'డైరెక్ట్‌'గానే ఫండ్స్ లో పెట్టుబడి!

What is Direct mutual fund? - Sakshi

ఏజెంట్లు, మధ్యవర్తుల ప్రమేయం లేని ‘డైరెక్ట్‌ ప్లాన్స్‌’

రెగ్యులర్‌ ప్లాన్లతో పోలిస్తే వీటిలో ఖర్చులు తక్కువ

కాబట్టి లాభంలోను, ఎన్‌ఏవీలోనూ కూడా తేడాలు

ఆయా ఫండ్‌ సంస్థల వెబ్‌సైట్ల నుంచే ఇన్వెస్ట్‌ చేయొచ్చు

ఇంకా ఈ ప్లాన్ల కోసం ఎన్నో ప్రత్యేక ప్లాట్‌ఫాంలు  

నేటి తరం మెరుగైన రాబడుల కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఆశ్రయిస్తోంది. ఉద్యోగుల్లో ఎక్కువ మంది సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా ఫండ్‌ హౌస్‌ల నుంచే డైరెక్ట్‌ ప్లాన్లను కొనుగోలు చేయడం వల్ల లాభం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏజెంట్ల కమీషన్‌ ఉండదు కనక ఫండ్‌ నిర్వహణ చార్జీలు తగ్గుతాయి. ఆ మేరకు లాభం పెరుగుతుంది. మరి ఈ మ్యూచువల్‌ ఫండ్స్‌ తాలూకు డైరెక్ట్‌ ప్లాన్లలో ఇన్వెస్ట్‌ చేయటం ఎలా? ఆన్‌లైన్‌లోనే నేరుగా చేయొచ్చా? దానికి ఉండాల్సినవేంటి? ఇవన్నీ తెలియజేసేదే ఈ కథనం...

డైరెక్ట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అంటే?
మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ నుంచి నేరుగా కొనుగోలు చేసే పథకాలను డైరెక్ట్‌ ప్లాన్లుగా పేర్కొంటారు. ఫండ్స్‌కు చెందిన పోర్టళ్ల ద్వారా వీటిని కొనేందుకు అవకాశం ఉంది. అలాగే, ఇతర బ్రోకరేజీ సంస్థలు సైతం ఫండ్స్‌ డైరెక్ట్‌ ప్లాన్లలో ఇన్వెస్ట్‌ చేసే అవకాశాన్ని ఆన్‌లైన్‌లో కల్పిస్తున్నాయి. ఇక మ్యూచువల్‌ ఫండ్స్‌ రెగ్యులర్‌ ప్లాన్లంటే ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌లో మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేసేవి.

ఎక్స్‌పెన్స్‌ రేషియో, ఎన్‌ఏవీపై ప్రభావం
డైరెక్ట్‌ప్లాన్లలో మధ్యవర్తులు ఎవరూ లేకపోవడం వల్ల వ్యయాలు తక్కువగా ఉంటాయి. అందుకే రెగ్యులర్‌ ప్లాన్‌ ఎన్‌ఏవీ కంటే డైరెక్ట్‌ ప్లాన్‌ ఎన్‌ఏవీ అధికంగా ఉంటుంది. ఏ తరహా (డెట్‌ లేదా ఈక్విటీ తదితర) పథకం అన్నదాని ఆధారంగా ఈ వ్యత్యాసం ఎక్కువ, తక్కువగా ఉంటుంది.

ఉదాహరణకు డెట్‌ఫండ్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ లిక్విడ్‌ ఫండ్‌–జి రెగ్యులర్‌ ప్లాన్‌లో ఎక్స్‌పెన్స్‌ రేషియో 0.20 శాతం. అదే డైరెక్ట్‌ ప్లాన్‌లో 0.10 శాతమే. అంటే వ్యత్యాసం 0.10 శాతం. ఈక్విటీ పథకాలైతేనే ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న పథకం ఏదన్నది తెలుసుకునేందుకు పథకం పేరును పరిశీలిస్తే చాలు. ఒకవేళ డైరెక్ట్‌ ప్లాన్‌ అయితే చివర్లో డైరెక్ట్‌ అని, రెగ్యులర్‌ అయితే రెగ్యులర్‌ అని ఉంటుంది.   

రాబడులు కాస్త ఎక్కువే...
ఎక్స్‌పెన్స్‌ రేషియో డైరెక్ట్‌ ప్లాన్లలోనే తక్కువ. కనుక రెగ్యులర్‌ ప్లాన్లకు మించి డైరెక్ట్‌ ప్లాన్లలోనే రాబడులు అధికంగా ఉంటాయి. ఈ వ్యత్యాసం 0.5 శాతం లేదా 1 శాతం కావచ్చు. దీర్ఘకాలంలో (10 నుంచి 20 ఏళ్ల కాలం) ఈ స్వల్ప శాతమే రాబడుల పరంగా భారీ వ్యత్యాసానికి దారితీస్తుంది.

ఉదాహరణకు లక్ష రూపాయల చొప్పున 20 ఏళ్ల కాలానికి ఒక మ్యూచువల్‌ ఫండ్‌కు సంబంధించి రెగ్యులర్, డైరెక్ట్‌ ప్లాన్లలో ఇన్వెస్ట్‌ చేస్తే మీ పెట్టుబడుల విలువ రెగ్యులర్‌ పథకం కంటే డైరెక్ట్‌ ప్లాన్‌లో 35 శాతం అధికంగా ఉంటుంది. వార్షికంగా 12 శాతం రాబడులు అంచనాతో, డైరెక్ట్‌ ప్లాన్‌లో ఒక శాతం ఎక్స్‌పెన్స్‌ రేషియో, రెగ్యులర్‌ ప్లాన్‌లో 2.5 శాతం ఎక్స్‌పెన్స్‌ రేషియో ప్రకారం వేసిన అంచనా ఆధారంగా తేలిన వ్యత్యాసం ఇది.

ప్లాన్‌లో మాత్రమే తేడా...
రెగ్యులర్, డైరెక్ట్‌ ప్లాన్లు అనేవి ఒక మ్యూచువల్‌ ఫండ్‌ పథకానికి సంబంధించి రెండు వేర్వేరు పెట్టుబడుల అవకాశాలు. బిర్లాసన్‌లైన్‌ ఈక్విటీ ఫండ్‌ అనేది ఈక్విటీ పథకం. దీనిలోనే డైరెక్ట్, రెగ్యులర్‌ అని రెండు ప్లాన్లు ఉంటాయి. రెగ్యులర్‌ ప్లాన్‌ మధ్యవర్తులు, డిస్ట్రిటిబ్యూటర్లకు కమిషన్లు ఇవ్వడం ద్వారా విక్రయించే ప్లాన్‌. డైరెక్ట్‌ ప్లాన్‌ నేరుగా కస్టమర్లకు విక్రయించేది. ఇది మినహా ఫండ్‌ మేనేజర్, అస్సెట్‌ అలొకేషన్‌ తీరు, రిస్క్‌లు అన్నీ కూడా రెండు ప్లాన్లకూ ఒకటే.  

సొంత జాగ్రత్తలు తప్పనిసరి
మధ్యవర్తులు ఎవరూ ఉండరు కనుక ఏ పథకంలో ఇన్వెస్ట్‌ చేయాలన్న విషయమై మీరే జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఫండ్‌ అడ్వైజర్‌ నుంచి సలహా, సూచనలు తీసుకునేట్టు అయితే ఫీజు చెల్లించి ఆ సేవలు పొందాలి. పెట్టుబడులు మాత్రం నేరుగా డైరెక్ట్‌ప్లాన్లలో చేయాలి. దీనివల్ల అధిక రాబడులకు విఘాతం కలగదు. డైరెక్ట్‌ ప్లాన్లలో ఇన్వెస్ట్‌ చేసేవారు ఏ అవసరం వచ్చినా తామే సొంతంగా చేసుకోవాల్సి రావచ్చు.  రెగ్యులర్‌ ప్లాన్లు అయితే మధ్యవర్తుల సాయం పొందొచ్చు. మన దేశంలో సుమారు 17 సంస్థలు డైరెక్ట్‌ ప్లాన్లలో ఇన్వెస్ట్‌ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

మ్యూచువల్‌ ఫండ్‌ పోర్టల్స్‌లో...
ప్రతీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి (మ్యూచువల్‌ ఫండ్‌ హౌస్‌) సొంతంగా వెబ్‌సైట్‌ ఉంటుంది. కేవైసీ వివరాలను ఇవ్వడం ద్వారా వీటి నుంచి నేరుగా డైరెక్ట్‌ ప్లాన్లలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఫండ్స్‌ పోర్టళ్ల నుంచి కొనే సమయంలోనే డైరెక్ట్‌ ప్లాన్‌తోపాటు రెగ్యులర్‌ ప్లాన్‌ కూడా చూపిస్తుంది. డైరెక్ట్‌ ప్లాన్‌నే ఎంచుకోవాలి.

వీటి నుంచి కొనుగోలు చేసేందుకు ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. లావాదేవీ చార్జీలు, వార్షిక నిర్వహణ చార్జీలు అంటూ ఉండవు. అవసరమైనప్పుడు అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ కూడా సులభంగా పొందొచ్చు. వివిధ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటే ఎన్‌ఎస్‌డీఎల్‌ ప్లాట్‌ఫాం నుంచి పొందొచ్చు. కాకపోతే లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. లేదా ఓ చోట రాసి పెట్టుకోవాలి.

సీఏఎంఎస్‌ సాయం తీసుకోవచ్చు...
కార్వీ, సీఏఎంఎస్‌ వంటివి మ్యూచువల్‌ ఫండ్స్‌కు ట్రాన్స్‌ఫర్‌ ఏజెన్సీ సేవలు అందించే సంస్థలు. షేర్లకు రిజిస్ట్రార్, ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్ల మాదిరిగానే ఫండ్స్‌కూ ఇవి ఆ తరహా సేవలు అందిస్తుంటాయి. కనుక ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు వీటి సాయం తీసుకోవచ్చు. ప్రస్తుతానికి సీఏఎంఎస్‌ లేదా కార్వీ కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలకే సేవలు అందిస్తున్నాయి. కార్వీ సంస్థ డైరెక్ట్‌ ఫండ్స్‌ కోసం ఓ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం కెట్రాక్‌ యాప్‌ను అందుబాటులో ఉంచింది.

ఈ యాప్‌ సాయంతో మ్యూచువల్‌ ఫండ్స్‌ డైరెక్ట్‌ ప్లాన్లలో కొన్నింటిలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అలాగే, మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ సైతం మ్యూచువల్‌ ఫండ్‌ యుటిలిటీ (ఎంఎఫ్‌ యుటిలిటీ) పేరుతో ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఓ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసింది. ఇందులో అన్నీ ఉచితమే. మిరే అస్సెట్‌ ఏఎంసీ, కెనరా రొబెకో ఏఎంసీలు మినహా మరే ఇతర సంస్థకు చెందిన మ్యూచువల్‌ ఫండ్‌ పథకమైనా ఈ వేదిక నుంచి ఇన్వెస్ట్‌ చేసేందుకు అవకాశం ఉంది. ఇది చాలా చౌక ప్లాట్‌ఫాం. అలాగే, సీఏఎంఎస్, కార్వీ ప్లాట్‌ఫాం సేవలు కూడా ఉచితమే.

ఇతర సంస్థలు, చార్జీలు
ఎంఎఫ్‌ యుటిలిటీపై ఆధారపడి సేవలు అందించే వాటిలో యూనోవెస్ట్, ఓరో వెల్త్, పిగ్గి యాప్, భరోసా క్లబ్, వెల్త్‌ట్రస్ట్‌ యాప్, విక్సిఫి ఉన్నాయి. మిగిలిన సంస్థలూ స్వతంత్రంగా సేవలు అందిస్తున్నాయి. మనీ ఫ్రంట్, ఇన్వెజ్టా పోటీ ధరలకు డైరెక్ట్‌ ప్లాన్లలో ఇన్వెస్ట్‌మెంట్‌ సేవల్ని ఆఫర్‌ చేస్తున్నాయి. కాస్త మెరుగైన ప్లాట్‌ఫామ్‌లుగా ఏఎంసీ సొంత పోర్టళ్లు, సీఏఎంఎస్, ఎంఎఫ్‌ యుటిలిటీలను చెప్పుకోవచ్చు. లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు జాగ్రత్తగా భద్రపరుచుకుని ఇన్వెస్ట్‌ చేసే ఓపిక ఉంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ వెబ్‌సైట్ల నుంచి డైరెక్ట్‌ ప్లాన్లను కొనడమే నయం. సేవలకు సంబంధించి రూపాయి కూడా చెల్లించక్కర్లేదు.

జెరోదా కాయిన్‌: చౌక బ్రోకరేజీ సంస్థ జెరోదా అందిస్తున్న సేవలివి. రూ.25,000 వరకు చేసే పెట్టుబడులకు ఎటువంటి చార్జీ లేదు. పెట్టుబడులు రూ.25,000 దాటిన తర్వాత నుంచి ప్రతి నెలా రూ.50 చొప్పున చార్జీ భరించాల్సి ఉంటుంది. చెల్లింపుల సేవల ప్లాట్‌ఫామ్‌లలో ఇది చౌక ప్లాట్‌ఫామ్‌ అని చెప్పుకోవచ్చు.
భరోసా క్లబ్‌: రూ.5 లక్షల విలువ గల పోర్ట్‌ఫోలియో వరకు రూ.1,780 చార్జీ. ఆపైన రూ.2 కోట్ల వరకు ఏటా రూ.1,800+పోర్ట్‌ఫోలియో విలువపై 0.25 శాతం చార్జీ. పోర్ట్‌ఫోలియో విలువ రూ.2కోట్లు దాటితే వార్షికంగా రూ.51,800 చెల్లించుకోవాలి.
క్లియర్‌ ఫండ్స్‌: ఏకమొత్తంలో ఇన్వెస్ట్‌ చేస్తే రూ.199 చార్జీ ఉంటుంది. సిప్‌ రూపంలో ఓ పథకంలో ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభిస్తే, సిప్‌ కోసం రిజిస్టర్‌ చేసుకున్న సమయంలో రూ.199 చార్జీ చెల్లిస్తే సరిపోతుంది.వెల్త్‌ ట్రస్ట్‌ ప్రతి నెలా 99 చార్జ్‌ చేస్తుండగా, మనీఫ్రంట్‌ నెలకు రూ.100, ఎక్స్‌పో వెల్త్‌ ప్రతి నెలా రూ.149 చొప్పున ఫీజులు తీసుకుంటున్నాయి. కువెరా అయితే వార్షికంగా రూ.25,000 చార్జీ వసూలు చేస్తోంది. పిగ్గీ సంస్థ ప్రతీ సిప్‌కు ఏడాదికి రూ.100 చొప్పున తీసుకుంటోంది. విక్సిఫి ప్రతీ త్రైమాసికంలో ఫండ్స్‌లో సగటు పెట్టుబడుల విలువపై 0.125 శాతం చార్జీ వసూలు చేస్తోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top