పేదలకోసం ఎందాకైనా..

YS jagan praja sankalpa yatra in Srikalahasti constituency - Sakshi

చదువుల కోసం ఎన్ని లక్షలైనా సరే..

పాదయాత్ర తర్వాత ‘బీసీ గర్జన’

చట్టసభల్లో అన్ని కులాలకూ ప్రాధాన్యం

బీసీల ఆత్మీయ సమావేశంలో విపక్షనేత వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, తిరుపతి : చట్టసభల్లో ప్రతి కులానికీ ప్రాతిని ధ్యం కల్పించేందుకు ప్రయత్నిస్తానని విపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అన్ని కులాలనూ గుర్తించడం, వారికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులతో పాటు టీటీడీ, శ్రీకాళహస్తి వంటి కీలక పదవులను కట్టబెట్టడం ద్వారా బీసీ సామాజికవర్గాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం పాపానాయుడుపేట గ్రామంలో జిల్లాస్థాయి బీసీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

 వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మిద్దెల హరి, పార్టీ సమన్వయకర్త బియ్యపు మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఎన్నికలపుడే బీసీలను గుర్తుకు తెచ్చుకోవడం, వారికి ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందన్నా రు. ‘ఇటీవల బోయలను ఎస్టీల్లో చేరుస్తున్నామంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇప్పటికి మూడుసార్లు తీర్మానాలు చేశారు. ఇంకెన్ని సార్లు చేస్తారని జగన్‌ ఎద్దేవా చేశారు. ‘అది ఇస్తాం..ఇది ఇస్తాం అనడమే తప్ప ఇచ్చిందీ లేదు..సచ్చిందీ లేదు.

 మేనిఫెస్టోలో కులానికో పేజీ పెట్టి ఆచరణ సాధ్యం కాని హామీలను చూపి మోసం చేయడం బాబుకే చెల్లిందన్నారు. జిల్లాలో ఉన్న పెరికబలిజ కులస్తులు నలభై ఏళ్లుగా ఉంటున్నా, వారికి 2014 నుంచి బీసీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా అగ్నికుల క్షత్రియులకూ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని జగన్‌ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 2018–19లో ఎన్నికలు ఉంటాయని, ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల సమయానికి మద్యం ఎత్తివేసిన తర్వాతే ఓట్లడుగుతానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర మహిళావనికి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పాదయాత్ర ముగిశాక బీసీ గర్జన నిర్వహించి బీసీల డిక్లరేషన్‌ చేస్తామన్నారు.

సర్కారు తీరుౖపై నేతలు ఫైర్‌...
బీసీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం సమన్వయకర్త బియ్యపు మధుసూదనరెడ్డి, జిల్లా బీసీసెల్‌ అధ్యక్షుడు మిద్దెల హరి ప్రభృతులు టీడీపీ ప్రభుత్వ పోకడపై నిప్పులు చెరిగారు. 

బీసీల కోసం సంక్షేమ పథకాలంటూ గద్దెనెక్కిన పాలకులు ఎన్నికలు ముగిశాక హామీలను గాలికొదిలేశారని ఆరోపించారు. ఒకప్పుడు వ్యాపార కేంద్రం గా పేరున్న పాపానాయుడుపేట ఇప్పుడు ఇసుక మాఫియా కేంద్రంగా మారిందన్నారు. టీడీపీ హయాంలో అవినీతి పెరిగిందని బియ్యపు మధు ధ్వజమెత్తారు.

పాదయాత్రలో పాల్గొన్న నేతలు వీరే...
మంగళవారం సాయంత్రానికి 862.1 కిలోమీటర్ల దూరం నడిచిన వైఎస్‌ జగన్‌ బుధవారం మరో 13.5 కిలోమీటర్ల దూరం నడిచారు. వైఎస్‌ జగన్‌తో పాటు పార్టీ ఎంపీలు వేణుంబాక విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వెలగపూడి వరప్రసాద్, శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్‌కే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి, కిలివేటి సంజీవయ్య, కావలి ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, పార్టీ నాయకులు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, జంగా కృష్ణమూర్తి, వై.సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top