బ్యాంక్‌ షేర్లు బేజారు..

stock market's worst-case scenario is playing out - Sakshi

చివర్లో అమ్మకాలు  

145 పాయింట్ల నష్టంతో 34,156కు సెన్సెక్స్‌    

39 పాయింట్ల పతనంతో 10,501కు నిఫ్టీ  

ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్‌  నష్టాల్లో ముగిసింది. లాభనష్టాల మధ్య కదలాడిన స్టాక్‌ సూచీలు చివరకు నష్టాల్లో ముగిశాయి. చివరి గంటలో వెల్లువెత్తిన అమ్మకాల కారణంగా అప్పటివరకూ హెచ్చుతగ్గులకు లోనైన స్టాక్‌ సూచీలు క్షీణించాయి. సెన్సెక్స్‌145 పాయింట్లు నష్టపోయి 34,156 పాయింట్ల వద్ద, నిఫ్టీ 39 పాయింట్ల పతనంతో 10,501 పాయింట్ల వద్ద ముగిశాయి. మొండి బకాయిల విషయమై ఆర్‌బీఐ కఠినతరమైన కొత్త నిబంధనలను తీసుకురావడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మరోవైపు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో రూ.11,300 కోట్ల మేర అవకతవకల లావాదేవీలు జరిగాయన్న వార్తలు ప్రతికూల ప్రభావం చూపించాయి. బ్యాంక్‌ షేర్లు 10 శాతం వరకూ నష్టపోయాయి.  

లాభాల్లోంచి.. నష్టాల్లోకి... 
ఐఐపీ, ద్రవ్యోల్బణ  గణాంకాలు ఆశావహంగా ఉన్న  నేపథ్యంలో  సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. కొనుగోళ్లు జోరుగా ఉండటంతో సెన్సెక్స్‌ 173 పాయింట్ల లాభంతో 34,473 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడం కలసివచ్చింది. అయితే లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్‌   272 పాయింట్ల నష్టంతో  34,029 పాయింట్ల కనిస్ట స్థాయికి పడిపోయింది. మొత్తం మీద 445 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  ఇక నిఫ్టీ ఒక దశలో 51 పాయింట్లు లాభపడగా, మరో దశలో 83 పాయింట్లు నష్టపోయింది.  
మొండి బకాయిల గుర్తింపు, వీటిని పరిష్కారానికి సంబంధించిన నిబంధనలను ఆర్‌బీఐ కఠినతరం చేసింది.

దీంట్లో భాగంగా ఆరు రకాల రుణ పునర్వ్యస్థీకరణ విధానాలను రద్దు చేసింది. ఈ తాజా నిబంధనల కారణంగా మొండి బకాయిలు మరింతగా పెరిగి, కేటాయింపులు అధికమవుతాయని, ఫలితంగా బ్యాంక్‌ల లాభదాయకత దెబ్బతింటుందని నిపుణులంటున్నారు. మరోవైపు ముంబై బ్రాంచ్‌లో రూ.11,300 కోట్ల మేర అవకతవకల లావాదేవీలు జరిగాయన్న వార్తలతో పీఎన్‌బీ  10 శాతం పతనమైంది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top