10,000కు పడిపోయిన నిఫ్టీ

Weakness continues on Sensex, Nifty - Sakshi

కొనసాగిన రూపాయి క్షీణత

ప్రపంచ మార్కెట్ల పతనం

341 పాయింట్ల నష్టంతో 33,349కు సెన్సెక్స్‌

95 పాయింట్లు పతనమై 10,030కు నిఫ్టీ  

అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం, ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సమస్యపై ఆందోళనల కారణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. రూపాయి పతనం కొనసాగుతుండటం, మారుతీ సుజుకీ, యస్‌ బ్యాంక్, ఇతర కంపెనీల క్యూ2 ఫలితాలు నిరాశపరచడంతో అమ్మకాలు వెల్లువెత్తాయని నిపుణులు పేర్కొన్నారు. నవంబర్‌ సిరీస్‌ భారీ నష్టాలతో ఆరంభమైంది.

ముడి చమురు ధరలు దిగొచ్చినా, అది మార్కెట్‌పై ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 341 పాయింట్లు పతనమై 33,349 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 95 పాయింట్లు క్షీణించి 10,030 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్‌ సూచీలకు ఇది ఏడు నెలల కనిష్ట స్థాయి. అన్ని రంగాల షేర్లు క్షీణించాయి. బ్యాంక్, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ, లోహ, ఫార్మా షేర్లు బలహీనంగా ట్రేడయ్యాయి.  ఇక వారం పరం గా చూస్తే, వరుసగా 2వ వారమూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 966 పాయింట్లు(3 %), నిఫ్టీ 274 పాయింట్లు (2.7%) చొప్పున క్షీణించాయి.  

అన్నీ ప్రతికూలతలే...
డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 73.45కు పడిపోయింది. ఇప్పటివరకూ వెలువడిన కంపెనీల ఫలితాల్లో  పెద్దగా మెరుపులు లేకపోవడం, మిశ్రమంగానే ఉండటం, ఆసియా మార్కెట్లు 20 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం, యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ఆరంభమై, భారీ నష్టాల దిశగా ట్రేడవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

ఇక అమెరికా కంపెనీల లాభదాయతక ఆశించిన స్థాయిల్లో లేకపోవడం, అంతర్జాతీయ వృద్ధి మందగమన భయాలు, అమెరికా–చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, జమాల్‌ ఖషోగ్గి హత్య నేపథ్యంలో అమెరికా–సౌదీ అరేబియాల మధ్య ఉద్రిక్తతలు కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా సెన్సెక్స్‌ లాభాల్లో ఆరంభమైనప్పటికీ, ఆసియా మార్కెట్ల క్షీణతతో వెంటనే నష్టాల్లోకి జారిపోయింది.

ఇంట్రాడేలో 398 పాయింట్ల నష్టంతో 33,292 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 10,005 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ప్రపంచ మార్కెట్ల పతనమే మన ఇన్వెస్టర్లపై ప్రధానంగా ప్రభావం చూపుతోందని షేర్‌ఖాన్‌ ఎనలిస్ట్‌ రోహిత్‌ శ్రీవాత్సవ వ్యాఖ్యానించారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top