స్టాక్‌ మార్కెట్‌కు ‘శక్తి’ కాంతులు

Stock market volatility is price to achieve returns - Sakshi

కొత్త గవర్నర్‌కు  భారీ లాభాలతో స్వాగతం 

సానుకూలంగా  అంతర్జాతీయ సంకేతాలు  విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలున్నా, మార్కెట్‌ ముందుకే

మళ్లీ 10,700 పాయింట్లపైకి నిఫ్టీ

188 పాయింట్ల లాభంతో 10,783 వద్ద ముగింపు

629 పాయింట్లు పెరిగి  35,779కు సెన్సెక్స్‌

ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ శక్తికాంత దాస్‌కు స్టాక్‌ మార్కెట్‌ బుధవారం భారీ లాభాలతో స్వాగతం పలికింది. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిన ఉర్జిత్‌ పటేల్‌ స్థానంలో కేంద్రం ప్రభుత్వం ఏమాత్రం జాగు చేయకుండా శక్తికాంత దాస్‌ను నియమించింది. సకాలంలో శక్తికాంత దాస్‌ నియామకం జరగడంతో లిక్విడిటీ సమస్యలను తీర్చడానికి కేంద్రం తగిన చర్యలను తగిన సమయంలో తీసుకోగలదన్న అంచనాలు పెరిగాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడవడంతో స్టాక్‌ సూచీలు భారీగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు మంగళవారం రూ.2,421 కోట్ల నికర అమ్మకాలు జరిపినా, ముడిచమురు ధరలు 1.8 శాతం వరకూ ఎగిసినా, మార్కెట్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మళ్లీ కీలకమైన 10,700 పాయింట్ల పైకి ఎగబాకింది. 188 పాయింట్ల లాభంతో 10,738 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 629 పాయింట్లు పెరిగి 35,779 పాయింట్ల వద్ద ముగిసింది. స్టాక్‌ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లోనే ముగిశాయి. అన్ని రంగాల షేర్లతో పాటు సెన్సెక్స్‌ షేర్లన్నీ కూడా లాభాల్లో ముగియడం విశేషం. రియల్టీ, వాహన, లోహ, క్యాపిటల్‌ గూడ్స్, ఆర్థిక రంగ షేర్లు లాభాలు సాధించాయి.  

ఆద్యంతం లాభాలే.... 
ఆసియా మార్కెట్ల జోష్‌తో స్టాక్‌ మార్కెట్‌ మంచి లాభాలతోనే ఆరంభమైంది. సెన్సెక్స్‌ 128 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్ల లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆ తర్వాత ఈ లాభాలు అంతకంతకూ పెరిగాయి. స్టాక్‌ మార్కెట్‌ రోజంతా లాభాల బాటలోనే నడిచింది. ట్రేడింగ్‌ చివర్లో కొనుగోళ్లు మరింత జోరుగా సాగడంతో చివర్లో లాభాలు బాగా పెరిగాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 677 పాయింట్లు, నిప్టీ 203 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. కొన్ని షేర్లలో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జోరుగా జరిగాయని. అంతేకాకుండా ఇటీవలి పతనంలో నష్టపోయి ఆకర్షణీయంగా ఉన్న కొన్ని షేర్లలో వేల్యూ బయింగ్‌ కూడా చోటు చేసుకుందని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు.  

మరిన్ని విశేషాలు... 
∙అమెరికాలో తయారైన కార్లపై ప్రస్తుతం విధిస్తున్న 40% సుంకాన్ని చైనా 15%కి  తగ్గించవచ్చన్న వార్తల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో వాహన షేర్లు లాభపడ్డాయి. దీనికి మన దేశ వాహన షేర్లు కూడా శ్రుతి కలిపాయి. హీరో మోటొకార్ప్‌ 7 శాతం లాభంతో రూ.3,265 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అధికంగా లాభపడిన షేర్‌ ఇదే.  
∙కొత్త రుణాలు ఇవ్వకుండా ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు అడ్డం పడుతున్న ప్రాంప్ట్‌ కరెక్టివ్‌ యాక్షన్‌ (పీసీఏ) నిబంధనలను కొత్త గవర్నర్‌ సడలిస్తారనే అంచనాలతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల షేర్లు లాభపడ్డాయి. కార్పొరేషన్‌  బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, దేనా బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూకో బ్యాంక్‌లు 3–6 శాతం రేంజ్‌లో పెరిగాయి.  
∙సెన్సెక్స్‌లో మొత్తం 31 షేర్లూ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీలో మాత్రం 4 షేర్లు.. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, భారతీ ఇన్‌ఫ్రా, హెచ్‌పీసీఎల్, టైటాన్‌లు నష్టపోయాయి. మిగిలిన 46 షేర్లు లాభపడ్డాయి.

మార్కెట్‌ ఎందుకు పెరిగిందంటే..
కొత్త ఆర్‌బీఐ బాస్‌పై  భారీ ఆశలు... 
ఆర్‌బీఐ గవర్నర్లుగా పనిచేసిన ఐఏఎస్‌ ఆఫీసర్లు దువ్వూరి సుబ్బారావు, వైవీ రెడ్డి సమర్థవంతంగా ఆ పదవిని నిర్వహించారని తాజాగా ఆర్‌బీఐ కొత్త బాస్‌ కూడా అదే స్థాయిలో ఈ పదవికి వన్నె తేగలరనే అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా శక్తికాంత దాస్‌కు ద్రవ్య, ఆర్థిక వ్యవహరాల నిర్వహణలో అపార అనుభవం ఉందని, టీమ్‌ మేనేజ్‌మెంట్‌లో మంచి నైపుణ్యం ఉందని, ఇవన్నీ ఆయనకు కలసివస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రస్తుతం ఏర్పడి న ఘర్షణ వాతావరణాన్ని ఆయన సమర్థవంతంగా డీల్‌ చేస్తారని వారు అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ కొత్త బాస్‌పై ఈ సానుకూల అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి.  

ప్రపంచ మార్కెట్ల జోరు... 
చైనాతో తదుపరి ఒప్పందం జరిగేంత వరకూ తాజాగా ఆ దేశం వస్తువులపై సుంకాలు విధించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ వెల్లడించడం ప్రపంచ మార్కెట్లలో జోష్‌ను నింపింది. దీంతో ఆసియా, యూరప్‌ మార్కెట్లు లాభాల్లోనే సాగాయి. ఆసియా మార్కెట్లు 2 శాతం వరకూ యూరప్‌ మార్కెట్లు 1% వరకూ లాభపడ్డాయి.  

ముగిసిన ఫలితాలు.. మొదలైన కొనుగోళ్లు
కీలక రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోయినా, మరీ ఘోరమైన ఓటమి కాకపోవటంతో... ఈ గుణపాఠంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ గెలుపు వ్యూహాలకు పదును పెడతారని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ నరేంద్ర మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. ఎన్నికల ఫలితాల కారణంగా తాత్కాలికంగా నిలిపేసిన కొనుగోళ్లను ఇన్వెస్టర్లు మళ్లీ మొదలు పెట్టారని,  దీంతో స్టాక్‌ సూచీలు దూసుకుపోయాయని విశ్లేషకులు పేర్కొన్నారు.

రూ.2.79 లక్షల కోట్లు  పెరిగిన ఇన్వెస్టర్ల సంపద 
స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన  కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2.79 లక్షల కోట్లు పెరిగి రూ.1,42,17,920 కోట్లకు ఎగసింది.

డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు  4.69 శాతం పతనం 
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌కు యూఎస్‌ అప్పీల్స్‌ కోర్టు షాకిచ్చింది. ఇండివియార్‌ తయారీ సుబోక్సోన్‌ జనరిక్‌ ఔషధం విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో రెడ్డీస్‌ షేరు బుధవారం 4.69 శాతం పతనమై రూ.2,582.10 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో షేరు ధర రూ.2,535.60 దాకా పతనమై ఆ తర్వాత కోలుకుంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top