సెన్సెక్స్‌  181 పాయింట్లు అప్‌ 

The stock market ended in profit - Sakshi

వచ్చే వారం చైనా–అమెరికా చర్చలు

ప్రపంచ మార్కెట్లలో రిలీఫ్‌ ర్యాలీ

మన మార్కెట్లో కొన్ని షేర్లలో వేల్యూ బయింగ్‌

రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌

181 పాయింట్లు పెరిగి 35,695కు సెన్సెక్స్‌

55 పాయింట్ల లాభంతో 10,727కు నిఫ్టీ 

ఇటీవలి నష్టాల కారణంగా పతనమైన బ్యాంక్, లోహ, వాహన. టెలికం షేర్లలో వేల్యూ బయింగ్‌ చోటు చేసుకోవడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. మరోవైపు అమెరికా– చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు చర్చలు జరగనున్నాయన్న వార్తల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో రిలీఫ్‌ ర్యాలీ చోటు చేసుకోవడం సానుకూల ప్రభావం చూపించింది. రూపాయి బలపడటం వల్ల ఒకింత ఒడిదుడుకుల చోటు చేసుకున్నాయి.  ఇంట్రాడేలో 132 పాయింట్లు నష్టపోయినప్పటికీ, చివరకు సెన్సెక్స్‌  181 పాయింట్ల లాభంతో 35,695 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 10,727 పాయింట్ల వద్దకు చేరింది.  దీంతో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది.   వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 382 పాయింట్లు, నిఫ్టీ 133 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. టెలికం, లోహ, యుటిలిటీస్, ఆర్థిక రంగ షేర్లు లాభపడ్డాయి. రూపాయి పుంజుకోవడంతో ఐటీ షేర్లు నష్టపోయాయి.  

ప్రపంచ మార్కెట్లలో రిలీఫ్‌ ర్యాలీ.. 
వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు  చర్చల నిమిత్తం అమెరికా అధికారుల బృందం వచ్చే వారం చైనాలో పర్యటించనున్నదని చైనా వాణిజ్య శాఖ వెల్లడించింది. వచ్చే సోమ, మంగళ వారాల్లో చర్చలు జరగనున్నాయని పేర్కొంది. ఈ వార్తలు ప్రపంచ మార్కెట్లలో రిలీఫ్‌ ర్యాలీకి కారణమయ్యాయి. జపాన్‌ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరప్‌ మార్కెట్లన్నీ లాభాల్లోనే ముగిశాయి.  

362 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌... 
ఆసియా మార్కెట్ల సానుకూలతతో సెన్సెక్స్‌  లాభాల్లోనే ఆరంభమైంది. ఆరంభ కొనుగోళ్ల జోరుతో ఈ లాభాలు కొనసాగాయి. ఆ తర్వాత గంటసేపు నష్టాల్లో కదలాడిన సెన్సె క్స్‌ మళ్లీ లాభాల బాట పట్టింది. చివరి గంటన్నర వరకూ పరిమిత శ్రేణిలో కదలాడి, ఆ తర్వాత పుంజుకొని లాభాల జోరును కొనసాగించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top