ప్రభుత్వ సంస్థలను మూతవేయించడం బాబుగారికి వెన్నతో పెట్టిన విద్య

ys jagan prajasankalpayatra dairy 67th day - Sakshi

67వ రోజు

21–01–2018, ఆదివారం
శ్రీకాళహస్తి, 
చిత్తూరు జిల్లా

ఉదయం లేవగానే బాగా అలసటగా అనిపించింది. నిన్నంతా చలిజ్వరం, జలుబు, తలనొప్పి బాధపెట్టాయి. జనం మధ్య తెలియలేదుగానీ.. రాత్రి కొద్దిగా కష్టంగానే అనిపించింది. డాక్టర్లు చూసి మందులిచ్చారు. తెల్లవారుజామున మరోసారి మాత్ర వేసుకో వాల్సి వచ్చింది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమన్నారు. నాకు గమ్యం గుర్తుకొచ్చింది. నా కోసం వేచి ఉండే వేలాది జనం గుర్తుకొచ్చారు. మరో ఆలోచన లేకుండా శక్తి కూడదీసుకుని పాదయాత్రకు సిద్ధమైపోయాను.

బహుశా.. ఈ శక్తంతా ఆ ప్రజలదేనేమో. వారి ప్రేమ, ఆప్యాయత, నా పట్ల నమ్మకం చూస్తుంటే.. ఆ ప్రజా కుటుంబాన్ని కలవకుండా, మాట్లాడకుండా రోజెలా గడపగలను? ఈ రోజు కూడా దారి పొడవునా ప్రజలు అదే ఆదరణతో, అదే ప్రేమతో స్వాగతిస్తుంటే.. నేను జ్వరానపడ్డ విషయమే మర్చిపోయాను. చెర్లోపల్లి హరిజనవాడకు చేరుకున్నప్పుడు పార్టీ నేతలు అక్కడ ఓ రావి మొక్కను నాటమన్నారు. పాదయాత్రలో 900 కిలోమీటర్లు పూర్తయ్యాయని గుర్తుచేశారు. అప్పుడే 900 కిలోమీటర్లు నడిచానా.. అన్న భావన మెదిలింది. 

శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లె వద్ద 900 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న వైఎస్‌ జగన్‌

కాళహస్తి శివార్లలో రాష్ట్ర పర్యాటకశాఖ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, వర్కర్లు, డైలీ వేజెస్‌పై పనిచేసే వారు కలిశారు. ప్రభుత్వం ఆ సంస్థను ప్రైవేటుపరం చేయాలని చూస్తోందట. ఆ సంస్థకు చెందిన హోటళ్లు, బోటింగ్‌ యూనిట్లు, బస్సులు, విలువైన ఆస్తులన్నింటినీ కావాల్సిన వారికి కట్టబెడుతున్నారట. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటేనే సంస్థకు లబ్ధి, ఉద్యోగులకు శ్రేయస్సు, ప్రజలకు రక్షణ సాధ్యమని మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదట. విజయవాడ బోటింగ్‌ యూనిట్‌ను ప్రైవేటుపరం చేయొద్దని సంవత్సరం కిందటే హెచ్చరించామని, ధర్నా కూడా చేశామని, అయినా పెడచెవిన పెట్టారని.. దాని ఫలితమే గత నవంబర్‌లో జరిగిన ఘోర బోటు ప్రమాదమని చెప్పారు.

ఆ దుర్ఘటనలో 23 మంది దుర్మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. టూరిజం సంస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, వసతులు కల్పించకుండా, నిర్వహణను గాలికొదిలేసి, నష్టాల ఊబిలోకి నెట్టి.. ఆ సాకుతో ప్రైవేటుపరం చేస్తున్నారట. తన స్వార్థం కోసం ప్రభుత్వ సంస్థలను ప్రణాళిక ప్రకారం మూతవేయించడం, అయినవారికి కట్టబెట్టడం, ఆ సంస్థలపై ఆధారపడిన కుటుంబాలను రోడ్డున పడేయడం బాబుగారికి వెన్నతో పెట్టిన విద్య. ఇదే జిల్లాలోని సహకార చక్కెర ఫ్యాక్టరీలు, డెయిరీలు, ప్రభుత్వరంగ సంస్థలు, మోడల్‌ స్కూళ్లు మొదలుకుని.. ఇతర ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులూ.. అవే కథలను చెబుతున్నాయి. 
కొంతదూరం పోగానే కలంకారీ వృత్తిలో ఉన్న అక్కచెల్లెమ్మలు కలిశారు. దాదాపు మూడు వేల మంది ఈ హస్తకళలపై ఆధారపడి బతుకుతుండగా, అందులో రెండు వేల మంది దాకా మహిళలే ఉన్నారట.

ప్రపంచమంతా మెచ్చిన శ్రీకాళహస్తి కలంకారీ పనితనానికి ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు, ప్రోత్సాహం లేదన్నది వారి బాధ. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి విలసిల్లిన ఈ కళకు గ్రహణం పట్టకూడదు. ప్రాచీన నాగరికతను ప్రతిబింబించే ఈ కళను కాపాడుకుని, భావితరాలకు అందించే బాధ్యత పాలకులపై ఉంది. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. చిత్తూరు జిల్లాలో విజయా డెయిరీ, సహకార చక్కెర ఫ్యాక్టరీలను పక్కా ప్రణాళికతో మూతవేయించారు. అదే తరహాలో ఏపీ టూరిజం సంస్థ ఆస్తులను మీ బినామీలకు, మీ అనుయాయులకు కట్టబెట్టాలనుకోవడం వాస్తవం కాదా? వేలాదిమంది ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేయడం న్యాయమేనా?

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top