టీసీఎస్‌ బోనస్‌ బొనాంజా

TCS tops Street view in Q4, hands out double bonanza to investors - Sakshi

ఒక్కో షేరుకి మరో షేరు ఉచితం

క్యూ4లో లాభం రూ.6,904 కోట్లు; 4.4% వృద్ధి

ఆదాయం 8.2 శాతం అప్‌; రూ.32,075 కోట్లు

షేరుకి రూ. 29 తుది డివిడెండ్‌...  

ముంబై: దేశీ సాఫ్ట్‌వేర్‌ అగ్రగామి టీసీఎస్‌ అంచనాలను మించిన ఫలితాలతో అదరగొట్టింది. వాటాదారులకు మరింత విలువ చేకూరుస్తూ ఒక్కో షేరుకి మరొక షేరును(1:1) బోనస్‌గా ఇస్తున్నట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2017–18, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.6,904 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,608 కోట్లతో పోలిస్తే 4.4 శాతం వృద్ధి చెందింది. అదేవిధంగా మొత్తం ఆదాయం కూడా 8.2 శాతం పెరుగుదలతో రూ.29,642 కోట్ల నుంచి రూ.32,075 కోట్లకు చేరింది. పరిశ్రమ విశ్లేషకులు క్యూ4లో టీసీఎస్‌ రూ.6,811 కోట్ల లాభాన్ని, రూ.31,669 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. దీనికంటే మెరుగ్గానే కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫీ కూడా క్యూ4లో అంచనాలకు అనుగుణంగానే లాభాలు, ఆదాయాన్ని ప్రకటించినప్పటికీ.. ఎబిటా మార్జిన్లు మాత్రం అంచనాలను అందుకోలేకపోయాయి. 

సీక్వెన్షియల్‌గా చూస్తే..
గతేడాది మూడో త్రైమాసికం(క్యూ3)లో లాభం రూ.6,531 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన క్యూ4లో 5.5 శాతం పెరుగుదల నమోదైంది. అదేవిధంగా ఆదాయం కూడా సీక్వెన్షియల్‌గా 3.8 శాతం ఎగబాకింది. క్యూ3లో ఆదాయం రూ.30,904 కోట్లు. ఇక క్యూ4లో ఎబిటా మార్జిన్‌ 25.4 శాతంగా నమోదైంది. డాలర్ల రూపంలో క్యూ4 ఆదాయం 3.9 శాతం వృద్ధితో 4,972 మిలియన్లకు చేరింది. గడిచిన 14 క్వార్టర్లలో ఇదే అత్యధిక వృద్ధి కావడం గమనార్హం. 

పూర్తి ఏడాదికి ఇలా... 
2017–18 పూర్తి ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ రూ.25,826 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది లాభంతో రూ.26,289 కోట్లతో పోలిస్తే 1.7 శాతం తగ్గింది. మొత్తం ఆదాయం మాత్రం 4.3 శాతం వృద్ధితో రూ.1,17,966 కోట్ల నుంచి రూ.1,23,104 కోట్లకు ఎగసింది. 

ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... 
రూ.1 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.29 చొప్పున తుది డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. దీంతో కలిపితే గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి మొత్తం డివిడెండ్‌ రూ.50కి చేరుతుంది. క్యూ4లో కంపెనీ మొత్తం ఆదాయంలో డిజిటల్‌ విభాగం ఆదాయం 23.8 శాతానికి చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4తో పోలిస్తే 42.8 శాతం ఎగబాకింది. టీసీఎస్‌ బ్రాండ్‌ విలువ 10 బిలియన్‌ డాలర్లను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా నిలిచినట్లు కంపెనీ వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వాటాదారులకు డివిడెండ్, షేర్ల బైబ్యాక్‌ రూపంలో రూ.26,800 కోట్లకు పైగా నగదును చెల్లించింది. గతేడాది 100 మిలియన్‌ డాలర్ల విభాగంలో 3 కాంట్రాక్టులు, 50 మిలియన్‌ డాలర్ల కాంట్రాక్టులు 13 దక్కాయి. క్యూ4లో ఒక్క బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సేవల రంగం(బీఎఫ్‌ఎస్‌ఐ) తప్ప అన్ని పారిశ్రామిక రంగాల నుంచి ఆదాయంలో రెండంకెల వృద్ధి నమోదైంది. ఇంధనం–యుటిలిటీస్‌లో 33.7 శాతం, పర్యాటకం–ఆతిథ్యం 25.4 శాతం, లైఫ్‌ సైన్సెస్‌–హెల్త్‌కేర్‌ ఆదాయం 12.6 శాతం చొప్పున పెరిగింది. 
     
ఇక ప్రాంతాలవారీగా చూస్తే యూరప్‌ దేశాల నుంచి వ్యాపారం 19.1 శాతం, ఉత్తర అమెరికా 4.9 శాతం, ఆసియా–పసిఫిక్‌ 8.6 శాతం చొప్పున వృద్ధి చెందింది. క్యూ4లో నికరంగా 7,800 మంది ఉద్యోగులు జతయ్యారు. ఐటీ సేవల్లో ఉద్యోగుల వలసల(అట్రిషన్‌) రేటు 11 శాతానికి తగ్గింది. పరిశ్రమ మొత్తంమీద ఇదే తక్కువ అట్రిషన్‌ రేటుగా కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది మార్చి నాటికి టీసీఎస్, అనుబంధ సంస్థలతో కలిపి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,94,998కి చేరింది. డిజిటల్‌ సాంకేతికతలో 2.47 లక్షల మంది ఉద్యోగులకు గతేడాది టీసీఎస్‌ శిక్షణనిచ్చింది.   2018 ఏడాది మార్చి 31 నాటికి కంపెనీ వద్ద రూ.48,830 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. 2017 మార్చి నాటికి ఈ నిల్వల మొత్తం రూ.35,970 కోట్లు. టీసీఎస్‌ షేరు ధర గురువారం బీఎస్‌ఈలో 1 శాతం లాభపడి రూ.3,191 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్‌  ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలు వెల్లడయ్యాయి. 

పరిశ్రమ విభాగాలన్నింటి నుంచి డిజిటల్‌ కాంట్రాక్టుల్లో పటిష్టమైన డిమాండ్‌తోపాటు పలు భారీస్థాయి డీల్స్‌ను దక్కించుకోవడంతో ఇటీవల సంవత్సరాల్లో అత్యంత మెరుగైన పనితీరును నమోదు చేసిన త్రైమాసికంగా క్యూ4 నిలిచింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో వ్యాపారపరంగా మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేందుకు ఇది తోడ్పడుతుంది. 
– రాజేష్‌ గోపీనాథన్, టీసీఎస్‌ సీఈఓ–ఎండీ   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top