ఫేక్‌ న్యూస్‌పై రీసెర్చ్‌ : రూ.34 లక్షలు పొందండి

WhatsApp Announces Research Awards To Curb Fake News - Sakshi

న్యూఢిల్లీ : నకిలీ వార్తల విషయంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు భారత ప్రభుత్వం గట్టి వార్నింగ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. "బాధ్యతారహితమైన, తీవ్ర సందేశాలు" విస్తరించకుండా నిరోధించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం వాట్సాప్‌ను  ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాట్సాప్‌ వెంటనే చర్యలు చేపట్టింది. వాట్సాప్‌లో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారంపై రీసెర్చ్‌  చేసేందుకు నిపుణులు కావాలని  బుధవారం వాట్సాప్‌ ప్రకటించింది. వారికి భారీ బహుమానాన్ని కూడా అందించనున్నట్టు తెలిపింది. తమ యూజర్ల భద్రతకు ఎక్కువగా కృషిచేస్తామని, ఈ కొత్త ప్రాజెక్ట్‌ కోసం తాము భారత్‌లోని దిగ్గజ అకాడమిక్‌ నిపుణుల కోసం చూస్తున్నామని వాట్సాప్‌ అధికార ప్రతినిధి చెప్పారు. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు ఎలా తప్పుడు సమాచారాన్ని విస్తరిస్తున్నాయో తెలుపాలని పేర్కొన్నారు. ఈ స్థానిక రీసెర్చ్‌లు నకిలీ వార్తలు, ఆందోళనకర అంశాలను గుర్తించడానికి ఉపయోగపడతారని చెప్పారు.

స్వతంత్ర పరిశోధన ప్రతిపాదనకు వాట్సాప్‌ రీసెర్చ్‌ అవార్డులు నిధులను అందిస్తాయి. ఒక్కో పరిశోధన ప్రతిపాదనకు రూ.34 లక్షల వరకు బహుమానం అందజేయనున్నామని వాట్సాప్‌ తెలిపింది. ఎక్కడైతే వాట్సాప్‌ ప్రముఖ కమ్యూనికేషన్‌ సాధనంగా ఉందో అంటే భారత్‌, బ్రెజిల్‌, ఇండోనేషియా, మెక్సికో లాంటి దేశాల్లో నిర్వహించిన పరిశోధనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడుతుందని పేర్కొంది. దీనికోసం వాట్సాప్‌ దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తోంది. పీహెచ్‌డీ పొందిన రీసెర్చర్ల నుంచి వచ్చిన దరఖాస్తులను మాత్రమే వాట్సాప్‌ అంగీకరిస్తుందని, కొన్ని కేసుల్లో పీహెచ్‌డీ లేకపోయినా.. టెక్నాలాజికల్‌ రీసెర్చ్‌ లేదా సోషల్‌ సైన్సెస్‌లో ఎక్కువ విజయాలు సాధించిన వారికి దరఖాస్తులను కూడా ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. దరఖాస్తులకు చివరి తేదీ 2018 ఆగస్టు 12గా వాట్సాప్‌ ప్రకటించింది. సెప్టెంబర్‌ 14కు దరఖాస్తు స్టేటస్‌ను రీసెర్చ్‌లకు వాట్సాప్‌ నోటిఫై చేయనుంది. మరిన్ని వివరాల కోసం వాట్సాప్‌ బ్లాగ్‌ను సందర్శించాల్సిందిగా పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top