భారత్‌లో పాపులర్‌ బ్రాండ్‌లు ఇవే!

Which is The Most Popular Brand in India? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇప్పటికీ అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజ కంపెనీలే భారతీయుల విశ్వాసాన్ని చూరగొంటున్నవి. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నెట్‌ సర్చ్‌ ఇంజన్‌ ‘గూగుల్‌’ భారత్‌లో ఎక్కువ పాపులర్‌ అయిన బ్రాండ్‌. ఆ తర్వాత స్థానాల్లో వాట్సాప్, యూట్యూబ్‌లు కొనసాగుతున్నట్లు లండన్‌లోని మార్కెట్‌ పరిశోధన, డేటా విశ్లేషణ సంస్థ ‘యూగౌ’ తెలిపింది. ‘బ్రాండ్‌ హెల్త్‌ ర్యాంకింగ్స్‌’ పేరిట పది సంస్థలకు ఇది రేటింగ్‌ ఇచ్చింది. వాటిలో స్విగ్గీకి ఐదవ ర్యాంక్, మేక్‌మైట్రిప్‌కు ఆరవ ర్యాంక్‌ లభించాయి.

నాణ్యత, విలువ, సంతృప్తి, పేరు ప్రతిష్టలతోపాటు వినియోగదారులు ఇతరులకు వీటిని సిఫార్సు చేస్తారా? అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాంకింగ్‌లనూ యూగౌ కేటాయించింది. భారతీయుల విశ్వాసాన్ని చూరగొన్న ఇతర పాపులర్‌ బ్రాండుల్లో అమెజాన్‌కు నాలుగవ ర్యాంక్, ఉబర్‌కు ఏడవ ర్యాంక్, ఫేస్‌బుక్, ఓలా, జుమాటోలకు వరుసగా ఎనిమిది, తొమ్మిది, పదవ ర్యాంకులు లభించాయి. 2018, జూలై ఒకటవ తేదీ నుంచి 2019, జూన్‌ 30 వరకు ఏడాది కాలాన్ని పరిగణలోకి తీసుకొని ఈ బ్రాండ్‌లను కేటాయించారు. ప్రపంచ ర్యాంకుల్లో కూడా గూగుల్‌ మొదటి స్థానంలో ఉండడం విశేషం.

ఆ తర్వాత స్థానాల్లో వరుసగా వాట్సాప్, యూట్యూబ్, శ్యామ్‌సంగ్, ఫేస్‌బుక్, అమెజాన్, ఐకియా, నైక్, పేపాల్, నెట్‌ఫిక్స్‌లు కొనసాగుతున్నాయి. భారత్‌లో 2018లోనే ఉబర్‌ఈట్స్, జొమాటో, స్విగ్గీ, ఇన్‌స్టాగ్రామ్, కొటక్‌ మహీంద్రా బ్యాంక్, అమెజాన్‌ బ్రాండ్లు ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చినట్లు ‘యూగౌ’ సంస్థ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top