టాటా మోటార్స్‌ లాభం ‘స్కిడ్‌’

Tata Motors' only race car project among business assets put up for sale - Sakshi

సగానికి తగ్గిన క్యూ4 నికర లాభం 

యూకే, ఐరోపాల్లో జేఎల్‌ఆర్‌కు ఎదురుగాలి 

దేశీయ వ్యాపారం టర్న్‌ అరౌండ్‌ 

కంపెనీ ఎమ్‌డీ గుంటర్‌ బుషెక్‌ 

వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో సగానికి పైగా తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో రూ.4,336 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో 50 శాతం తగ్గి రూ.2,176  కోట్లకు చేరిందని  టాటా మోటార్స్‌ తెలిపింది. ఉత్పత్తుల అభివృద్ధికి సంబంధించి  రూ.1,641 కోట్ల పెట్టుబడి నష్టాలు రావడం, కంపెనీ లగ్జరీ బ్రాండ్‌ జేఎల్‌ఆర్‌కు ఐరోపా, యూకేల్లో సమస్యలు ఎదురుకావడంతో నికర లాభం తగ్గిందని కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎమ్‌డీ, గుంటర్‌ బుషెక్‌ చెప్పారు. ఆదాయం రూ.78,747 కోట్ల నుంచి రూ.91,279 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. గత ఏడాది జూలై నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చినందున  ఆదాయాలను పోల్చడానికి లేదని వివరించింది. కాగా ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయాయి. కంపెనీ రూ.4,041 కోట్ల నికర లాభం సాధించగలదని విశ్లేషకులు అంచనా వేశారు.  

మరపురాని సంవత్సరం... 
దేశీయ వ్యాపారం లాభాల బాట పట్టిందని టాటా మోటార్స్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ చెప్పారు. రెండో దశ టర్న్‌అరౌండ్‌లోకి అడుగిడామని అమ్మకాలు, మార్కెట్‌ వాటా, ఆర్థిక పనితీరు మరింత మెరుగుపడుతాయన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. వాణిజ్య, ప్రయాణికుల వాహనాల సెగ్మెంట్లో మార్కెట్‌ వాటా పెరిగిందని, లాభదాయకత మెరుగుపడిందని కంపెనీ ఎమ్‌డీ బుషెక్‌ చెప్పారు.  గత ఆర్థిక సంవత్సరం తమకు మరపురాని సంవత్సరమని పేర్కొన్నారు. తమ మార్కెట్‌ వాటా పెరిగిందని, రికార్డ్‌ స్థాయి అమ్మకాలు సాధించామని, స్డాండెలోన్‌ వ్యాపారం లాభాల బాట (వన్‌ టైమ్‌ ఎక్స్‌సెప్షనల్‌ చార్జీలు మినహా) పట్టిందని వివరించారు.  తమ లగ్జరీ కార్ల అనుబంధ సంస్థ, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ అమ్మకాలు 4% తగ్గాయని తెలిపారు. చైనా, ఉత్తర అమెరికాల్లో జేఎల్‌ఆర్‌ మంచి అమ్మకాలు సాధించిందని,  అయితే బ్రెగ్జిట్‌ అంశం, కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోనూ, డీజిల్‌ ఇంజిన్లపై అనిశ్చితి వల్ల యూరప్‌లోనూ జేఎల్‌ఆర్‌ అమ్మకాలు తగ్గాయన్నారు. 

నష్టాల్లో  ఏడీఆర్‌
ఫలితాలపై ఆశావహ అంచనాలతో బీఎస్‌ఈలో టాటా మోటార్స్‌ షేర్‌ 0.4 శాతం లాభంతో రూ.309 వద్ద ముగిసింది.  న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌లో టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ ప్రారంభంలో లాభపడినప్పటికీ, ఆ తర్వాత నష్టపోయింది. రాత్రి 11.30 ని. సమయానికి 2.75 శాతం నష్టంతో  22.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.   ఏడీఆర్‌ నష్టాల్లో ఉండటంతో నేడు(గురువారం) ఈ షేర్‌ నష్టపోవచ్చని నిపుణుల అంచనా. 

ఫలితాల తీరు ఇది...
► గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నిర్వహణ లాభం 3.7 శాతం వృద్ధితో రూ.11,250 కోట్లకు పెరిగింది.  
►  స్డాండెలోన్‌ పరంగా చూస్తే కంపెనీ నికర నష్టాలు తగ్గాయి.. 2016–17 క్యూ4లో రూ.806 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.500 కోట్లకు తగ్గాయి.  ఆదాయం రూ.15,081 కోట్ల నుంచి రూ.19,779 కోట్లకు పెరిగింది.   
►  అమ్మకాలు (స్టాండెలోన్‌) 1,50,448 నుంచి 36% వృద్ధితో 2,04,255కు పెరిగాయి. దేశీయ అమ్మకాలు 39% వృద్ధితో 1,87,874కు చేరాయి.     

ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే.. 
2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.7,667 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరంలో 19 శాతం వృద్ధితో రూ.9,091 కోట్లకు పెరిగింది.   
► ఆదాయం రూ.2,74,492 కోట్ల నుంచి రూ.2,95,409 కోట్లకు వృద్ధి చెందింది.  
► గత ఏడాది మార్చి నాటికి రూ.27,485 కోట్లుగా ఉన్న  మొత్తం  రుణ భారం ఈ ఏడాది మార్చి నాటికి రూ.39,977 కోట్లకు పెరిగింది.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top