హైదరాబాద్‌కు కొత్త విమానసంస్థ సేవలు






హైదరాబాద్‌
: శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ నేటి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తన సేవలు ప్రారంభించింది. వారానికి నాలుగుసార్లు హైదరాబాద్‌కు తమ విమానాలను నడుపనున్నట్టు ఈ ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది.  ఈ సర్వీసులతో హైదరాబాద్‌ను తమ గ్లోబల్‌ రూట్‌ నెట్‌వర్క్‌ ద్వారా ప్రపంచానికి కలుపనున్నట్టు తెలిపింది. ఈ వారంలో దక్షిణ భారతదేశంలో శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ సేవలు ప్రారంభిస్తున్న మూడు నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. జూలై 8నే విశాఖపట్నం నుంచి తన సేవలను ప్రారంభించింది. ఇక కోయంబత్తూర్‌కు దీని సేవలు జూలై 16 నుంచి ప్రారంభం కానున్నాయి.. ప్రస్తుతం శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌ చెన్నై, త్రివేండ్రం, ట్రిచీ, ముంబై, న్యూఢిల్లీ, గయా, మధురై, వారణాసి, కొచ్చి, బెంగళూరు, కోల్‌కత్తాలకు తన సర్వీసులు అందజేస్తోంది.



 ''హైదరాబాద్‌కు మా సేవలను విస్తరించడం చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్‌ మా గ్లోబల్‌ నెట్‌వర్క్‌కు అతి ముఖ్యమైనది. ఈ నూతన సర్వీసు ద్వారా ఆసియన్‌ మార్కెట్‌ను సంఘటితం చేయాలనే శ్రీలంకన్ స్థిరమైన నిబద్ధత ప్రతిబింబిస్తోంది. ప్రయాణికులకు అత్యుత్తమ సౌకర్యంతో ప్రయాణ అనుభవాలను అందిస్తాం'' అని శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ శివరామచంద్రన్‌ చెప్పారు. శ్రీలంకన్‌ నూతన సేవలు హైదరాబాద్‌ నుంచి ప్రయాణీకులు శ్రీలంకలో ఎన్నో పర్యాటక ప్రాంతాల్లో వీక్షించే రీతిలో ఉంటాయని తెలిపారు. ఎంతోమంది పర్యాటకులకు ఈ చిన్నదీవి అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతంగా నిలుస్తోందని ఈ ఎయిర్‌లైన్స్‌ చెబుతోంది . శ్రీలంకన్‌ అంతర్జాతీయ రూట్‌ నెట్‌వర్క్‌ ప్రస్తుతం 47 దేశాల్లో 105 నగరాలకు విస్తరించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒన్‌వరల్డ్‌ అలయెన్స్‌ సభ్యునిగా శ్రీలంకన్‌, 160 దేశాల్లోని 1000 నగరాలకు కనెక్టివిటీని, ప్రయాణీకులకు తమ ఒన్‌ వరల్డ్‌ పార్టనర్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా అందిస్తోంది.













 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top