రూపాయి, చమురు... కీలకం

Stock markets this week - Sakshi

ఈ వారమే ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు

దీంతో ఒడిదుడుకులుండొచ్చు

నిపుణుల అంచనాలు

డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం,  జీడీపీ, తయారీ రంగ, మౌలిక రంగ గణాంకాలు ఈ వారం స్టాక్‌ మార్కెట్‌కు కీలకమని నిపుణులంటున్నారు. మే సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ఈ వారమే ముగియనుండటంతో ఈ వారం స్టాక్‌ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని వారంటున్నారు.   

జీడీపీ గణాంకాలు...
ఇక ఈ వారంలో ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్, కోల్‌ ఇండియా, ఆయిల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, అరబిందో ఫార్మా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కాక్స్‌ అండ్‌ కింగ్స్, క్వాలిటీ కంపెనీలు ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తాయి. ఇక శుక్రవారం ఈ నెల వాహన విక్రయ గణాంకాలను కంపెనీలు వెల్లడించనుండటంతో వాహన షేర్లు వెలుగులోకి  వస్తాయి.

ఈ ఏడాది తొలి త్రైమాసిక జీడీపీ గణాంకాలను ప్రభుత్వం ఈ నెల 31న(గురువారం) వెల్లడిస్తుంది. గత ఏడాది చివరి మూడు నెలల్లో జీడీపీ 7.2 శాతంగా నమోదైంది. ఇక శుక్రవారం (వచ్చే నెల 1న) మే నెల తయారీ రంగ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌(పీఎమ్‌ఐ) గణాంకాలు వస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో తయారీ రంగ పీఎమ్‌ఐ 51.6గా నమోదైంది. ఈ వారంలోనే ఏప్రిల్‌ నెల మౌలిక రంగ పరిశ్రమల పనితీరుకు సంబంధించిన గణాంకాలు కూడా వెలువడతాయి.  

అంతంతమాత్రంగా కంపెనీల ఫలితాలు  
పలు కంపెనీల క్యూ4 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలు కూడా తగ్గే అవకాశాలున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. బాండ్ల రాబడులు పెరగడం, రూపాయి తరిగిపోవడం,  కరంట్‌ అకౌంట్‌ లోటు పెరగడం.. ఈ అంశాలన్నీ సమీప భవిష్యత్తులో మార్కెట్‌ పనితీరుపై ప్రభావం చూపుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఇక అంతర్జాతీయ పరిణామాల పరంగా చూస్తే, ఉత్తర కొరియా, అమెరికాల మధ్య శిఖరాగ్ర సమావేశ పరిణామాలు కీలకం కానున్నాయి.  

కొనసాగుతున్న విదేశీ ఉపసంహరణలు
మన క్యాపిటల్‌ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు రూ.26,700 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమంటుండటమే దీనికి ప్రధాన కారణమని వారంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ స్టాక్‌ మార్కెట్‌ నుంచి రూ.7,819 కోట్లు, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.18,950 కోట్లు చొప్పున తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top