విదేశీ షాక్‌- 35,000 దిగువకు సెన్సెక్స్‌ 

Weak Global cues dent Sensex - Sakshi

561 పాయింట్లు పతనం- 34,869కు చేరిక

యూరప్‌ మార్కెట్లు 2-2.5% మధ్య డౌన్‌

డోజోన్స్‌ ఫ్యూచర్స్‌ 300 పాయింట్లు వీక్‌

ఆర్‌బీఐ నియంత్రణలో సహకార బ్యాంకులు 

ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాలూ డీలా

మిడ్‌సెషన్‌లో ఉన్నట్టుండి తలెత్తిన అమ్మకాలు చివరివరకూ పెరుగుతూ పోవగడంతో మార్కెట్లు లాభాలను వీడి పతన బాట పట్టాయి. చివరికి సెన్సెక్స్‌ 561 పాయింట్లు కోల్పోయి 34,869 వద్ద ముగిసింది. తద్వారా 35,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరగా.. నిఫ్టీ 166 పాయింట్లు క్షీణించి 10,305 వద్ద నిలిచింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ప్రారంభమైన యూరోపియన్‌ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకోవడంతో ఫ్రాన్స్‌, జర్మనీ, యూకే 2-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. ఇక యూఎస్‌ ఇండెక్స్‌ డోజోన్స్‌ ఫ్యూచర్స్‌ సైతం 300 పాయింట్లు నీరసించింది. రెండో దశ కోవిడ్‌ భయాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశంలోని అన్ని సహకార బ్యాంకులనూ రిజర్వ్‌ బ్యాంక్‌ నియంత్రణలోకి తీసుకువస్తూ కేంద్ర క్యాబినెట్‌ ఆర్డనెన్స్‌ జారీ చేసింది. దీంతో సుమారు 1540 సహకార బ్యాంకులు ఆర్‌బీఐ గొడుగు కిందకు చేరనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. ఇక మరోవైపు గురువారం జూన్‌ డెరివేటివ్‌ సిరీస్‌ ముగియనుండటంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.

రోలర్‌ కోస్టర్
నిజానికి వరుసగా నాలుగో రోజు మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తొలుత సెన్సెక్స్‌ గరిష్టంగా 35,706ను అధిగమించింది. తదుపరి అమ్మకాలు ఊపందుకోవడంతో చివర్లో 34,795 దిగువకు చేరింది. సుమారు 1000 పాయింట్ల పరిధిలో హెచ్చుతగ్గులను నమోదు చేసుకుంది. ఈ బాటలో నిఫ్టీ సైతం 10,553- 10,282 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది.

నేలచూపులే
ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ మాత్రమే(0.5 శాతం) పుంజుకోగా.. మిగిలిన అన్ని రంగాలూ బోర్లా పడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, మీడియా, రియల్టీ, ఫార్మా, మెటల్‌ 4-2 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్‌, పవర్‌గ్రిడ్‌, హిందాల్కో, జీ, ఎస్‌బీఐ, యాక్సిస్‌, సిప్లా, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 7-4 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, ఐషర్, హీరో మోటో, గెయిల్‌, నెస్లే, టాటా మోటార్స్‌, ఆర్‌ఐఎల్‌ 4-0.7 శాతం మధ్య బలపడ్డాయి.

ఫైనాన్స్‌ వీక్
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐబీ హౌసింగ్‌, నౌకరీ, బంధన్‌ బ్యాంక్‌, గ్లెన్‌మార్క్‌, డీఎల్‌ఎఫ్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, జీఎంఆర్‌ 13-5 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా.. పేజ్‌, బెర్జర్‌ పెయింట్స్‌, బీహెచ్‌ఈఎల్‌, బీవోబీ, మ్యాక్స్‌ ఫైనాన్స్‌ 9-2.25 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతంపైగా క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 1464 నష్టపోగా.. 1263 లాభపడ్డాయి.

పెట్టుబడులవైపు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 169 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 454 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 424 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌ రూ. 1,288 కోట్ల అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top