ఇక షావోమి కార్లు, ఫ్రిజ్‌లు!

Xiaomi Mi Band 2 review - Sakshi

మొత్తం 200 ఉత్పత్తులతో భారత మార్కెట్లోకి

ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో షావోమి జోరు

మున్ముందు పేమెంట్‌ సొల్యూషన్లలోకి కూడా

‘ఎంఓయూ’ సవరిస్తూ ఆర్‌ఓసీకి ప్రణాళికలు..!

సాక్షి, బిజినెస్‌ విభాగం :  రెడ్‌మీ, ఎంఐ తదితర స్మార్ట్‌ఫోన్లతో సంచలనం సృష్టించిన షావోమి... భారత్‌లో మరిన్ని ఉత్పత్తులను అందించడానికి రంగం సిద్ధం చేస్తోంది. కార్లు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు, ల్యాప్‌టాప్‌ ఇలా విభిన్నమైన ఉత్పత్తులను భారత్‌లో విక్రయించాలని ఈ కంపెనీ యోచిస్తోంది. వీటితో పాటు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్, పేమెంట్స్‌ బ్యాంక్, లీజింగ్‌ అండ్‌ ఫైనాన్సింగ్, ఇతర ఆర్థిక సేవల మార్కెట్లోకి కూడా ప్రవేశించనుంది.

ఈ మేరకు తమ భవిష్యత్తు వ్యాపార ప్రణాళికలను భారత్‌లో రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు (ఆర్‌ఓసీ) షావోమి సమర్పించిందని సమాచారం. ఈ కేటగిరీల్లో వ్యాపారాలు చేయడానికి గాను తన మెమెరాండమ్‌ ఆఫ్‌ అసోసియేషన్‌లో షావోమి టెక్నాలజీ ఇండియా సవరణలు చేసినట్లు ఆయా వర్గాలు  తెలియజేశాయి. 5,000 కోట్ల డాలర్ల సమీకరణ నిమిత్తం చైనాలో ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) రావడానికి ఈ కంపెనీ సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో తన వ్యాపార ప్రణాళికను షావోమి ఆర్‌ఓసీకి సమర్పించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

చైనాలో ఎలక్ట్రిక్‌ బైక్‌లు...
షావోమి ఇప్పటికే చైనాలో ఎలక్ట్రిక్‌ బైక్‌లు, సైకిళ్లు, ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటిల్లో మడతపెట్టడానికి వీలుండే మోడళ్లు కూడా ఉండడం విశేషం. అంతే కాకుండా ఈ కంపెనీ చైనాలో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, టీవీలు, స్మార్ట్‌ లైటింగ్‌ సొల్యూషన్లుతో పాటు ఎలక్ట్రిక్‌ టూత్‌బ్రష్‌లు, బీపీ కొలిచే డివైసెస్‌ వంటి ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులను కూడా విక్రయిస్తోంది. వాషింగ్‌ మెషీన్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు, వాక్యూమ్‌ క్లీనర్లు, వాటర్‌ ప్యూరిఫైర్లు వంటి గృహోపకరణాలతో పాటు... దుస్తులు, పిల్లల ఆట వస్తువులు, షూలు, బ్యాగ్‌లు, లగేజ్, దుప్పట్లు, కిచెన్, డైనింగ్‌ ఉత్పత్తులను కూడా అమ్ముతోంది.

భారత్‌లో కార్లు కూడా...
జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో పెద్ద దేశమైన భారత్‌ తమ ప్రాధాన్య మార్కెట్‌గా షావోమి గుర్తించింది. భవిష్యత్తులో ఇక్కడ కార్లను తయారు చేసి, విక్రయించాలని యోచిస్తోంది. కార్లు, కార్లకు సంబంధించిన విడి భాగాలను విక్రయించనుంది. రవాణాకు ఉపయోగపడే అన్ని రకాల వాహనాలను విక్రయించాలనుకుంటున్నట్ల, విద్యుత్తు, ఇతర యాంత్రిక శక్తితో నడిచే వాహనాలను అందించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ల్యాప్‌టాప్స్, గేమింగ్‌ కన్సోల్స్, కంప్యూటర్‌ యాక్సెసరీలు, లైఫ్‌ స్టైల్‌ ఉత్పత్తులు, నెట్‌వర్క్‌ ఎక్విప్‌మెంట్‌తో పాటు దుస్తులు, పిల్లల ఆట వస్తువులు, బ్యాక్‌ప్యాక్‌లు, సూట్‌కేసులు కూడా తయారు చేసి విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. ఆర్‌ఓసీకి సమర్పించిన పత్రాల్లో ఈ వస్తువులన్నింటినీ, ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ విక్రయించాలని యోచిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. మరోవైపు  చెల్లింపుల గేట్‌ వే, సెటిల్మెంట్‌  సిస్టమ్స్‌ ఆపరేటర్స్, మొబైల్‌ వర్చువల్‌  నెట్‌వర్క్‌ ఆపరేటర్లు తదితర వ్యాపారాల్లోకి ప్రవేశించడానికి కూడా ఈ కంపెనీ కసరత్తు చేస్తోంది.  

స్టార్టప్‌ల కోసం 10,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు...
భారత్‌లో వచ్చే ఐదేళ్లలో షావోమి ఫోన్ల యాప్‌లను అభివృద్ధి చేసే స్టార్టప్‌ల కోసం 10,000 కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టనున్నట్లు గత నెల్లోనే షావొమి వ్యవస్థాపకుడు, సీఈఓ లీ జున్‌ వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్లే కాకుండా, మరో 200 వరకూ ఉత్పత్తులను భారత్‌లోకి తీసుకురావాలనుకుంటున్నట్లు, లీ జున్‌ పేర్కొన్నారు.

బ్రాండ్‌ భళా..
భారత్‌లో షావోమి బ్రాండ్‌కు మంచి పేరు వచ్చిందని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ సంస్థ అసోసియేట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ చెప్పారు. ‘‘దీంతో ఈ కంపెనీ భారత మార్కెట్లోకి తెచ్చే ఇతర ఉత్పత్తులు విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇప్పటికే ఇది ఆఫర్‌ చేస్తున్న స్మార్ట్‌ వాచ్‌లు, పవర్‌ బ్యాంక్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే షావోమి ఎంఐ హోమ్‌ పేరుతో సొంత బ్రాండ్‌ స్టోర్స్‌ను ప్రారంభించడంపైనే అధికంగా దృష్టి పెట్టింది. ఈ స్టోర్స్‌ ద్వారా  తమ ఉత్పత్తులను విజయవంతంగా విక్రయించుకోవాలనేది ఈ కంపెనీ వ్యూహం’’ అని పాఠక్‌ వివరించారు.

‘భారత్‌’కు అనుగుణంగా మార్పులు చేశాకే..
స్మార్ట్‌ఫోన్లనే కాకుండా తమ ఇతర ఉత్పత్తులను కూడా భారత్‌లోకి ప్రవేశపెట్టాలన్న కోరికను ఎన్నోసార్లు వ్యక్తం చేసినట్లు కంపెనీ ప్రతినిధి చెప్పారు. భారత మార్కెట్‌కు అనుగుణంగా ఆయా ఉత్పత్తుల్లో మార్పులు, చేర్పులు చేసిన తర్వాత మాత్రమే వాటిని భారత మార్కెట్లోకి తెస్తామని ఆయన స్పష్టం చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top