ఈ నెలలో ఈ ఆరూ కీలకం..!

Swiss referendum to the Fed decision - Sakshi

స్విస్‌ రిఫరెండం నుంచి ఫెడ్‌ నిర్ణయం దాకా  

సాక్షి, బిజినెస్‌ విభాగం:మన స్టాక్‌ మార్కెట్‌పై దేశీయ అంశాల కన్నా విదేశీ అంశాల ప్రాధాన్యతే అధికంగా ఉంటోంది. మొన్నటి వరకూ కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్‌కు కీలకంగా ఉన్నాయి. ఇక ఫలితాల సీజన్‌ అయిపోయింది. దేశీయంగా ప్రభావం చూపదగ్గ అంశాలు చూస్తే... బుధవారం వెలువడిన ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం తప్ప పెద్దగా ప్రభావితం చేసే అంశాలు లేవు. డాలర్‌తో వివిధ కరెన్సీల కదలికలకు అదనంగా ఐదారు అంతర్జాతీయ కీలకాంశాలు మన మార్కెట్‌ పైనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లపైనా ప్రభావం చూపనున్నాయి. ఈ  అంశాలపై ‘సాక్షి’ స్పెషల్‌ స్టోరీ...

స్విట్జర్లాండ్‌ రిఫరెండం... షాకా? స్వీటా?
ఈ నెల 10న స్విట్జర్లాండ్‌లో ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) జరుగుతోంది. ఈ రిఫరెండంలో రెండంశాలపై ఓటింగ్‌ జరగనుంది. మొదటిది కొత్త గ్యాంబ్లింగ్‌ చట్టం.. విదేశీ కేసినోల వెబ్‌సైట్లపై నిషేధంతో పాటు స్విట్జర్లాండ్‌ కేసినోలు రూలె, బ్లాక్‌జాక్, పోకర్‌ గేమ్స్‌కు ఆన్‌లైన్‌ వెర్షన్లను అందించడం ఈ చట్టం ముఖ్యాంశాలు. ఇక,  రెండోది, అత్యంత ముఖ్యమైనది సావరిన్‌ మనీ ఇనీషియేటివ్‌ (ఎస్‌ఎంఐ). ప్రస్తుతం రుణం జారీ చేసిన ప్రతిసారీ ఆ మేరకు వాణిజ్య బ్యాంక్‌లు ద్రవ్యాన్ని సృష్టిస్తున్నాయి. ఇలా కాకుండా కొత్త ద్రవ్యాన్ని సృష్టించే హక్కు ఒక్క స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌కు (స్విట్జర్లాండ్‌ కేంద్ర బ్యాంక్‌–ఎస్‌ఎన్‌బీ) ఉండాలని ఎస్‌ఎంఐ ప్రతిపాదిస్తోంది. దీనిని ఎస్‌ఎన్‌బీ వ్యతిరేకిస్తోంది. సావరిన్‌ మనీ ఇనీషియేటివ్‌(ఎస్‌ఎంఐ) వల్ల బ్యాంక్‌లు విచ్చలవిడిగా రుణాలివ్వడం తగ్గుతుందని మద్దతుదారులంటున్నారు. ప్రస్తుతం స్విస్‌లో చలామణిలో ఉన్న నగదులో దాదాపు 85% వరకూ బ్యాంక్‌లు సృష్టించిన ఎలక్ట్రానిక్‌ మనీయే. ఎస్‌ఎంఐ ఆమోదం పొందితే, ప్రజలు సేవింగ్స్‌ ఖాతాలో దాచుకున్న డబ్బులను, కేంద్ర బ్యాంక్‌ నుంచి, మనీ మార్కెట్ల నుంచి పొందిన ద్రవ్యాన్ని మాత్రమే బ్యాంక్‌లు రుణాలుగా ఇవ్వాల్సి ఉంటుంది.

ఇది ఆ దేశపు బ్యాంకింగ్‌ వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తుంది. సావరిన్‌ మనీ సిస్టమ్‌ప్రతిపాదన నెగ్గితే,  స్విట్జర్లాండ్‌ బ్యాంక్‌ల పనితీరు మొత్తం తల్లకిందులవుతుంది. ఇది నెగ్గితే, స్విట్జర్లాండ్‌ కరెన్సీ స్విస్‌ ఫ్రాంక్‌పై ఇన్వెస్టర్ల నమ్మకం సడలుతుంది.  యూబీఎస్, క్రెడిట్‌ సూసీ వంటి స్విట్జర్లాండ్‌ బ్యాంక్‌ల లాభాలపై తీవ్ర ప్రభావమే పడుతుంది. కరెన్సీ బలంగా ఉంటే, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నట్లు లెక్క. ఈ ఎస్‌ఎంఐ ప్రతిపాదన నెగ్గితే స్విస్‌ కరెన్సీ ఫ్రాంక్‌ బలహీనపడి.. సురక్షిత స్వర్గధామంగా స్విట్జర్లాండ్‌ హోదా మసకబారుతుంది.  ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనకు 35 శాతం మద్దతే లభిస్తోందని, ఇది వీగిపోయే  అవకాశాలే అధికంగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. బ్రెగ్జిట్‌ విషయంలోనూ సర్వేలు ఇలాగే చెప్పినా.. ఈయూ నుంచి బయటకు రావడానికే అక్కడ ప్రజలు ఓట్‌ చేయడంతో బ్రెగ్జిట్‌ అంశం కొన్ని నెలల పాటు ప్రపంచ మార్కెట్లను కుదేలు చేసింది. ఈ 10న జరిగే రిఫరెండం ప్రపంచ మార్కెట్లకు షాక్‌నిస్తుందా ? జోష్‌నిస్తుందా చూడాలి. 

ఫెడ్‌ రేట్ల పెంపుతో మార్కెట్లకు నష్టాలే!!
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం ఈ నెల 12–13 మధ్యన జరగనుంది. ఈ ఏడాది మూడుసార్లు రేట్లను పెంచాలని ఫెడ్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఒక దఫా రేట్లను పెంచేసింది. ఇక రెండో రేట్ల పెంపు ఈ నెలలోనే కావచ్చన్న అంచనాలున్నాయి. రేట్లను 1.75–2 శాతానికి పెంచే అవకాశాలున్నాయి. ఫెడ్‌ రేట్ల పెంపు వల్ల భారత్‌ వంటి వృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి విదేశీ నిధులు భారీగా తరలిపోతాయి. ఇతర మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్‌పైనే ఈ రేట్ల పెంపు ప్రభావం అధికంగా ఉండే అవకాశాలున్నాయి. భవిష్యత్తు పెంపు, ఇతర అంశాలపై ఫెడ్‌ చైర్మన్‌ చేసే కామెంట్లు కీలకమవుతాయి. ఇప్పటికే ఫెడ్‌ రేట్ల పెంపు అంచనాలతో డాలర్‌ బాగా బలపడింది. 2016, నవంబర్‌ తర్వాత డాలర్‌ మే నెలలోనే ఈ స్థాయిలో బలపడింది. మరోవైపు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ సుదీర్ఘకాలం వృద్ధి పథంలో పయనిస్తోంది ఇప్పుడే. ఈ ఏడాది నిరుద్యోగం రేటు 17 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. అమెరికా– చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, కెనడా, ఈయూలపై తాజా ఆంక్షలు.. దీనికి ప్రతిగా ఆ దేశాలు కూడా ఆంక్షలకు సిద్ధం కావడం.. ఇలాంటి కీలక పరిణామాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లకు ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమి పావెల్‌ వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. 

టర్కీ ఎన్నికలు... 
అంత ప్రాధాన్యం లేకపోయినా టర్కీ ఎన్నికలు కూడా అంతర్జాతీయంగా ప్రభావం చూపించేదే. వృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకప్పుడు టర్కీ అత్యంత కీలకంగా ఉండేది. కానీ ఈ ఏడాది బాండ్లు, కరెన్సీ విక్రయాలు భారీగా జరిగాయి. అక్కడ ఈ నెల 24న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తయ్యిప్‌ ఎర్డోగన్‌ మళ్లీ ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. తన 15 ఏళ్ల పాలనలో ఎర్డోగన్‌ ఆర్థిక వ్యవస్థపై, ద్రవ్య పాలసీపై నియంత్రణ సాధించడమే కాకుండా తన వ్యతిరేకులను తీవ్రంగా అణచివేశారు. పార్లమెంట్‌పై నియంత్రణ కోల్పోతే ఆయన అపరిమిత అధికారాలకు కత్తెర పడుతుంది. టర్కీ కరెన్సీ లీరా ఈ ఏడాది 20 శాతం పతనమైంది. ఈ నేపథ్యంలో టర్కీ ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు ప్రపంచ మార్కెట్లకు కీలకం కానున్నాయి. 

బ్రెగ్జిట్‌ భవితవ్యం...
వచ్చే ఏడాది మార్చిలో యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలుగుతుంది. బ్రెగ్జిట్‌ అనంతరం యూరోపియన్‌ యూనియన్‌తో బ్రిటన్‌ సంబంధాలు ఎలా ఉంటాయోనన్న అనిశ్చితి,  ఉత్తర ఐర్లాండ్‌తో బ్రిటన్‌కు ఉన్న సరిహద్దు సమస్య పరిష్కారంపై గందరగోళం నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 28–29 మధ్య జరిగే ఈయూ సమావేశం ప్రపంచ మార్కెట్లకు కీలకం కానుంది.

చమురు ధరలు చల్లబడతాయా?
బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు 80 డాలర్లకు చేరటంతో ఈ నెల 22న వియన్నాలో జరిగే ఒపెక్‌ సమావేశంపై అందరి దృష్టీ పడింది. 2017 నుంచి ఒపెక్‌ దేశాలు, రష్యా, ఒపెక్‌లో సభ్యత్వం లేని దేశాలు చమురు ఉత్పత్తిపై నియంత్రణ విధించాయి. ఇది ఈ ఏడాది చివరి దాకా ఉంటుంది. ఉత్పత్తిలో కోత కారణంగా ముడి చమురు ధరలు మెల్లగా పెరగనారంభించాయి. ఇరాన్‌పై తాజా ఆంక్షల వల్ల ధరలు మరింత భగ్గుమన్నాయి. ఇక ఈ నెలలో జరిగే ఒపెక్‌ సమావేశంలో ఉత్పత్తి కోతను మరి కొన్నాళ్లు కొనసాగించే విషయమై చర్చ జరుగుతుంది.

ట్రంప్‌. కిమ్‌..  సమావేశంపై ఉత్కంఠ
షెడ్యూల్‌ ప్రకారమైతే, అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షడు కిమ్‌ మధ్య సమావేశం ఈ నెల 12న జరగనుంది.  ఈ సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నామని గతంలో చెప్పిన ట్రంప్‌.. తాజాగా ఇది జరుగుతుందని ప్రకటించారు. ఇరు దేశాల అధికారుల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి. సమావేశం జరిగితే ఉత్తర కొరియా నుంచి అణు ముప్పు తప్పినట్లే. ఇది ఈక్విటీ మార్కెట్‌కు ఊపునిస్తుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లలో దీనిపై ఉత్కంఠ నెలకొంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top