11,500 దిగువకు నిఫ్టీ

Stock market update: Over 80 stocks hit 52-week lows on NSE - Sakshi

ఆరో రోజూ కొనసాగిన పతనం 

ఆగని రూపాయి క్షీణత   

ఆజ్యం పోస్తున్న వాణిజ్య ఉద్రిక్తతలు

నిరుత్సాహపరిచిన సేవల రంగం పీఎమ్‌ఐ గణాంకాలు 

రూపాయి పతనం కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం కూడా స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. స్టాక్‌ సూచీలు వరుసగా ఆరో రోజూ క్షీణించాయి. రూపాయి మరోసారి తాజా కనిష్ట స్థాయికి పడిపోవడం, సేవల రంగం  గణాంకాలు నిరుత్సాహపరచడం, దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు పతనం కావడం... ప్రతికూల ప్రభావం చూపించాయి. అయితే  భారీగా పతనమైన లోహ షేర్లు చివరి గంటలో కోలుకోవడం, ఫార్మా షేర్ల లాభాలతో స్టాక్‌ సూచీల నష్టాలు తగ్గాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 140 పాయింట్లు పతనమై 38,018 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 43 పాయింట్లు క్షీణించి 11,477 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 384 పాయింట్లు. నిఫ్టీ 123 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. గత ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 878 పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 11,400 పాయింట్ల దిగువకు పతనమైంది. స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఆరంభ కొనుగోళ్ల జోరుతో 93 పాయింట్ల లాభంతో  38,251 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లోకి జారిపోయింది. 384 పాయింట్ల నష్టంతో 37,774 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. మొత్తం మీద 477 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. 

రూ.3.31 లక్షల కోట్లు ఆవిరి...
ఇన్వెస్టర్ల సంపద గత ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో మొత్తం రూ.3.31 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ గత నెల 28న రూ.158 లక్షల కోట్లుగా ఉండగా, బుధవారం నాటికి రూ.155 లక్షల కోట్లకు తగ్గింది. 

స్టాక్‌ మార్కెట్‌ పతనంతో పాటు పలు షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బీపీసీఎల్,  ఎమ్‌ఆర్‌పీఎల్, వొడాఫోన్‌ ఐడియా, భారత్‌ ఎలక్ట్రానిక్స్, ఫోర్స్‌మోటార్స్, టాటా కమ్యూనికేషన్స్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

లార్సెన్‌ అండ్‌ టుబ్రో: లార్సెన్‌ అండ్‌ టుబ్రో ఇన్ఫోటెక్‌లో 6.08 శాతం వాటాకు సమానమైన కోటికి పైగా షేర్లను విక్రయించింది. ఈ నెల 3,4 తేదీల్లో ఈ షేర్లను ఫ్లోర్‌ ధర, రూ.1,700కు ఎల్‌ అండ్‌ టీ విక్రయించింది. ఈ వాటా విక్రయం కారణంగా ఎల్‌టీఐలో ఎల్‌ అండ్‌ టీ వాటా 75 శాతానికి తగ్గింది.   

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌కు ప్రతిష్టాత్మక కాంట్రాక్టు...
ఉపరితలం నుంచి గగనానికి ప్రయోగించే లాంగ్‌ రేజ్‌ క్షిపణుల సరఫరా కాంట్రాక్ట్‌ను సాధించామని తెలిపింది. ఈ క్షిపణులను మజగావ్‌ డాక్‌ లిమిటెడ్, గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ కంపెనీలకు సరఫరా చేయాల్సి ఉంటుందని వివరించింది. ఈ కాంట్రాక్ట్‌  విలువ రూ.9,200 కోట్లని తెలిపింది. దీంతో తమ ఆర్డర్‌ బుక్‌ రూ.50,000 కోట్లు దాటిందని, ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్డర్‌ బుక్‌ రూ.50,000 కోట్లు దాటడం ఇదే మొదటిసారని పేర్కొంది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top