లాభాల స్వీకరణతో పతనం

What changed your markets while you were sleeping - Sakshi

రెండు రోజుల లాభాలకు బ్రేక్‌ 

భయపెట్టిన బాండ్ల రాబడులు

115 పాయింట్ల క్షీణతతో 34,501కు సెన్సెక్స్‌

44 పాయింట్ల నష్టంతో 10,571కు నిఫ్టీ  

అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. దీంతో రెండు రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది. డాలర్‌తో రూపాయి మారకం 14 నెలల కనిష్టానికి పడిపోవడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 115 పాయింట్లు పతనమై 34,501 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 10,571 పాయింట్ల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో లోహ ధరల పతనం కొనసాగుతుండటంతో మన మార్కెట్లో కూడా లోహ షేర్ల పతనం కొనసాగింది. బ్యాంక్, మౌలిక, ఫార్మా, వాహన, ఆయిల్‌ షేర్లు నష్టపోయాయి. రూపాయి పతనం కారణంగా ఐటీ షేర్లు లాభపడటంతో స్టాక్‌ సూచీల నష్టాలు పరిమితమయ్యాయి.  మంగళవారం అమెరికాలో పదేళ్ల ట్రెజరీ బాండ్ల రాబడులు కీలకమైన 3 శాతం స్థాయికి చేరాయి. బాండ్ల రాబడులు ఈ స్థాయికి చేరడం నాలుగేళ్లలో ఇదే మొదటిసారి. దీంతో అక్కడి మార్కెట్లు కుదేలయ్యాయి. ఫలితంగా బుధవారం ఆసియా మార్కెట్లు నష్టపోగా, యూరప్‌ మార్కెట్లు సైతం నష్టాల్లో ఆరంభమయ్యాయి. ఇలా అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం ఇక్కడి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. నష్టాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌ రోజంతా నష్టాల బాటలోనే సాగింది. మధ్యాహ్నం తర్వాత స్వల్పంగా లాభపడినప్పటికీ, ట్రేడింగ్‌ చివర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో 15 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 216 పాయింట్ల నష్టంతో 34,401 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 77 పాయింట్ల వరకూ నష్టపోయింది.  అంతర్జాతీయంగా బాండ్ల రాబడులు పెరుగుతుండటం, రూపాయి విలువ తరుగుతుండడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని, దీంతో మార్కెట్‌ పతనమైందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. బలహీన అంతర్జాతీయ సంకేతాల కారణంగా, లోహ షేర్లు కుదేలు కావడం, ఏప్రిల్‌ సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ కాంట్రాక్టులు ముగియనుండటం ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణకు పురికొల్పిందని వివరించారు. డాలర్‌ బలపడటం, అవుట్‌లుక్‌ మెరుగుపడటంతో ఐటీ షేర్లు పుంజుకున్నాయన్నారు. 

లాభాలు తగ్గినా, ఎగసిన ఎయిర్‌టెల్‌
భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లో ఇండస్‌ టవర్స్‌  విలీనం కానున్నదన్న వార్తలకు తోడు, అంచనాలను మించిన ఆర్థిక ఫలితాల (ఈ కంపెనీ నికర నష్టాలు ప్రకటిస్తుందన్న అంచనాలు ఉండగా, రూ.83 కోట్ల నికర లాభం ప్రకటించింది) కారణంగా భారతీ ఎయిర్‌టెల్‌ షేర్‌ 3.3 శాతం లాభంతో రూ.420 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.5,477 కోట్లు పెరిగి రూ.1,67,811 కోట్లకు ఎగసింది. భారతీ ఎయిర్‌టెల్‌ అనుబంధ కంపెనీ భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లో ఇండస్‌ టవర్స్‌ విలీనం కారణంగా  ప్రపంచంలోనే అతిపెద్ద టవర్ల కంపెనీగా (చైనా తర్వాత) అవతరించనుంది. ఈ విలీన కంపెనీకి 22 టెలికం సర్కిళ్లలో 1,63,000 టవర్లుంటాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top