ఎయిరిండియాపై టాటా కన్ను

Tata Group to consider buying Air India: N. Chandrasekaran

కొనుగోలు అంశాన్ని పరిశీలిస్తాం

డిజిన్వెస్ట్‌మెంట్‌ వివరాల కోసం చూస్తున్నాం

తొలిసారి స్పందించిన టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌  

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నట్లు వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్‌ వెల్లడించింది. ఎయిరిండియాలో ప్రభుత్వం తలపెట్టిన డిజిన్వెస్ట్‌మెంట్‌ వ్యవహారాన్ని తమ గ్రూప్‌ తప్పకుండా పరిశీలిస్తుందని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ తెలిపారు. అయితే వాటాల విక్రయ ప్రక్రియపై ప్రభుత్వం నుంచి మరిన్ని వివరాలు రావాల్సి ఉందని ఆయన వెల్లడించారు.

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో జాయింట్‌ వెంచర్‌ అయిన విస్తారను పరోక్షంగా ప్రస్తావిస్తూ... తమ గ్రూప్‌ ఓ డజను విమానాలతోనే కార్యకలాపాలు కొనసాగించబోదని స్పష్టం చేశారు. ఎయిరిండియా కొనుగోలుపై టాటా గ్రూప్‌ అధికారికంగా స్పందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. జేఆర్‌డీ టాటా.. 1932లో ఎయిరిండియాను టాటా ఎయిర్‌లైన్స్‌గా ప్రారంభించారు. ఆ తర్వాత 1946లో దాని పేరు ఎయిరిండియాగా, 1953లో ప్రభుత్వ రంగ సంస్థగా మారడం తెలిసిందే.

ఆ తర్వాత చాన్నాళ్లకు 2000లో ఎయిరిండియాలో 40 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ఆసక్తి కనబర్చాయి. కానీ కుదరలేదు. అటుపైన ఎయిరిండియాను ప్రైవేటీకరించే యోచన ఉన్న పక్షంలో తమ గ్రూప్‌ వాటాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమంటూ 2013లో రతన్‌ టాటా సైతం ప్రభుత్వానికి తెలిపారు.

ఎలక్ట్రిక్‌ కార్ల ఆర్డరు లాభదాయకమే..
ఎలక్ట్రిక్‌ వాహనాల సరఫరా కోసం ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌ (ఈఈఎస్‌ఎల్‌) నుంచి టాటా మోటార్స్‌ దక్కించుకున్న ఆర్డరు లాభదాయకమైనదేనని చంద్రశేఖరన్‌ తెలిపారు. తాము కోట్‌ చేసిన రేటు లాభసాటి కాదంటూ మిగతా వారు చేసిన వ్యాఖ్యలు చేసినప్పటికీ.. ఇది తమకు లాభదాయకమైన కాంట్రాక్టే కాగలదని ఆయన పేర్కొన్నారు. ‘దీనిపై మహీంద్రా అండ్‌ మహీంద్రాకి చెందిన పవన్‌ గోయెంకా, ఆనంద్‌ మహీంద్రా చేసిన వ్యాఖ్యలు చూశాను. వారిద్దరి అభిప్రాయాలను నేను ఎంతో గౌరవిస్తాను.

అయితే, ఈ ప్రాజెక్టు లాభసాటిదేనని నేను కచ్చితంగా చెప్పగలను‘ అని చంద్రశేఖరన్‌ చెప్పారు. ఈఈఎస్‌ఎల్‌కి 10,000 ఎలక్ట్రిక్‌ కార్లను సరఫరా చేసే కాంట్రాక్టును అత్యంత తక్కువగా ఒక్కోటి రూ.10.16 లక్షల (జీఎస్‌టీ కాకుండా) రేటు కోట్‌ చేసి టాటా మోటార్స్‌ దక్కించుకుంది. జీఎస్‌టీతో కలిపి రూ.11.2 లక్షలవుతుంది. ఇందులో అయిదేళ్ల వారంటీ కలిపి ఉంటుంది.

ప్రస్తుతం మూడేళ్ల వారంటీతో ఇదే తరహా ఎలక్ట్రిక్‌ వాహనం కన్నా టాటా మోటార్స్‌ కోట్‌ చేసిన రేటు పాతిక శాతం తక్కువ. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్‌ ఏ ప్రాతిపదికన అంత తక్కువ రేటును ఆఫర్‌ చేసిందన్నది అర్థం చేసుకోవడం కష్టసాధ్యమేనంటూ పోటీ సంస్థ ఎంఅండ్‌ఎం ఎండీ పవన్‌ గోయెంకా వ్యాఖ్యానిం చారు కూడా.

‘నానో’ను అనవసరంగా టార్గెట్‌ చేస్తున్నారు..
ప్రత్యేక కారణాలేవీ లేకుండా నానో కారుపై అంతా అనవసరంగా విమర్శలు గుప్పిస్తున్నారని చంద్రశేఖరన్‌ వ్యాఖ్యానించారు. ఇండికా మినహా మిగతా వాహనాలన్నీ కూడా నష్టాల్లోనే ఉన్నప్పటికీ నానోనే టార్గెట్‌ చేయడం సరికాదన్నారు. ‘ప్యాసింజర్‌ వాహనాల్లో ఇండికా ఒక్కటే లాభసాటిగా ఉంది. మిగతావన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. అయినా ఎలాంటి కారణం లేకుండా ఒక్క నానోనే టార్గెట్‌ చేస్తున్నారు‘ అని చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు.

ప్యాసింజర్‌ కార్ల విభాగం నష్టాల్లో నానో వాటా కేవలం నాలుగు శాతమేనని, దీన్ని మూసివేయాలా లేదా పునరుజ్జీవింపచేయాలా అన్నది టాటా మోటార్స్‌కి యక్షప్రశ్నేమీ కాబోదని చెప్పారు. రతన్‌ టాటా కలల ప్రాజెక్టు నానో కారు నష్టాలు ఏకంగా రూ. 1,000 కోట్లు దాటేసినా, భావోద్వేగాల కారణంగా దీన్ని మూసివేయకుండా కొనసాగిస్తున్నారంటూ టాటా గ్రూప్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top