కఠిన వీసా నిబంధనలు వ్యాపార వృద్ధికి అడ్డు కాదు

Strong visa regulations do not interfere with business growth - Sakshi

ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ‘ఇన్ఫోసిస్‌’ తాజాగా అమెరికా, ఆస్ట్రేలియా వంటి పలు మార్కెట్లలోని కఠినమైన వర్క్‌ వీసా నిబంధనలు వ్యాపార వృద్ధికి అడ్డుకాదని స్పష్టంచేసింది. ఆయా దేశాల్లో స్థానిక నియామకాలు, సిబ్బందికి శిక్షణనివ్వడం వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించామని తెలిపింది. ‘యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా మార్కెట్లలో ప్రస్తుత పరిస్థితిని రాజకీయాలకు అతీతంగా చూస్తే.. అధిక స్థానిక నియామకాల వల్ల మొత్తంగా సెంటిమెంట్‌ మెరుగుపడింది’ అని ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. ఆయన మోర్గాన్‌ స్టాన్లీ 20వ వార్షిక ఇండియా సదస్సులో మాట్లాడారు. వివిధ ప్రభుత్వాలు వర్క్‌ వీసా నిబంధనలను కఠినతరం చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై మీరు ఏమైనా ఆందోళన చెందుతున్నారా? అనే ప్రశ్నకు పరేఖ్‌ బదులిస్తూ.. ‘మేం అనుసరిస్తున్న లోకలైజేషన్‌ (స్థానికంగా నియామకాలు చేపట్టడం) విధానాల వల్ల సంస్థ బిజినెస్‌ మోడల్‌ సరైన దారిలోనే వెళ్తోంది.

అందువల్ల కఠినమైన వర్క్‌ వీసా నిబంధనలు మా బిజినెస్‌ వృద్ధికి అడ్డు కాదని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌ వంటి పలు మార్కెట్లలో గత కొన్ని నెలల నుంచి తాత్కాలిక వర్క్‌ వీసాలపై పర్యవేక్షణ పెరిగింది. అందువల్ల చాలా ఇండియన్‌ ఐటీ కంపెనీలు వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నాయి. అలాగే అక్కడే స్థానికంగా నియామకాలను చేపడుతున్నాయి. ‘మేం వృద్ధికి అవసరమైన నాలుగంశాలను గుర్తించాం. వీటిల్లో స్థానిక నియామకాలు, సిబ్బందికి శిక్షణనివ్వడం అనేవి ఒకటి’ అని పరేఖ్‌ తెలిపారు. తాము ఇప్పటికే అమెరికా మార్కెట్‌లో 4,000 మందికి నియమించుకున్నామని పేర్కొన్నారు. అమెరికాలో వచ్చే రెండేళ్ల కాలంలో నాలుగు టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ హబ్స్‌ను ఏర్పాటు చేస్తామని, దాదాపు 10,000 మందిని స్థానికంగా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని గతంలోనే కంపెనీ ప్రకటించింది. గ్లోబల్‌ మార్కెట్లలోని సవాళ్లను స్వీకరిస్తూ ముందుకు వెళ్లాలని పరేఖ్‌ సూచించారు. 2018 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ డిజిటల్‌ ఆదాయం 2.79 బిలియన్‌ డాలర్లుగా ఉందని, కంపెనీ మొత్తం ఆదాయంలో దీని వాటా 25.5 శాతానికి సమానమని పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top