10,900 దిగువకు నిఫ్టీ 

 Trade setup: Nifty vulnerable till market breadth picks up - Sakshi

10,889 పాయింట్ల వద్ద ముగింపు

36,395 పాయింట్లకు సెన్సెక్స్‌

151 పాయింట్లు పతనం

ప్రపంచ మార్కెట్లు పటిష్టంగానే ఉన్నా, అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో మన మార్కెట్లో నష్టాలు కొనసాగాయి. నిఫ్టీ కీలకమైన 10,900 పాయింట్ల దిగువకు పడిపోయింది. 50 పాయింట్ల నష్టంతో 10,889 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 151 పాయింట్లు పతనమై, 36,395 పాయింట్ల వద్ద ముగిసింది. స్టాక్‌ సూచీలు నష్టపోవడం ఇది వరుసగా మూడో రోజు. ఈ మూడు రోజుల్లో సెన్సెక్స్‌ మొత్తం 580 పాయింట్లు క్షీణించింది. వాహన, ఫార్మా, ఇంధన షేర్లు నష్టపోగా, ఐటీ, టెక్నాలజీ షేర్లు పెరిగాయి.  

లాభాల్లో ప్రపంచ మార్కెట్లు... 
అమెరికా– చైనా అధికారుల మధ్య తాజాగా బీజింగ్‌లో చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు పెరిగాయి. వాణిజ్య ఉద్రిక్తతలను నివారించే ఒప్పందం కుదరగలదన్న ఆశలతో ఆసియా, యూరప్‌ మార్కెట్లు లాభపడ్డాయి. అమెరికా స్టాక్‌ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నేడు(మంగళవారం) వినియోగ ధరల ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు. సెన్సెక్స్‌ స్వల్ప లాభాల్లోనే ఆరంభమైంది. ఆరంభ కొనుగోళ్ల జోరుతో 42 పాయింట్లు లాభపడింది. కానీ ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రాడేలో 246 పాయింట్ల వరకూ నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడం, చమురు ధరలు దిగిరావడంతో నష్టాలు రికవరీ అయ్యాయి. మొత్తం మీద సెన్సెక్స్‌ రోజంతా 288 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో  87 పాయింట్ల వరకూ నష్టపోయింది.  

నష్టాల బాటలో వాహన షేర్లు... 
వాహన కంపెనీల క్యూ3 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటంతో ఆ రంగ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగాయి.
∙డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ను తనిఖీచేసిన అమెరికా ఎఫ్‌డీఏ ఎనిమిది పరిశీలనలను వ్యక్తం చేయడంతో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్‌ 6 శాతం క్షీణించి రూ.2,617 వద్ద ముగిసింది.  
∙నికర లాభం 54 శాతం పెరగడంతో టాటా స్టీల్‌ షేర్‌ 2.3 శాతం ఎగసి రూ.480 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
∙నికర లాభం ఈ క్యూ3లో 11 శాతం పడిపోవడం, ట్రాక్టర్లు అమ్మకాలు తగ్గుతాయన్న అంచనాలతో మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ 5.3  శాతం క్షీణించి రూ.647 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. ఇంట్రాడేలో ఈ షేర్‌ తాజా ఏడాది కనిష్ట స్థాయి రూ.644ను కూడా తాకింది. ఈ షేర్‌తో పాటు దాదాపు 400కు పైగా షేర్లు ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయిలను తాకాయి. 

మర్చంట్‌ బ్యాంకర్‌గా ఎడెల్‌వీజ్‌ తొలగింపు
రిలయన్స్‌ ఇన్సూరెన్స్‌ ఐపీఓ ∙తాజా పత్రాలు సమర్పించిన రిలయన్స్‌ బీమా
అనిల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) పత్రాలను తాజాగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించిందని సమాచారం. మర్చంట్‌ బ్యాంకర్‌గా ఎడెల్‌వీజ్‌ సంస్థను తొలగించి తాజా ఐపీఓ పత్రాలను సెబీకి రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సమర్పించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఐపీఓలో భాగంగా రూ.200 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌)లో భాగంగా 7.94 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. ఇటీవల రిలయన్స్‌ గ్రూప్‌ షేర్లు భారీగా పతనమైన విషయం తెలిసిందే. తాము తనఖా పెట్టిన షేర్లను ఎడెల్‌వీజ్‌ సంస్థ అన్యాయంగా, కావాలని విక్రయించిందని, ఫలితంగా తమ గ్రూప్‌ షేర్లు భారీగా పతనమయ్యాయని రిలయన్స్‌ గ్రూప్‌ ఆరోపించింది. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఐపీఓకు మర్చంట్‌ బ్యాంకర్లలో ఒకటిగా ఉన్న ఎడెల్‌వీజ్‌ను తొలగించి ఈ కంపెనీ తాజాగా ఐపీఓ పత్రాలను సెబీకి సమర్పించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

తనఖా షేర్ల విక్రయ వివాదంపై సెబీ దృష్టి  
రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీలు తనఖా పెట్టిన షేర్ల విక్రయంపై రిలయన్స్‌ గ్రూప్‌ చేసిన ఆరోపణలు, దీనికి ప్రతిగా సదరు సంస్థలు చేసిన ప్రత్యారోపణలపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ దృష్టి పెట్టింది. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా జరిగిన షేర్ల విక్రయం సంబంధించిన వివరాలను అందించాలని ఇప్పటికే స్టాక్‌ ఎక్సే్చంజ్‌లను అడిగామని  ఉన్నతాధికారులు పేర్కొన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top