వేగంగా కోలుకున్న మార్కెట్‌

వేగంగా కోలుకున్న మార్కెట్‌ - Sakshi


జీఎస్‌టీ వసూళ్ల ఎఫెక్ట్‌

సెన్సెక్స్‌ 258, నిఫ్టీ 88 పాయింట్లు అప్‌




ముంబై: ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగంతో క్రితం రోజు కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌ బుధవారం వేగంగా కోలుకుంది. కొరియా దూకుడుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆచితూచి స్పందించడంతో ప్రపంచ ట్రెండ్‌ సానుకూలంగా మారిన నేపథ్యం..జూలై నెలలో జీఎస్‌టీ పన్ను వసూళ్లు లక్ష్యాన్ని మించి రూ. 92,283 కోట్లు వసూలయ్యాయన్న వార్తలతో గ్యాప్‌అప్‌తో మొదలైన మార్కెట్‌ రోజంతా లాభాల్ని నిలబెట్టుకోవడం విశేషం. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 258 పాయింట్లు జంప్‌చేసి 31,464 పాయింట్ల వద్ద ముగిసింది. మంగళవారం సెన్సెక్స్‌ 360 పాయింట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 88 పాయింట్లు ర్యాలీ జరిపి 9,884 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. తాజా ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ. 1.54 లక్షల కోట్ల మేర పెరిగింది.



వెలుగులో ఆయిల్, మెటల్‌ షేర్లు...

బుధవారంనాటి ర్యాలీని ఆయిల్, మెటల్, ఫైనాన్షియల్‌ షేర్లు ముందుండి నడిపించాయి. పెట్రో మార్కెటింగ్‌ కంపెనీలైన ఇండియన్‌ ఆయిల్, హెచ్‌పీసీఎల్‌లు 4–5 శాతం మధ్య ర్యాలీ జరిపి ఆల్‌టైమ్‌ గరిష్టస్థాయి వద్ద ముగిసాయి. 3 శాతంపైగా పెరిగిన బీపీసీఎల్‌ రూ. 521 వద్ద క్లోజయ్యింది. ఈ షేరు రికార్డుస్థాయికి మరో 2 శాతం దూరంలో వుంది. ఆయిల్‌ ఇండెక్స్‌లో భాగమైన మరో దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2 శాతంపైగా పెరిగి రూ. 1,564 వద్ద క్లోజయ్యింది.



విప్రో బైబ్యాక్‌కు షేర్‌హోల్డర్ల అనుమతి

దేశంలో మూడో పెద్ద ఐటీ కంపెనీ విప్రో ప్రతిపాదించిన రూ. 11,000 కోట్ల బైబ్యాక్‌కు షేర్‌హోల్డర్ల అనుమతి లభించింది. షేరుకు రూ. 320 ధరతో 34.37 కోట్ల షేర్ల కొనుగోలుకు గత నెలలో విప్రో బైబ్యాక్‌ ప్రతిపాదనను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనకు మెజారిటీ షేర్‌హోల్డర్లకు పోస్టల్‌ బ్యాలెట్, ఈ–ఓటింగ్‌ ద్వారా ఆమోదం తెలిపినట్లు కంపెనీ బుధవారం స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు సమాచారం ఇచ్చింది. ఆగస్టు 28న ముగిసిన ఓటింగ్‌లో 99.68 శాతం ఓట్లు బైబ్యాక్‌కు అనుకూలంగా వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ వార్త నేపథ్యంలో విప్రో షేరు స్వల్ప పెరుగుదలతో రూ. 291.40 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top