సెన్సెక్స్‌ 38,000 పైకి..

Stock market update: Market trades higher; these stocks make merry  - Sakshi

బ్యాంక్‌ షేర్ల జోరు   ఆగని రికార్డ్‌ల హోరు 

ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త శిఖరాలకు సూచీలు 

137 పాయింట్ల లాభంతో 38,024కు సెన్సెక్స్‌ 

21 పాయింట్లు పెరిగి 11,471కు నిఫ్టీ  

దలాల్‌ స్ట్రీట్‌లో స్టాక్‌ సూచీలు దుమ్ము రేపుతున్నాయి. అంతర్జాతీయ సంకేతాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, సూచీల రికార్డ్‌ల పరుగు జోరుగా సాగుతోంది. గురువారం సెన్సెక్స్‌ చరిత్రాత్మకమైన 38,000 పాయింట్లను దాటేయగా, నిఫ్టీ 11,500 పాయింట్లకు మరింతగా చేరువ అయింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త శిఖరాలకు చేరాయి. వరుసగా ఐదో రోజూ నిఫ్టీ జీవిత కాల గరిష్ట స్థాయిలో ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ జోరుకు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు, లోహ షేర్లు కూడా జతకావడంతో సెన్సెక్స్‌ 137 పాయింట్ల లాభంతో 38,024 పాయింట్ల వద్ద, నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 11,471 పాయింట్ల వద్దకు చేరాయి. ఆరంభంలో లాభపడిన ఫార్మా షేర్లు చివర్లో పతనమయ్యాయి.  

11 రోజుల్లో 1,000 పాయింట్లు.. 
ట్రేడింగ్‌ ఆరంభంలోనే సెన్సెక్స్‌ 38,000 పాయింట్లపైకి ఎగసింది. కొనుగోళ్ల జోరుతో 187  పాయింట్ల లాభంతో 38,076 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయికి చేరింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ కారణంగా ఈ లాభాల జోరు నెమ్మదించింది. ఇక నిఫ్టీ 11,495 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ హైని తాకింది. గత నెల 26న సెన్సెక్స్‌ 37,000 పాయింట్లను అధిగమించింది. కేవలం 11 ట్రేడింగ్‌ సెషన్లలోనే వెయ్యి పాయింట్లు జత చేసుకుని 38,000 పాయింట్లకు చేరుకుంది. దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు కొనసాగుతుండటం, కంపెనీల క్యూ1 ఫలితాలు ఆశించిన స్థాయి కంటే మెరుగ్గానే ఉంటుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ అంతకంతకూ బలపడుతోందని నిపుణులంటున్నారు. ముడి చమురు ధరలు తక్కువ స్థాయిలోనే ఉండటం కలసివస్తోందని వారంటున్నారు. అమెరికా విధించిన సుంకాలకు ప్రతిగా చైనా కూడా సుంకాలు విధించడంతో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా, మన మార్కెట్‌ మాత్రం ముందుకే దూసుకుపోతోంది.  

బ్యాంక్‌ షేర్లు భళా... 
శుక్రవారం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నది. ఈ ఫలితాలపై ఆశావహ అంచనాలతో ఎస్‌బీఐ గత కొన్ని రోజులుగా మంచి లాభాలు సాధిస్తోంది. ఈ షేర్‌ 2.5 శాతం లాభంతో రూ.316కు చేరడం మిగతా బ్యాంక్‌ షేర్లకు జోష్‌నిచ్చింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌ బ్యాంక్, అలహాబాద్‌ బ్యాంక్, ఓబీసీ, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, షేర్లు 3–4 శాతం రేంజ్‌లో పెరిగాయి.  

►ఐసీఐసీఐ బ్యాంక్‌ 5 శాతం వరకూ లాభపడింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. మొండి బకాయిల విషయమై వ్యతిరేకంగా వచ్చిన వార్తలకు ఈ బ్యాంక్‌ వివరణ ఇవ్వడంతో ఈ షేర్‌ పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ దిగ్గజ రీసెర్చ్‌ సంస్థ, మోర్గాన్‌ స్టాన్లీ ఈ షేర్‌ రెండేళ్ల కాలంలో రెట్టింపవుతుందన్న అంచనాలను వెల్లడించడం కూడా సానుకూల ప్రభావం చూపించింది.  దీం తో ఈ షేర్‌ ఇంట్రాడేలో 9% వరకూ ఎగసింది. చివరకు 5% లాభంతో రూ.333 వద్ద ముగిసింది.  షేర్‌ ధర జోరుగా పెరగడంతో బ్యాంక్‌  మార్కెట్‌ క్యాప్‌ రూ.9,519 కోట్లు పెరిగి రూ.2,14,176 కోట్లకు చేరింది. ఫలితాలు వెల్లడైనప్పటి (గత నెల 27) నుంచి ఈ షేరు 14% ఎగసింది.  

►ఈ క్యూ1లో నికర లాభం 46 శాతం పెరగడంతో పేజ్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై, 32,750ను తాకింది. చివరకు 7 శాతం లాభంతో రూ.32,309 వద్ద ముగిసింది. ఈ షేర్‌ ఏడాది కనిష్ట స్థాయి, రూ.15,089గా ఉంది. ఈ షేర్‌తో పాటు మరికొన్ని షేర్లు కూడా ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైలను తాకాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, గ్రాఫైట్‌ ఇండియా, ఆర్తి ఇండస్ట్రీస్, అతుల్, బజాజ్‌ ఫైనాన్స్, బాటా ఇండియా, హావెల్స్‌ ఇండియా, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్,  విఐపీ ఇండస్ట్రీస్, వరుణ్‌ బేవరేజెస్‌ షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top