం.
నాగర్‌కోవిల్‌కు చెందిన నటరాజన్‌ (45), వేలమ్మాళ్‌ (48), అయ్యప్పన్‌ (52), శంకరకుమార్‌ (44), పుష్పకళ (68), ఈశ్వరన్‌ (38), నీల (25), నందీష్‌ (5), జయచంద్రన్‌ (10) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రికి తరలిస్తుండగా వైద్యలింగం (79) మృతి చెందాడు. డ్రైవర్‌ రాకేష్, వైష్ణవి (20), దానమ్మాళ్‌ (43), వేలాదేవి (35), కార్తీక్‌ (12) తీవ్రగాయాలతో తిరుచ్చిరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో వైష్ణవి పరిస్థితి విషమంగా ఉంది.

నలుగురి దుర్మరణంతో వైద్యలింగం కుటుంబం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అయ్యప్పన్‌ కుమార్తె వైష్ణవి (20), నటరాజన్‌ భార్య దానమ్మాళ్‌ (43), ప్రమాదంలో భర్త శంకరకుమార్‌ను కోల్పోయిన వేలాదేవి (35) తన కుమారుడు కార్తీక్‌ (12)తో కలిసి తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. తీవ్రంగా గాయపడిన టెంపో ట్రావెలర్‌ వ్యాన్‌ డ్రైవర్‌ రాకేష్‌ను సైతం తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేర్చారు. తువరంగురిచ్చి పోలీసులు కేసు నమోదు చేసి బోర్‌వెల్‌ డ్రైవర్‌ చంద్రశేఖరన్‌ (39)ను అరెస్ట్‌ చేశారు. తిరుచ్చిరాపల్లి జిల్లా కలెక్టర్‌ రాజామణి గురువారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. వ్యాన్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాల ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రభుత్వ సహాయం అందజేస్తామని ఆయన చెప్పారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top