ఆటోల జోరు... బ్యాంకుల బేజారు 

Stocks on Dalal Street reflecting who gains, who loses - Sakshi

బడ్జెట్‌ రోజు తీవ్ర ఒడిదుడుకుల్లో మార్కెట్‌  

ఆర్థిక మంత్రి ప్రసంగం తర్వాత సగం లాభాలు ఆవిరి 

మెప్పించిన ఆదాయ పన్ను పరిమితి పెంపు  

కానీ కట్టుతప్పిన ద్రవ్యలోటు  

ఇంట్రాడేలో 521 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ 

చివరకు 213 పాయింట్ల లాభంతోనే ముగింపు  

ఇంట్రాడేలో 11,000 పాయింట్లపైకి నిఫ్టీ  

కానీ 63 పాయింట్లు లాభంతో 10,894 వద్దే ముగింపు 

ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వరాలు కురిపించిన తాజా బడ్జెట్‌ స్టాక్‌ మార్కెట్‌ను ఒడిదుడుకులకు గురి చేసింది. ఎవరూ ఊహించని వరాలు కురిపించినా, ఇంట్రాడేలో భారీ లాభాలు వచ్చినా, చివరకు ఓ మోస్తరు లాభాలతోనే స్టాక్‌సూచీలు సరిపెట్టుకున్నాయి.  రైతులు, మధ్య తరగతి వర్గాల ఓట్లే లక్ష్యంగా రూపొందిన ఈ బడ్జెట్‌ కారణంగా  స్టాక్‌ సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురయ్యాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్‌ చివరకు  213 పాయింట్ల లాభంతో 36,469 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఇంట్రాడేలో 11,000 పాయింట్లకు పైగా ఎగసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో 10,894 పాయింట్ల వద్ద ముగిసింది.   ద్రవ్యలోటు కట్టు తప్పినా, ప్రజాకర్షక పథకాలు ప్రకటించినా,  మొత్తం మీద మార్కెట్‌ సెంటిమెంట్‌ సానుకూలంగానే ఉంది. ఇక వారం పరంగా చేస్తే, సెన్సెక్స్‌ 444 పాయింట్లు, నిఫ్టీ 113 పాయింట్లు చొప్పున పెరిగాయి.   ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకం వ్యవసాయ రంగ షేర్లను పెంచింది. 

సగమైన లాభాలు... 
ఆసియా మార్కెట్ల సానుకూలతతో మన మార్కెట్‌ లాభాల్లోనే ఆరంభమైంది. పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రసంగం ఆరంభమయ్యే ఉదయం 11 గంటల వరకూ స్టాక్‌ సూచీలు స్తబ్ధుగానే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 521 పాయింట్లు, నిఫ్టీ 153 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ఆరంభం కావడం, ద్రవ్యలోటు కట్టుతప్పడం, బ్యాంకింగ్, ఫైనాన్స్‌ రంగ షేర్లలో అమ్మకాలు , డాలర్‌తో రూపాయి మారకం బలహీనంగా ట్రేడ్‌ కావడం  ప్రతికూల ప్రభావం చూపించాయి. దీంతో స్టాక్‌ సూచీలు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ 35 పాయింట్లు, నిఫ్టీ 18 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. జనవరి నెల వాహన విక్రయాలు బాగా ఉండటంతో వాహన షేర్లు పెరగడం, రియల్టీ, వినియోగ షేర్లలో కొనుగోళ్ల జోరు కారణంగా స్టాక్‌ సూచీలు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్‌ 556 పాయింట్లు, నిఫ్టీ 171 పాయింట్ల రేంజ్‌లో కదలాడాయి.  

వేదాంత 18 శాతం డౌన్‌... 
వేదాంత షేర్‌ 18 శాతం నష్టంతో రూ.162  వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. ఈ క్యూ3లో ఈ కంపెనీ నికర లాభం 26 శాతం తగ్గి రూ.1,574 కోట్లకు చేరింది. కంపెనీ ప్రమోటర్‌ అనిల్‌ అగర్వాల్‌కు చెందిన ఫ్యామిలీ ట్రస్ట్, ఓల్కన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో  వేదాంత అనుబంధ కంపెనీ కెయిర్న్‌ ఇండియా హోల్డింగ్స్‌ రూ.1,431 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడంపై విమర్శలు, సందేహాలు తలెత్తడంతో ఈ కంపెనీ షేర్‌ భారీగా నష్టపోయింది. 

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌... ఐదో రోజూ పతనబాటే
దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌)షేర్‌ నష్టాలు ఐదో రోజూ కొనసాగాయి. ఈ సంస్థ రూ.31,000 కోట్ల మేర నిధులను దారి మళ్లించిందని ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్‌ కోబ్రా పోస్ట్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయమై ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించిందన్న వార్తల నేపథ్యంలో శుక్రవారం ఈ షేర్‌ 18 శాతం నష్టపోయి రూ.111 వద్ద ముగిసింది. 

మరిన్ని విశేషాలు...
∙యస్‌ బ్యాంక్‌ సీనియర్‌గ్రూప్‌ ప్రెసిడెంట్‌ ప్రణయ్‌ మండల్‌ రాజీనామా చేయడంతో యస్‌ బ్యాంక్‌ షేర్‌ 74 శాతం క్షీణించి రూ.186 వద్ద ముగిసింది. ఈ షేర్‌ పతనం కావడం ఇది వరుసగా ఐదో రోజు.  
∙పీసీఏ నిబంధనల నుంచి మినహాయింపు పొందిన బ్యాంక్‌ షేర్లు మిశ్రమంగా ముగిశాయి. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 1 శాతం లాభపడగా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ షేర్లు లాభపడినా, చివరకు నష్టాల్లో ముగిశాయి.  

∙ఈ క్యూ3లో నికర లాభం 45 శాతం పెరగడంతో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్‌ 2 శాతం లాభంతో రూ.2,787 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ తాజా ఏడాది గరిష్ట స్థాయి, రూ.2,810ని తాకింది. 
∙ఇతిహాద్‌ ఎయిర్‌వేస్‌ షరతులకు తలొగ్గి రుణం తీసుకోవడానికి జెట్‌ ఎయిర్‌వేస్‌ సిద్దమైందన్న వార్తల కారణంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ 8 శాతం లాభపడి రూ.256 వద్ద ముగిసింది.

దివాలా పిటీషన్‌ దాఖలుకు ఆర్‌కామ్‌ నిర్ణయం 
రుణ భారం తగ్గించుకునేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో దివాలా పిటీషన్‌ వేయాలని టెలికం సంస్థ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) నిర్ణయించింది. వ్యూహాత్మక రుణ పరిష్కార ప్రణాళిక ప్రతిపాదన తెరపైకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయినా ఇంత వరకూ ఎలాంటి పురోగతి లేకపోవడంతో బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కంపెనీ షేర్‌ ధర ఎన్‌ఎస్‌ఈలో 1.28 శాతం క్షీణించి రూ.11.60 వద్ద ముగిసింది. 

జీఎస్‌టీ లక్ష్యానికి రూ.లక్ష కోట్ల దూరంలో... 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీఎస్‌టీ వసూళ్లు లక్ష్యానికి అడుగు దూరంలో ఆగిపోనుంది. రూ.లక్ష కోట్ల మేర తక్కువ వసూళ్లు అవుతాయని అంచనా. ఇక రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.7.61 లక్షల కోట్లను జీఎస్టీ వసూళ్ల లక్ష్యంగా కేంద్రం నిర్ణయించింది. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీఎస్‌టీ రూపంలో కేంద్ర ఖజానాకు రూ.7.43 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని ప్రభుత్వం గత బడ్జెట్‌లో అంచనాలు వేసింది. కానీ తాజా బడ్జెట్‌లో ఈ లక్ష్యాన్ని ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ రూ.6.43 లక్షల కోట్లకు సవరించినట్టు ప్రకటించారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 10 నెలల కాలంలో కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో కలిపి వసూలైన జీఎస్‌టీ రూ.9.71 లక్షల కోట్లుగా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కేంద్రం, రాష్ట్రాల జీఎస్టీ వసూళ్ల లక్ష్యం రూ.13.48 లక్షల కోట్లు. 

ఎయిర్‌ ఇండియా అసెట్‌ హోల్డింగ్స్‌కు రూ.3,900 కోట్లు 
ఎయిర్‌ ఇండియా రుణ నిర్వహణా సేవలు, పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి ఏర్పాటయిన స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌... ఎయిర్‌ ఇండియా అసెట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌కు బడ్జెట్‌ రూ.3,900 కేటాయించింది.ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.1,300 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.2,600 కోట్లు కేటాయిస్తారు. ఎయిర్‌ ఇండియా ప్రస్తుతం రూ.55,000 కోట్ల రుణ భారాన్ని మోస్తున్న సంగతి తెలిసిందే.

కట్టుతప్పిన ద్రవ్యలోటు: జీడీపీలో 3.4 శాతం (2018–19 బడ్జెట్‌ అంచనా 3.3 శాతం మాత్రమే )

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top